logo

గొలుసు దొంగల అరెస్టు

మహిళల మెడలో గొలుసులను అపహరించే రెండు ముఠాలను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఫక్కీరప్ప వివరాలు వెల్లడించారు. కడప జిల్లా

Published : 07 Jul 2022 03:17 IST

అరెస్టు చేసిన ముఠా సభ్యులు, స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: మహిళల మెడలో గొలుసులను అపహరించే రెండు ముఠాలను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఫక్కీరప్ప వివరాలు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణానికి చెందిన పూల నవీన్‌కుమార్‌, పూల నిఖిల్‌, చెన్నూరు గ్రామానికి చెందిన కామేపర్తి శివకుమార్‌ ముఠా సభ్యులు. వీరి నుంచి రూ.28 లక్షలు విలువ చేసే 48 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పూల నవీన్‌కుమార్‌, పూల నిఖిల్‌ అన్నదమ్ములు. నవీన్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిఖిల్‌ ఎలక్ట్రిషియన్‌గా తిరుపతిలోని ఓ పరిశ్రమలో పని చేసేవాడు. ఇద్దరు వేర్వేరుగా ప్రేమలో పడ్డారు. ఆ అమ్మాయిలతో కలసి గత ఏప్రిల్‌లో తాడిపత్రికి మకాం మార్చారు. కుటుంబ పోషణకు అవసరమైన సంపాదన లేకపోవడంతో గొలుసు దొంగతనాల బాట పట్టారు. ఇదే క్రమంలో పెయింటర్‌గా జీవనం సాగిస్తున్న శివకుమార్‌తో పరిచయం ఏర్పడి ముఠాగా ఏర్పడ్డారు. వీధుల్లో ఒంటరిగా తిరిగే మహిళలను లక్ష్యంగా చేసుకొని ముగ్గురు ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్లి చోరీలకు పాల్పడ్డారు.

రాయచూరుకు చెందిన ఇద్దరు చోరులు..

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన మోడికర్‌ పరశు ఆలియాస్‌ పరశురాం, మోడికర్‌ వెంకప్పలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 41 గ్రాములు బంగారు ఆభరణాలు, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ముఠాలను అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐలు రవిశంకర్‌రెడ్డి, వహీద్‌బాష ప్రత్యేక బృందంగా ఏర్పడి పట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని