logo

మెరిసె.. మురిసె

తాడిపత్రిలోని మెయిన్‌బజార్‌ అమ్మవారిశాల వీధికి చెందిన సాయిప్రసాద్‌, పద్మావతి కుమార్తె జయవైష్ణవి జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ఇండియా స్థాయిలో 700 ర్యాంకు సాధించింది. విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసింది.

Published : 09 Aug 2022 04:07 IST

జేఈఈ మెయిన్స్‌లో భళా

జేఎన్‌టీయూ,తాడిపత్రి, గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయిలో జరిగిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షల్లో అనంత విద్యార్థులు సత్తా చాటారు. ఎన్‌టీఏ (నేషనల్‌ టెక్నికల్‌ ఏజెన్సీ) ఈ పరీక్ష నిర్వహించింది. జూన్‌ 24 నుంచి వారం రోజుల పాటు మొదటి సెషన్‌ పరీక్షలు జరిగాయి. రెండోసెషన్‌ జులై 25 నుంచి 30 వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అందులో ఉమ్మడి జిల్లా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. వీరితో పాటు తల్లిదండ్రుల్లో ఆనందం నెలకొంది.


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా స్థిరపడతా

తాడిపత్రిలోని మెయిన్‌బజార్‌ అమ్మవారిశాల వీధికి చెందిన సాయిప్రసాద్‌, పద్మావతి కుమార్తె జయవైష్ణవి జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ఇండియా స్థాయిలో 700 ర్యాంకు సాధించింది. విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసింది. ఇంటర్‌లో 981 మార్కులు, ఎంసెట్‌లో 62 ర్యాంకు సాధించినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. దిల్లీ ఐఐటీలో సీటు సాధించి, సాప్ట్‌వేర్‌ ఉద్యోగినిగా స్థిరపడాలన్నదే లక్ష్యమని విద్యార్థిని తెలిపింది.      


అడ్వాన్డ్స్‌లోనూ సత్తా చాటుతా

అనంతపురం షిర్డీనగర్‌కు చెందిన వెంకటరఘు, శశికళ దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు పరిమి నిష్ణాత్‌ జేఈఈ మెయిన్స్‌లో 683వ ర్యాంకు సాధించాడు. ఇటీవల విడుదలైన ఈఏపీసెట్‌లో 109 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఈనెల 28 నుంచి జరిగే జేఈఈ అడ్వాన్డ్స్‌ పరీక్షలపై దృష్టి పెట్టానని, అందులో మంచి ర్యాంకు సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.


సివిల్స్‌ సాధిస్తా

గుంతకల్లు పట్టణానికి చెందిన మాజీ సర్పంచి భాస్కర్‌ కుమార్తె రిష్మితచౌదరి జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో మహిళా కోటాలో 875 ర్యాంకు సాధించగా.. ఆల్‌ ఇండియా స్థాయిలో 7,012 జనరల్‌ ర్యాంకు సాధించింది. 99.23 శాతం మార్కులు వచ్చాయి. పదిలో 10కి 10 పాయింట్లు, ఇంటర్‌లో 932 మార్కులతో ప్రతిభ చాటింది. మంచి ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సివిల్స్‌ సాధిస్తానని విద్యార్థిని తెలిపింది.  


కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరునవుతా..

అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన దంపతులు ఎం.శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, స్వర్ణలత ప్రధానోపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరి కుమార్తె శ్రీజన్య ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో చదివింది. జేఈఈ మెయిన్స్‌లో 2,107 ర్యాంకు సాధించింది. కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరు కావడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది.


ఐఏఎస్‌ సాధించడమే ధ్యేయం

బెళుగుప్ప మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర, మీనాక్షి దంపతుల తనయుడు సాయిమోక్షిత్‌ దివ్యాంగుల కేటగిరీలో జాతీయస్థాయిలో 19వ ర్యాంకు సాధించాడు. అనంతపురంలోని ఓ కళాశాలలో చదివాడు. అధ్యాపకులు ఇచ్చిన శిక్షణ జేఈఈలో ర్యాంకు సాధించడానికి దోహదపడిందని తెలిపాడు. ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని చెప్పాడు.


కష్టపడి చదివా

తాడిపత్రిలోని కృష్ణాపురం జీరో రోడ్డుకు చెందిన ఉపాధ్యాయులు ఉపేంద్ర, ప్రమీల దంపతుల కుమారుడు వంశీధర్‌. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 1,284 ర్యాంకు సాధించాడు. విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ అభ్యసించాడు. ఇంటర్‌లో 970, ఎంసెట్‌లో 1104 ర్యాంకు సాధించినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. ఐఐటీలో సీటు సాధించాలన్న లక్ష్యంతో కష్టపడి చదివినట్లు విద్యార్థి తెలిపాడు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts