logo

రహస్య స్థావరం..సేవా మందిరం!

స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులవి.. బ్రిటీష్‌ పాలకులు సైనికుల ద్వారా ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని అణచివేస్తున్న కాలమది.. జాతీయ నాయకుల సందేశాలు, ఉద్యమ వ్యూహాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యేవి..

Published : 12 Aug 2022 04:47 IST

బాపూ సూచనతో ఆశ్రమం

విద్యార్థి దశనుంచే దేశభక్తి

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, పరిగి, హిందూపురం అర్బన్‌: స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులవి.. బ్రిటీష్‌ పాలకులు సైనికుల ద్వారా ఎప్పటికప్పుడు ఉద్యమాన్ని అణచివేస్తున్న కాలమది.. జాతీయ నాయకుల సందేశాలు, ఉద్యమ వ్యూహాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యేవి.. పత్రికలు మినహా పెద్ద సమాచార వ్యవస్థ లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకులే కీలక పాత్ర పోషించారు. నిఘా వ్యవస్థ నుంచి తప్పించుకుని వ్యూహాల్ని అమలు చేయడానికి ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకున్నారు. సైనికుల కంట పడకుండా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమాలోచనలు జరిపారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యాలయాలను వేదికలుగా మార్చుకున్నారు. అందులో పరిగి మండలంలోని సేవా మందిరం ముఖ్యమైనది.

స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు, తమిళనాడుకు చెందిన చక్రవర్తి రాజగోపాలచారి నాయకత్వంలో ఊరికి దూరంగా పెన్నానది ఒడ్డున ఉన్న సేవామందిరంలో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. బ్రిటీష్‌ పాలకుల కంట పడకుండా కొన్నాళ్లు ఇక్కడే అజ్ఞాతవాసం చేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకులు కూడా ఇక్కడికి వచ్చేవారు. 1942లో కర్ణాటకలోని శిరా తాలుకాకు చెందిన ఏఎం.లింగణ్ణ ఈ భవనంలో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, దానికి సేవా మందిరం అని పేరుపెట్టారు. అంతకుముందు ఆయన సబర్మతి ఆశ్రమానికి వెళ్లి గాంధీని కలిశారు. మీతో కలిసి పనిచేస్తానని చెప్పగా.. నీ అవసరం ఇక్కడి కంటే మీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉందని.. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేయాలని గాంధీజీ సూచించారు. గాంధీ సూచన మేరకు ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు.

సేవ పేరుతో చైతన్యం
ఖద్దరు ఉద్యమ ప్రచారానికి సేవా మందిరాన్ని వినియోగించుకున్నారు. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్థానికంగా తయారు చేసిన వస్త్రాలనే ధరించాలని ఇక్కడ్నుంచే ప్రచారం చేశారు. సేవా మందిరంలోని ప్రతి ఒక్కరూ ఖద్దరు టోపీ ధరించేలా నిబంధనలు విధించారు. సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహించారు. సేవ పేరుతోనే ప్రజల్లో స్వాతంత్య్ర ఉద్యమంపై చైతన్యం నింపారు. ఈ ఆశ్రమంలో ఇప్పటికీ ఖద్దరు సంస్కృతి పాటిస్తున్నారు. విద్యార్థులందరూ దేశభక్తి చాటేలా ఖద్దరు టోపీలు ధరిస్తున్నారు.

గాంధీ బాటలో నడిచి..
గుమ్మఘట్ట మండలం శిరిగేదొడ్డి గ్రామానికి చెందిన దామోదర్‌సింగ్‌ కొంతకాలం రాయదుర్గం అరబిక్‌ కళాశాలలో హిందీ బోధకుడిగా పనిచేశారు. తెల్లదొరల పాలన నుంచి భారత్‌కు విముక్తి కల్పించేందుకు మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడిచారు. పలు సమావేశాలు, సభల్లో పాల్గొన్నారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 నెలలు బళ్లారి జైల్లో శిక్ష అనుభవించారు. వంటకాలు చేయడంలో ఆయన సిద్ధహస్తులు. జైలులో ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులకు వంట చేసి, వడ్డించారు. 2000లో కర్నూలు జిల్లా ఆదోని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆర్‌.దామోదర్‌సింగ్‌ను 1995లో అప్పటి రాష్ట్రపతి నారాయణ్‌, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. ఫ్రీడం ఫైటర్‌ అవార్డు ఆనాటి ప్రభుత్వం
అందించింది.  - గుమ్మఘట్ట

విద్యాలయాలే ఉద్యమ వేదికలు
ఉద్యమంలో గుత్తికి చెందిన కేశవ పిళ్లై ప్రముఖ పాత్ర వహించారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో గుత్తి, రాయదుర్గం, అనంతపురం ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశారు. 1929లో గుత్తిలో ప్రాథమిక పాఠశాలను సొంత నిధులతో నిర్మించారు. విద్యాబోధనతోపాటు పిల్లలకు దేశభక్తి పెంపొందించారు. జాతీయోద్యమ కార్యాచరణపై నాయకులతో కలిసి పాఠశాలల్లోనే రహస్య సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ కోట సచివాలయం ఏర్పాటు చేశారు. - గుత్తి

జరిమానా సొమ్ముతో పాఠశాల నిర్మాణం
బ్రిటీష్‌ కాలంలో అనంతపురం నుంచి బళ్లారికి పెద్దఎత్తున సరకు రవాణా చేసేవారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో రవాణాను అడ్డుకునేందుకు 1946లో విడపనకల్లు మండలం కొట్టాలపల్లి వద్ద వంతెనను గ్రామస్థులంతా కూల్చేశారు. దీనికి ప్రతిఫలంగా గ్రామంపై బ్రిటీషు ప్రభుత్వం రూ.5 వేలు జరిమానా విధించింది. అందరూ చందాలు వేసుకుని జరిమానా చెల్లించారు. స్వాతంత్య్రం తర్వాత 1951లో భారత ప్రభుత్వం గ్రామస్థులు కట్టిన జరిమానాను తిరిగి చెల్లించింది. ఆ నగదుతోనే అప్పట్లో ఊరిలో పాఠశాలను నిర్మించారు. - ఉరవకొండ

గ్రామోద్యమ నిర్మాణంలో దిట్ట
బత్తలపల్లి మండలం అప్రాచెరువుకు చెందిన చెన్నప్ప సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పిడికిలి బిగించారు. గాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితులై స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. క్విట్‌ఇండియా, సత్యాగ్రహం వంటి ఉద్యమాలను ఊరూరా తీసుకెళ్లారు. తన ఉపన్యాసాలతో గ్రామీణులను ఆకట్టుకున్నారు. 1930లో ఖద్దరు దుస్తులు ధరించి స్వగ్రామంలో రచ్చబండపై ఉపన్యసించారు. దీంతో బ్రిటీషు పాలకుల దృష్టిలో పడ్డారు. 1941 జనవరి 25న అరెస్టు చేసి బళ్లారి జిల్లా అలీపుర జైలులో పెట్టారు. కుల నిర్మూలన, పేద విద్యార్థులకు వసతి కల్పనకు పోరాటం చేశారు. వినోబాబావే భూదాన ఉద్యమానికి స్పందించి కొంత భూమిని దానం చేశారు. - జిల్లా సచివాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని