logo
Published : 06 Aug 2022 05:34 IST

చెరువు బాగయ్యేనా.. జెండా ఎగిరేనా..!

అమృత్‌ సరోవర్‌ పనులపై నిర్లక్ష్యం

అనంతపురం (లక్ష్మీనగర్‌), కళ్యాణదుర్గం గ్రామీణం, కుందుర్పి, గుమ్మఘట్ట, న్యూస్‌టుడే: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాత చెరువుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అమృత్‌ సరోవర్‌ నిర్మాణ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి జిల్లాలో 1468 చెరువులను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. తొలి దశలో అనంతపురం జిల్లాలో 20, శ్రీసత్యసాయి జిల్లాలో 5 చెరువులను ఎంపిక చేశారు. గత ఏప్రిల్‌లో పనులు మంజూరు చేశారు. చెరువులు, కుంటల్లో నీటి సామర్థ్యం పెంచాలన్నది ప్రధాన ఉద్దేశం. ఉపాధి పథకం కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి, ఆ రోజున చెరువుల వద్ద జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు ఒక్కచోట కూడా పనులు పూర్తయిన దాఖలాలు లేవు.


మమ అనిపించేశారు

గుమ్మఘట్ట మండలం నేత్రపల్లి చెరువులో పూడిక తీసి, కట్ట పటిష్టం కోసం రూ.6.05 లక్షలు కేటాయించారు. మేలో పనులు ప్రారంభించి, మూడు వారాలు చేశారు. 15 ఎకరాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌, పూడిక తీత, సుమారు 333 మీటర్ల కట్టకు మట్టి వేయడం, వంద మొక్కలు నాటించినట్లు అధికారులు పేర్కొన్నా.. అన్నీ అరకొరగానే చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

- గుమ్మఘట్ట


దీనిపై డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15 నాటికి ఉమ్మడి జిల్లాలో 25 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు.

ఉపాధి సిబ్బంది అలసత్వం
గుర్తించిన చెరువుల్లో పూడిక, ముళ్లకంపల తొలగింపు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. పనులు మొదలు పెట్టడంలో ఉపాధి సిబ్బంది అలసత్వం ప్రదర్శించారు. నెలలు గడిచినా నేటికీ చాలాచోట్ల మొదలవలేదు. పూడిక మట్టిని రైతుల పొలాలకు తరలించుకునే వెసులుబాటు కల్పించారు. పంట సాగు మొదలైనా అలాంటిదేమీ కనిపించలేదు. వేసవిలోనే పనులు జరిగి ఉంటే ప్రయోజనం కలిగేది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పనులెలా చేస్తారో? వేడుకలు ఎలా నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.


47 శాతమే పూర్తి

కుందుర్పి మండలం కరిగానిపల్లిలోని నీటి కుంట మరమ్మతుకు రూ.4.62 లక్షలు మంజూరు చేశారు. జులైలో పనులు ప్రారంభించగా.. ఇప్పటివరకూ 47 శాతం పూర్తిచేసి, రూ.2.20 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో కుంటలోకి నీరు చేరింది. కట్టకు రంధ్రం ఏర్పడి నీరు వృథాగా పోతోంది. అమృత్‌ సరోవర్‌ పథకం పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.

- కుందుర్పి


అరకొరగానే..

గార్లదిన్నె మండలం బూదేడు చెరువు అభివృద్ధికి రూ.8.33 లక్షలు కేటాయించారు. జూన్‌లో పనులు ప్రారంభించగా నత్తనడకన సాగుతున్నాయి. పూడికతీత, గట్టు పటిష్టం, ముళ్ల కంప తొలగింపు పనుల్లో ఒక్కటీ పూర్తి కాలేదు. ప్రస్తుత వర్షాలకు చెరువులో నీరు చేరుతుండటంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయినా జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు.

- గార్లదిన్నె గ్రామీణం

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని