logo

Anantapur News : రైతే.. యజమాని!

ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మరోవైపు మార్కెట్‌లో వస్తువుల ధరలు సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాయి. రైతుకు, వినియోగదారుడికి మధ్య దళారీ జేబులోకి సొమ్మంతా వెళ్లిపోతోంది.

Updated : 10 Aug 2022 08:31 IST
ముద్దలాపురంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌
6 వేల మందికి ప్రయోజనం
నేడు ప్రారంభించనున్న మంత్రి కాకాణి

ప్రాసెసింగ్‌ యూనిట్‌

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, ఉరవకొండ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మరోవైపు మార్కెట్‌లో వస్తువుల ధరలు సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నాయి. రైతుకు, వినియోగదారుడికి మధ్య దళారీ జేబులోకి సొమ్మంతా వెళ్లిపోతోంది. ఈ దోపిడీని అరికట్టాలంటే రైతే వ్యాపారిగా మారాలి. అన్నదాతలను సంఘటితం చేసి, ఆహార పరిశ్రమల వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌, ఇక్రిశాట్‌, ఏఎఫ్‌ ఎకాలజీ సంస్థలు కృషి చేస్తున్నాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురంలో వ్యవసాయ ఉత్పత్తుల సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ‘రైతు నేస్తం ఫుడ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌’ పేరుతో రూ.5 కోట్లు వెచ్చించి యూనిట్‌ను నెలకొల్పారు. జిల్లాలోని 8 మండలాలకు చెందిన 6 వేల మంది రైతులను భాగస్వాములుగా చేశారు. స్థానికంగా పండే వేరుసెనగ, తృణ ధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసి, వచ్చిన లాభాలను రైతులకు పంచనున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఈ యూనిట్‌ను ప్రారంభించనున్నారు.

మహిళలే బోర్డు డైరెక్టర్లు

అనంతపురం-బళ్లారి జాతీయ రహదారికి ఆనుకుని ముద్దలాపురం వద్ద ఎకరా విస్తీర్ణంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నిర్మించారు. పరిశ్రమ నిర్మాణానికి రూ.3.50 కోట్లు ఖర్చు చేయగా.. రూ.1.50 కోట్లతో యంత్ర సామగ్రి కొనుగోలు చేశారు. ఇందులో వేరుసెనగ, చిరుధాన్యాలు, పప్పుదినుసులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ చేస్తారు. వేరుసెనగ ద్వారా నూనె, చిక్కీలు, చిరుధాన్యాల నుంచి రెడీ టు కుక్‌ ప్యాకెట్లు, బిస్కెట్లు తయారు చేస్తారు. వీటిని మార్కెటింగ్‌ చేయడానికి ఇక్రిశాట్‌తోపాటు ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సహకారం అందించనున్నాయి. పరిశ్రమను నడపటానికి 10 మంది రైతులు బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. వీరంతా మహిళా రైతులే కావడం విశేషం. వీరికి హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ అగ్రి బిజినెస్‌ విభాగంలో ఏడాదిపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రెండేళ్ల వరకు పరిశ్రమను ఇక్రిశాట్‌ పర్యవేక్షిస్తుంది. తర్వాత పూర్తి బాధ్యతలను మహిళా రైతులకే అప్పగిస్తారు.

యూనిట్‌లో పనిచేస్తున్న మహిళలు

క్వింటాకు రూ.వెయ్యి అదనపు ఆదాయం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 50 శాతానికిపైగా రైతులు వేరుసెనగ పండిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌లో వాల్యూ యాడెడ్‌ ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా క్వింటాకు రూ.వెయ్యి వరకు అదనపు ఆదాయం వస్తుందని ఎకాలజీ సెంటర్‌ ప్రతినిధులు చెబుతున్నారు. వేరుసెనగ నుంచి నూనె తీయగా మిగిలిన వ్యర్థాలను కూడా కిలో రూ.30 చొప్పున విక్రయించుకోవచ్చు. ఈ యూనిట్‌లో రోజుకు 6 వేల నుంచి 10 వేల వరకు బిస్కెట్లు, 500 లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల నూనె తయారు చేస్తారు. వీటితోపాటు పల్లీ మసాలాలు, బేకరీల్లో దొరికే బూందీ లాంటివి కూడా తయారు చేస్తారు. ఇందులో 30 నుంచి 50 మంది వరకు స్థానికులకు ఉపాధి కలగనుంది. భాగస్వాములైన రైతుల నుంచే కాకుండా ఇతరుల నుంచీ పంటను కొనుగోలు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని