logo

ప్రహసనంగా బియ్యం పంపిణీ

కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఇదే సమయంలో ప్రతి నెలా వాహనాల ద్వారా అందించే

Published : 13 Aug 2022 04:41 IST

చౌకధర దుకాణంలో వేలిముద్ర వేస్తున్న లబ్ధిదారు

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. ఇదే సమయంలో ప్రతి నెలా వాహనాల ద్వారా అందించే సరకుల పంపిణీ ఎక్కడా కనిపించడం లేదు. ఉచిత బియ్యం మాత్రమే సరఫరా అయ్యాయని, ప్రతినెల పంపిణీ చేసే బియ్యం జిల్లాకు చేరలేదని అధికారవర్గాల సమాచారం. ఉచిత బియ్యంతో పాటు 36 వేల మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యం అవసరం. ఈనెల 11వ తేదీ నాటికి పౌరసరఫరాల శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రతా చట్టం ప్రకారం మొత్తం 11,34,699 కార్డులదారులకు గాను 8,92,343 మందికి ఉచిత బియ్యం పంపిణీ చేశారు. ఇంకా 2,42,356 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది.

11 రోజులుగా అనంతపురం జిల్లాలో 76.6 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 80 శాతం పంపిణీ చేసినట్లు అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తోంది. అనంతపురంలో 57 శాతం, బ్రహ్మసముద్రం 55.1, కుందుర్పి 49.4, కంబదూరు 61.1, అమరాపురంలో 57.7 శాతం మాత్రమే పంపిణీ జరిగింది.

* ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,08,293 కార్డులు ఉన్నాయి. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి 11,34,699 కార్డులు వచ్చాయి.  మొత్తం 73,594 మంది లబ్ధిదారులకు ఉచిత బియ్యం కోత పెట్టారు. అందులో అనంతపురం జిల్లాలో 40,296, శ్రీసత్యసాయి జిల్లాలో 33,298 మంది ఉన్నారు.

* అనంతపురం జిల్లాలో  మొత్తం 6,49,672 కార్డులకు 10 వేల మెట్రిక్‌ టన్నులు, శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం 5,58,621 కార్డులకు 8 వేల మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యం, ఇతర సరకులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం ఉచిత బియ్యం పంపిణీ మాత్రమే జరుగుతోంది.

* ప్రతినెలా పంపిణీ చేసే బియ్యం గుర్తించి లబ్ధిదారులు ప్రశ్నిస్తే.. ఉచిత బియ్యం ఇస్తున్నాం కదా? అంటూ డీలర్లు దబాయిస్తున్నారు

పీడీఎస్‌ బియ్యంపై సమాచారమే లేదు
సాధారణంగా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం, ఇతర సరకులు ఈ-పాస్‌ యంత్రం ద్వారా అందజేస్తారు. కార్డుదారుడు వేలి ముద్ర వేసి సరకులు తీసుకోవాలి. ఎంత మంది లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేశారన్నది  ఏ రోజుకు ఆరోజు ఆన్‌లైన్‌లో సమాచారం ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఎన్ని కార్డులకు పంపిణీ చేశారన్న సమాచారం లేదు. శ్రీసత్యసాయి జిల్లాలో మాత్రం 42 శాతం పంపిణీ చేసినట్లు ఆ జిల్లా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఆపరేటర్ల రాజీనామాతో ఆటంకం
ఉమ్మడి జిల్లాలో ఇంటింటికీ రేషన్‌ సరకులు పంపిణీ చేసే వాహన ఆపరేటర్లు 84 మంది రాజీనామా చేశారు. దీంతో పంపిణీకి ఆటంకం ఏర్పడింది. అనంతపురం జిల్లాలో 40, శ్రీసత్యసాయి జిల్లాలో 44మంది ఆపరేటర్లు రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమీప వాహన ఆపరేటర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పంపిణీలో జాప్యం జరుగుతోంది.

గడువు పెంచాలని కోరుతున్నాం..
- శోభారాణి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

ఉచిత, పీడీఎస్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలి. ఒకేసారి ఈ-పాస్‌లో నమోదు చేయడం కష్టంగా ఉంది. సమాచారం కూడా ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఈ నెల 15 నాటికి పంపిణీ పూర్తి కాదు. గడువు పెంచాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. ఆహార భద్రతా చట్టం పరిధిలోని కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు, సాధారణ పీడీఎస్‌ బియ్యం, ఇతర సరకులు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమాధికారులతో మాట్లాడి వాహన ఆపరేటర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని