logo

రేషన్‌ సరకుల్లో కోత

నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన రేషన్‌ పంపిణీ విధానం అమల్లో అభాసుపాలవుతోంది. సరకుల పంపిణీ విధానం చూస్తుంటే ప్రభుత్వం దృష్టిలో రేషన్‌ అంటే కేవలం బియ్యం ఒక్కటే అన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. గతంలో చౌక దుకాణాల ద్వారా వేర్వేరు సరకులను పేదలకు పంపిణీ చేసేవారు.

Published : 14 Aug 2022 03:06 IST

పంచదారకు ఎసరు, కందిపప్పు కుదింపు

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన రేషన్‌ పంపిణీ విధానం అమల్లో అభాసుపాలవుతోంది. సరకుల పంపిణీ విధానం చూస్తుంటే ప్రభుత్వం దృష్టిలో రేషన్‌ అంటే కేవలం బియ్యం ఒక్కటే అన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. గతంలో చౌక దుకాణాల ద్వారా వేర్వేరు సరకులను పేదలకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం బియ్యం పంపిణీకే పౌరసరఫరాల విభాగం పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగస్టు కోటా కింద కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా బియ్యం మాత్రమే ఇస్తున్నారని తెలుస్తోంది. పంచదార కోటాలో పూర్తిగా కోతవేశారు. అడిగినవారికి మాత్రమే కందిపప్పు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కార్డుదారులు బియ్యంతోనే సరి పెట్టుకుంటున్నారు. గత రెండు, మూడు నెలలుగా పంచదారను అరకొర మాత్రమే సరఫరా చేసిన పౌరసరఫరాలశాఖ ఆగస్టు నెలలో పూర్తిగా మంగళం పాడింది. ఇక కందిపప్పును డీలర్లే కొనకపోవడంతో కార్డుదారులకు లభ్యం కాని పరిస్థితి. దీంతో పేదలు బయట అర కిలో చక్కెర రూ.25లకు, కందపప్పు కిలో రూ.110లకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. జిల్లాలో 5,58,796 కార్డుదారులు ఉండగా వీరికి అర కిలో చక్కెర చొప్పున 2.79 లక్షల కిలో(279 టన్నులు)లు పంపిణీ చేయాల్సి ఉంది.

6.40 లక్షల మందికి అందని ఉచిత బియ్యం

కేంద్రం కరోన సమయం, అనంతరం పేద ప్రజలను ఆదుకోవాలని పీఎంజీకేవై కింద కార్డులో ప్రతి సభ్యుడికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేసింది. అయిదు దశల్లో అమలు చేసిన కేంద్రం ఆరో దశ కింద మరో ఆరు నెలలకు విస్తరించింది. గడచిన ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు పొడిగించింది. దేశవ్యాప్తంగా ఆరో దశ అమలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో కార్డుదారులకు ఏప్రిల్‌ నుంచి నాలుగు నెలలుగా పంపిణీ ఊసే లేకుండాపోయింది. ప్రస్తుతం ఇస్తున్న ఆగస్టు, సెప్టెంబరు మాసాలకు కేవలం 3.39 లక్షల కార్డులకు మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు. మిగిలిన 2,19,433 కార్డుల్లో ఉన్న 6.40 లక్షల మందికి 5 కిలోల మేర 3200 టన్నులు బియ్యం పేదలకు అందని పరిస్థితి.

* ఈ విషయమై డీఎస్‌వో వంశీకృష్ణారెడ్డిని వివరణ కోరగా చక్కెర సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఆగస్టు నెలకు ప్రభుత్వం చక్కెర కేటాయించలేదు. కందిపప్పు కావాల్సినంత స్టాక్‌ ఉందని, డీలర్లు డీడీలు తీస్తే దుకాణాలకు సరఫరా చేస్తామన్నారు. ఉచిత బియ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని