logo

Anantapur news : కళ్లముందే కబ్జా!

ముదిగుబ్బ మండలంలో భూ ఆక్రమణలు ఆగడం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. స్థానిక నాయకులు కొందరు బృందంగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated : 07 Aug 2022 11:47 IST

రూ.కోటి విలువైన స్థలం ఆక్రమణ

ముదిగుబ్బలో ఆగని దందా

సర్వే నంబరు 1190-3లోని ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న నిర్మాణం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ముదిగుబ్బ మండలంలో భూ ఆక్రమణలు ఆగడం లేదు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. స్థానిక నాయకులు కొందరు బృందంగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా గుంజేపల్లి రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబరు 1190-3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. సమీపంలోని స్టేడియానికి వెళ్లే 50 అడుగుల దారిని సైతం కలిపేసుకుని హోటల్‌ నిర్మాణం సాగిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని కబ్జా పర్వం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 25 సెంట్ల ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా.

మొదటికొచ్చిన ఆక్రమణల పర్వం
ముదిగుబ్బ కేంద్రంగా గతంలో పెద్దఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ‘ఈనాడు’లో వరుస కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో పనిచేసిన అధికారి కఠినంగా వ్యవహరించడంతో స్థానిక అధికార పార్టీ నాయకులు ఆయన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేయించారు. తర్వాత తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌ ఇప్పించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారి సహకారంతోనే ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గుంజేపల్లి పరిధిలోని 1330, 896, 1036, 2060 సర్వే నంబర్లలో భూముల్ని ఆక్రమించి క్రయవిక్రయాలు జరిపారు. వీటిపై వార్తలు రావడంతో అధికారులు ఆయా స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాల్లోనూ మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించారు. ఆక్రమణల పర్వం మళ్లీ మొదటికొచ్చింది.

విచారణ చేపడతాం
నాగేంద్ర, తహసీల్దార్‌, ముదిగుబ్బ
గుంజేపల్లి పరిధిలోని సర్వే నంబరు1190-3లో దారిని ఆక్రమించిన విషయం ఇటీవలే నా దృష్టికి వచ్చింది. నేను కూడా ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో పూర్తి అవగాహన లేదు. వెంటనే విచారణ జరుపుతాం. ఆక్రమణలు నిజమని తేలితే స్థలాన్ని స్వాధీనం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

గతంలో అడ్డుకున్నా..
గుంజేపల్లి సర్వే నంబరు 1190లో మొత్తం మూడు సబ్‌డివిజన్లలో కలిపి 12.1 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1190-3లో గ్రామకంఠంగా ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. దీన్ని కొంతమంది పేదలకు గతంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న 826 సర్వే నంబరులోని స్థలాన్ని స్టేడియం నిర్మాణానికి కేటాయించారు. జాతీయ రహదారి నుంచి స్టేడియానికి వెళ్లడానికి సర్వే నంబరు 1190-3 మీదుగా 50 అడుగుల రహదారి ఉన్నట్లు గ్రామ పటంలో స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని నెలల కిందట రహదారిని ఆక్రమించి పునాదులు తీస్తుండటంతో కొందరు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టడంతో కొద్దిరోజులు నిర్మాణాన్ని నిలిపేశారు. మళ్లీ నెలరోజులుగా జోరుగా హోటల్‌ నిర్మాణం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని