logo

రాజకీయ చట్రంలో తహసీల్దార్లు

తాడిపత్రి తహసీల్దార్‌ స్థానంపై వివాదం తలెత్తింది. ఐదు రోజులుగా లోలోపలే ‘రాజకీయ’ అగ్గి రాజుకుంటోంది. తాడిపత్రికి కొత్త తహసీల్దార్‌ వద్ధు. ఇప్పుడు ఉన్న వారే కొనసాగుతారంటూ కీలక ప్రజాప్రతినిధి

Published : 07 Jul 2022 03:17 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: తాడిపత్రి తహసీల్దార్‌ స్థానంపై వివాదం తలెత్తింది. ఐదు రోజులుగా లోలోపలే ‘రాజకీయ’ అగ్గి రాజుకుంటోంది. తాడిపత్రికి కొత్త తహసీల్దార్‌ వద్ధు. ఇప్పుడు ఉన్న వారే కొనసాగుతారంటూ కీలక ప్రజాప్రతినిధి తెగేసి చెప్పారు. అయితే ‘మీకు ఇచ్చిన గడువు పూర్తి అయింది. బుధవారం లోపు బదిలీ స్థానంలో చేరకపోతే క్రమశిక్షణ చర్య తప్పదు’.. అంటూ స్వయంగా కీలక అధికారే ఆ తహసీల్దార్‌కు హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు ఏమి జరిగిందంటే.. గత నెల 30న జిల్లా వ్యాప్తంగా 23 మంది తహసీల్దార్లను కలెక్టర్‌ నాగలక్ష్మి సాధారణ బదిలీ చేశారు. 23 మందిలో 21 మంది నిర్దేశిత బదిలీ స్థానాల్లో చేరారు. కాని ఉరవకొండ తహసీల్దార్‌ మునివేలును తాడిపత్రికి, ఇక్కడి తహసీల్దార్‌ నాగభూషణంను ఆత్మకూరుకు బదిలీ చేయగా వారు చేరలేదు. బదిలీ స్థానంలో ఎందుకు చేరలేదు. ఆరు రోజులు గడిచినా స్పందించరా.. ఈ రోజులోపు(బుధవారం) చేరకపోతే క్రమశిక్షణ చర్య తప్పదు’ అంటూ స్వయంగా జిల్లా అధికారే తాడిపత్రి తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి కటువుగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆగమేఘాలపై సదరు తహసీల్దార్‌ బదిలీ పొందిన ఆత్మకూరు తహసీల్దార్‌గా బుధవారం విధుల్లో చేరినట్లు సమాచారం. కాని.. ఉరవకొండ తహసీల్దార్‌ మాత్రం బుధవారం దాకా అక్కడి విధుల్లోనే ఉన్నారు. ఇంకా రిలీవ్‌ కాలేదు. బదిలీ పొందిన తాడిపత్రిలో చేరుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఏది ఏమైనా తహసీల్దార్లు ‘రాజకీయ’ చట్రంలో ఇరుక్కుని విలవిల్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని