logo

క్రికెటర్ల చిరునామా కదిరి

కదిరి కరవు ప్రాంతమే అయినా.. క్రీడాకారులకు కొరత లేదన్నట్లు క్రికెట్లో దూసుకుపోతున్నారు ఇక్కడి యువకులు.

Updated : 12 Aug 2022 05:51 IST

ఉత్తమ ప్రదర్శనతో రాణిస్తున్న యువకులు

ఏపీఎల్‌, అండర్‌-19లో స్థానం

 - న్యూస్‌టుడే, కదిరి

కదిరి కరవు ప్రాంతమే అయినా.. క్రీడాకారులకు కొరత లేదన్నట్లు క్రికెట్లో దూసుకుపోతున్నారు ఇక్కడి యువకులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్రికెట్‌కు కేరాఫ్‌గా కదిరి నిలుస్తోంది. గతంలో ప్రసాద్‌రెడ్డి, షాబుద్దీన్‌ వంటి రంజీ ఆటగాళ్లను అందించిన ప్రాంతం నుంచి ప్రస్తుతం ఏపీఎల్‌లో అధిక రెమ్యునరేషన్‌తో ఎంపికైన గిరినాథరెడ్డితో పాటు సంతోష్‌ లాంటి క్రీడాకారులు ఈ ప్రాంతంవారే కావడం గమనార్హం. అండర్‌-19 క్రికెట్‌కు ఇద్దరు, అండర్‌-16లో ఒకరు స్థానం సాధించి ఉత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రాజట్టులో రాణించి, జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలన్న పట్టుదలతో క్రికెటర్లు నిరంతర సాధనతో ప్రతిపోటీలోనూ సత్తాచాటుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఆర్డీటీ, జిల్లా క్రికెట్‌ సంఘం అందించిన ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిస్తోందంటున్న క్రీడాకారుల ఆశలు, ఆశయాలు ఇలా..       

ఉన్నతస్థాయి క్రికెటర్‌ కావడమే లక్ష్యం
క్రికెట్‌లో ఉన్నత స్థాయిలో ఆడాలన్నదే లక్ష్యమని రేవంత్‌రెడ్డి అంటున్నాడు. ఇతను కదిరిలో న్యాయవాది రామచంద్రరెడ్డి, గృహిణి చంద్రకళ తనయుడు. 8వ తరగతిలో క్రికెట్‌ను ఆర్డీటీ, ఏడీసీఏ శిక్షణ సబ్‌సెంటర్‌లో ప్రారంభించాడు. ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన పాఠశాల టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన గుర్తింపు ఉంది. 2018లో నిర్వహించిన ఏపీ స్కూల్‌గేమ్స్‌లో అనంతపురం జిల్లాకు, ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన అంతర్‌జిల్లాల అండర్‌-16 పోటీలకు ఆడాడు. కరోనా భయానక పరిస్థితుల్లోనూ సాధన చేసినా మ్యాచ్‌ల నిర్వహణ లేక జట్ల ఎంపిక కాలేదు. తర్వాత పాల్గొన్న లీగ్‌లు, టోర్నీలలో నిలకడగా ఆడుతూ అండర్‌-19 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.

విరాట్‌ కోహ్లియే ఆదర్శంగా నిశ్చయ్‌
అండర్‌-16 జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపికైన నిశ్చయ్‌ కదిరికి చెందిన ధన్వి, స్వప్నల కుమారుడు. క్రికెట్‌లో విరాట్‌ కోహ్లిపై అభిమానం, గిరినాథరెడ్డిని స్పూర్తిగా తీసుకున్నాడు. రాష్ట్రజట్టులో రాణించి, జాతీయజట్టులో స్థానం పొందాలన్నదే లక్ష్యంగా ఆడుతున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి 2011లో క్రికెట్‌ను ప్రారంభించాడు. బౌలర్‌గా ప్రత్యేకత కలిగిన ఇతను ఆల్‌రౌండర్‌గా ప్రతిభ చాటుతున్నాడు. ఏడీసీఏ ఆధ్వర్యంలో 2021లో జరిగిన అనంత ప్రీమియర్‌ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2022 అనంత ప్రీమియర్‌ లీగ్‌లో 25 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు సాధించిన ఉత్తమ బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. జిల్లా క్రికెట్‌ సంఘం నిర్వహించే అనంత ప్రీమియర్‌ లీగ్‌లో కదిరి అండర్‌-15 జట్టు ఫైనల్‌కు చేరటంలో కీలక పాత్ర పోషించాడు. ప్రాబబుల్‌లో రాణించి అండర్‌-16 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.

ఆల్‌రౌండర్‌గా..
వేసవి శిక్షణ శిబిరంతో క్రికెట్‌ను ప్రారంభించిన సాయిప్రణీత్‌ ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవరు శ్రీనివాసులు, గృహిణి అలివేలు కుమారుడు. ప్రథమ ఇంటర్‌ చదువుతున్న కుర్రాడు జాతీయ జట్టులో స్థానం పొందాలన్న లక్ష్యంతో ఆటపై దృష్టి సారించాడు. మొదట ఏసీఏ స్కూల్‌ టోర్నీలో లెగ్‌ స్పిన్నర్‌గా విశేష ప్రదర్శనతో 24 వికెట్లు తీయడమేగాక పరుగులు సాధించటంలోనూ ప్రత్యేకత చాటుకున్నాడు. తద్వారా 2018లో మంగళగిరిలోని ఏసీఏ రాష్ట్రశిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. 2019లో సీఎం కప్‌లో రాణించటంతో మహారాష్ట్రలో జరిగిన అంతర్‌రాష్ట్ర పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రజట్టులో స్థానం పొందాడు. ఏపీఎల్‌లో సత్తాచాటి 2021లో అండర్‌-16 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. 2022లో ఫైనల్‌లో సెంచురీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రాపబుల్‌ మ్యాచ్‌లలో చక్కని పరుగులు సాధించడమేగాక ఉత్తమ ఆటతీరుతో అండర్‌-19 అంతర్‌జిల్లాల క్రికెట్‌ టోర్నీలో ఆడే జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని