logo

బాపూ మాట చైతన్య బాట!

మహాత్ముడు సత్యం, అహింసలే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపించారు. బోసి నవ్వుతోనే బ్రిటీషు పాలకులను గడగడలాడించారు. చేతికర్రతో దేశమంతా తిరిగి దేశవాసుల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం

Published : 09 Aug 2022 04:14 IST

గాంధీ రాకతో ఉద్యమానికి ఊపిరి
పులకించిన అనంత


ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, పెద్దవడుగూరు, గుంతకల్లు, తాడిపత్రి

హాత్ముడు సత్యం, అహింసలే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపించారు. బోసి నవ్వుతోనే బ్రిటీషు పాలకులను గడగడలాడించారు. చేతికర్రతో దేశమంతా తిరిగి దేశవాసుల్ని కార్యోన్ముఖుల్ని చేశారు. పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాలను స్వాతంత్య్రం అనే తాటిపై నడించారు. ఆంగ్లేయుల్ని తరిమికొట్టేందుకు ప్రజలందరినీ ఏకం చేశారు. ఉద్యమంలో ప్రతి పౌరుడిని భాగస్వామి చేయాలని దేశమంతా తిరిగారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో అడుగుపెట్టారు. గుత్తి, పెద్దవడుగూరు, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి నాయకులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన పాదస్పర్శతో అనంత పులకించింది. మహాత్ముడి స్ఫూర్తితో జిల్లాలో ఉద్యమం పతాకస్థాయికి వెళ్లింది. ఆయన మాటలు చైతన్యం నింపాయి. జాతీయ భావాన్ని పెంచాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా మహాత్మ గాంధీ నడయాడిన నేల, ఆనాటి సంగతుల గురించి ప్రత్యేక కథనం.

తాడిపత్రిలోనూ..

ఉద్యమాన్ని నడిపించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో విరాళాలు సేకరించాలని గాంధీ నిర్ణయించారు. లోకమాన్య తిలక్‌ నిధి పేరుతో విరాళాలు తీసుకున్నారు. జిల్లాలోని ఉద్యమ నేతల ఆహ్వానం మేరకు 1921లో గాంధీజీ మద్రాసు నుంచి తాడిపత్రికి వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గాంధీ ప్రసంగానికి స్ఫూర్తి పొందిన మహిళలు తమ ఒంటిమీద ఆభరణాలు విరాళంగా ఇచ్చారు.

స్వదేశీ ‘సూత్రం’ నేర్పించి..

ఆంగ్లేయులకు సహాయ నిరాకరణలో భాగంగా దేశంలోని చేనేత వస్త్రాలనే ధరించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. స్వయంగా నూలు వడికి అందరిలో స్ఫూర్తి నింపారు. ఈ ఉద్యమంలో భాగంగానే ఆయన 1930లో ధర్మవరంలో పర్యటించారు. విదేశీ వస్త్ర్రాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. స్థానికంగా తయారుచేసే ఖద్దరునే ధరించాలని సూచించారు. స్థానిక నేతలు ధర్మవరం పట్టు వస్త్రాల గురించి ఆయనకు ప్రత్యేకంగా వివరించారు.

స్ఫూర్తి నింపిన ప్రసంగం

పెద్దవడుగూరు బహిరంగ సభలో మహాత్ముడు సమానత్వం గురించి చెప్పిన మాటలు స్థానికుల్లో స్ఫూర్తి నింపాయి. ‘మన సమాజంలో ఇంతకాలం హరిజనులపై చూపిన నిర్లక్ష్యానికి ప్రాయశ్చిత్తంగా వారి అభ్యున్నతికి కొంత విరాళం ఇస్తే సరిపోదు. శారీరకమైన అంటరానితనాన్ని పోగొట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. భేదభావాన్ని మనసులో నుంచి పారద్రోలాలి. మానసిక నిగ్రహం ఉంటే ఇది చాలా తేలికయిన పనే. అస్పృశ్యత కొనసాగితే హిందూమతం అదృశ్యం అవుతుంది’ అని తెలియజేశారు. ఆయన అడుగిడిన ప్రాంతమైన ప్రధాన రహదారికి గాంధీరోడ్డు అని నామకరణం చేశారు. గాంధీజీ ఉపన్యాసంతో పలువురు యువకులు ఆకర్షితులై స్వాతంత్య్రోదమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.

కేశమ్మ.. సత్యాగ్రహం

గాంధీ ప్రసంగానికి చైతన్యవంతురాలైన స్థానిక మహిళ కేశమ్మ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జిల్లాలో సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి మహిళగా పేరొందారు. ఈమె 1946-49 మధ్యలో అనాథశరణాలయం నిర్వహణ బాధ్యత చేపట్టారు. దేశంలో అంటరానితనాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

విరాళంగా.. ఒంటిపై బంగారం

గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని పలుప్రాంతాల నుంచి వచ్చిన కొందరు విరాళాలు ఇచ్చారు. పెద్దవడుగూరుకు చెందిన హంపమ్మ తన ఒంటిమీద నగలను అందించారు. కర్నూలు జిల్లా నల్లమేకలపల్లికి చెందిన ఓ యువకుడు హరిజన నిధికి రూ.30 విరాళంగా అందించారు. ఆరోజు అయిదున్నర కిలోల బంగారం, రూ.27 వేలు విరాళంగా గాంధీజీకి అందించారు.


ఎముకలు కొరికే చలిలో..

కుమ్మెత చిన్నారపరెడ్డి

పెద్దవడుగూరు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కుమ్మెత చిన్నారపరెడ్డి ఆహ్వానం మేరకు హరిజనోద్యమంలో భాగంగా 1934 జనవరి 3న గాంధీజీ వచ్చారు. ఆరోజు తెల్లవారుజామున 3.15 గంటలకు గాంధీ గుత్తి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. కల్లూరి సుబ్బారావు, రాజావెంకట్రామయ్య మహాత్ముడిని తమ కారులో పెద్దవడుగూరు తీసుకొచ్చారు. 4.30 గంటలకు చేరుకున్నారు. ఆరోజు రాత్రంతా ఎముకలు కొరికే చలిలోనూ వేలాది మంది గాంధీ రాకకోసం ఎదురు చూసి.. ఘనస్వాగతం పలికారు. ఉదయం 7 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో గాంధీ ప్రసంగించారు. ఆయన హిందీలో మాట్లాడుతుంటే గుత్తికి చెందిన హిందీ పండిట్‌ శ్రీసత్యనారాయణ తెలుగులోకి అనువదించి ప్రజలకు వివరించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల పక్షాన చిన్నారపురెడ్డి ఒక సన్మాన పత్రంతోపాటు రూ.1,116 విరాళంగా ఇచ్చారు. ఆ సాయాన్ని కేశవపిళ్లై స్మృతికి చిహ్నంగా హరిజనుల కోసం నిర్మించిన కేశవ విద్యాలయానికి ఇస్తున్నట్లు గాంధీ ప్రకటించారు.

పెద్దవడుగూరులో గాంధీజీ


గాంధీజీ కళ్లు చెమ్మగిల్లిన వేళ

క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా గాంధీ 1942లో గుంతకల్లుకు చెందిన పెద్దరాయప్ప ఇంటికి వచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరికేరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉండేది. ఆ కుటుంబం గురించి తెలుసుకున్న గాంధీ వారి ఇంటికి వెళ్లి అరికేరి సోదరులను ఉద్యమంలో పాల్గొనాలని, ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు. గాంధీ అడిగిన వెంటనే పెద్దరాయప్ప తల్లి ఉలిగమ్మ, కుటుంబంలోని మహిళలు వారి ఒంటిపై ధరించిన బంగారు నగల్ని ఇచ్చేశారు. పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మహిళలు బంగారు నగలను అందించినప్పుడు గాంధీ కళ్లు చెమ్మగిల్లాయట. మహిళల త్యాగాన్ని కొనియాడారు. మహాత్ముడు అడుగు పెట్టిన తమ ఇల్లు పునీతమైందని కుటుంబ సభ్యులు పొంగిపోతున్నారు. అరికేరి పెద్దరాయప్ప ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతపురం జిల్లా బోర్డు మొదటి అధ్యక్షుడిగా కొనసాగారు. చిన్న రాయప్ప కుమారుడు అరికేరి జగదీష్‌ గుంతకల్లు మున్సిపల్‌ అధ్యక్షుడిగా, గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని