logo

గంటకు 130 కి.మీ. వేగానికి అంతా సిద్ధం!

రైళ్లు మరింత వేగంగా నడిపేందుకు రంగం సిద్ధమైంది. ముంబయి- చెన్నై రైలు మార్గంలో గుంతకల్లు డివిజన్‌ పరిధిలో ఉన్న వాడి- గుంతకల్లు, గుంతకల్లు- రేణిగుంట మధ్య మొదట రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై మెయిల్‌ రైళ్లను 130 కి.మీ.ల వేగంతో

Published : 10 Aug 2022 05:10 IST

ఎల్‌హెచ్‌బీ బోగీతో ప్రయాణిస్తున్న చెన్నై మెయిల్‌ రైలు

గుంతకల్లు, న్యూస్‌టుడే: రైళ్లు మరింత వేగంగా నడిపేందుకు రంగం సిద్ధమైంది. ముంబయి- చెన్నై రైలు మార్గంలో గుంతకల్లు డివిజన్‌ పరిధిలో ఉన్న వాడి- గుంతకల్లు, గుంతకల్లు- రేణిగుంట మధ్య మొదట రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై మెయిల్‌ రైళ్లను 130 కి.మీ.ల వేగంతో నడపాలని రైల్వే ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. రైళ్లను వేగంగా నడపడానికి డివిజన్‌ అధికారులు రూ.90 కోట్లు వ్యయం చేసి సంవత్సరం కిందట రెండు సెక్షన్లలో రైల్వేలైన్లను బలోపేతం చేయటం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువ భాగం రైళ్లు ఉక్కుతో తయారుచేసిన బోగీలు ఉన్నవాటిని 110 కి.మీ.ల వేగంతో నడుపుతున్నారు. ఎక్కువ వేగంతో నడపడానికి ఈ బోగీలు పనికి రావని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అల్యూమినియంతో కపుర్తలతో తయారుచేసిన ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌) బోగీలు కలిగిన రైళ్లను అత్యధిక వేగంతో వాడి-గుంతకల్లు- రేణిగుంట మధ్య నడపాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సెక్షన్‌లో రాయలసీమ, చెన్నై మెయిల్‌ రైళ్లు మాత్రమే ఎల్‌హెచ్‌బీ బోగీలతో ప్రయాణిస్తున్నాయి. మొదట ఈ రెండు రైళ్లను ప్రయోగాత్మకంగా పెంచిన వేగంతో నడపాలని ఉన్నతాధికారులు తీర్మానించారు. తరువాత అంచెలవారీగా మిగిలిన రైళ్లను వేగంగా నడపాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎల్‌హెచ్‌బీ రైలు బోగీల ప్రత్యేకతలివే..

ఎల్‌హెచ్‌బీ బోగీలు తేలికగా ఉంటాయని, ప్రమాదాలు జరిగిన సమయంలో ఒక బోగీ పైకి మరొకటి వెళ్లకుండా ఉంటూ ప్రాణనష్టం కలగజేయవని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ బోగీలు రైలు పట్టాలపై వెళ్లే సమయంలో ఎక్కువ శబ్దం వెలువడదని, కదలికలు కూడా చాలా తక్కువని చెబుతున్నారు. ఈ బోగీలు చాలావరకు ప్రమాదాలకు గురికావని అధికారవర్గాలు తెలిపాయి. జోనల్‌ అధికారులు ఎల్‌హెచ్‌బీ బోగీలతో గుంతకల్లు డివిజన్‌ గుండా రైళ్లను నడపాలని రైల్వే బోర్డుకు నివేదించారు. ఒక బోగీలో 80 మంది ప్రయాణించవచ్చు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బోగీలను తయారు చేయడానికి కపుర్తల, రాయబరేలి, పెరంబూరుల్లోని కోచ్‌ల తయారీ కర్మాగారాల్లో తయారు చేస్తున్నారు. రైళ్లను 130 కి.మీ.ల వేగంతో నడపాలని ఎప్పుడు ఆదేశాలు జారీచేసినా.. శిక్షణ పొందిన సిబ్బంది వాటిని నడిపేందుకు సిద్ధంగా ఉన్నారని అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని