logo

స్వాతంత్య్ర సమరానికి ఊతం.. గ్రంథాలయం

సాంకేతికత అందుబాటులోకి రాని కాలంలో ప్రాపంచిక జ్ఞానం తెలుసుకోవడానికి పుస్తకాలు, పత్రికలే ఏకైక మార్గం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వాటిని కొని చదివే పరిస్థితి అందరికీ లేదు. అందుకే ఉద్యమ నాయకులు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యువతకు చదువు, జ్ఞానాన్ని అందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమం పెద్దఎత్తున సాగింది. స్థానికంగా గ్రంథాలయాల స్థాపన వయోజన విద్యకు

Published : 15 Aug 2022 05:22 IST

1883లోనే అనంతలో ఏర్పాటు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, ధర్మవరం

సాంకేతికత అందుబాటులోకి రాని కాలంలో ప్రాపంచిక జ్ఞానం తెలుసుకోవడానికి పుస్తకాలు, పత్రికలే ఏకైక మార్గం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వాటిని కొని చదివే పరిస్థితి అందరికీ లేదు. అందుకే ఉద్యమ నాయకులు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. యువతకు చదువు, జ్ఞానాన్ని అందించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమం పెద్దఎత్తున సాగింది. స్థానికంగా గ్రంథాలయాల స్థాపన వయోజన విద్యకు ప్రాణాధారమైంది. యువతను స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించడానికి కీలకపాత్ర పోషించింది. అక్కడ లభ్యమయ్యే పుస్తకాలు, జాతీయ నాయకుల రచనలు ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించాయి. ప్రజల్ని ఉద్యమం వైపు కార్యోన్ముఖుల్ని చేశాయి.

మొట్టమొదటి సొంత భవనం

స్వాతంత్య్రం అనంతరం 1952 ఏప్రిల్‌ 2న పప్పూరు రామాచార్యులు తన భవనంలోని రెండు గదుల్లో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ప్రారంభించారు. జి.వెంకటస్వామిని ప్రథమ గ్రంథపాలకుడిగా నియమించారు. రామాచార్యులు ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత దానికి సొంత భవనం ఉండాలని నిర్ణయించారు. జిల్లా మ్యూజియం భవనం ఖాళీగా, నిరుపయోగంగా ఉండటంతో అందులో ఏర్పాటు చేయాలనుకున్నారు. జిల్లా కలెక్టరును సంప్రదించి ఆ భవనాన్ని మ్యూజియం అథారిటీస్‌ నుంచి కొనడమే కాకుండా ప్రత్యేక విరాళం కూడా పొందారు. అలా రాష్ట్రంలోనే మొట్టమొదటగా కేంద్ర గ్రంథాలయానికి సొంత భవనం కలిగిన ఘనత అనంతపురానికి దక్కింది.

అనంతపురంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం


ధర్మవరంలో..

ధర్మవరంలోని ఎడ్వర్డు రీడింగ్‌ రూమ్‌

మొట్టమొదటగా ధర్మవరంలో ఎడ్వర్డు కారొనేషన్‌ పేరుతో 1893లోనే పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉన్నత ప్రామాణిక గ్రంథాలతోపాటు అన్ని రకాల దినపత్రికలను అందుబాటులో ఉంచారు. సువిశాల మైదానంలో భవనంతోపాటు కళాజ్యోతి పేరుతో నాటక కళా సంస్థ, క్రీడా ప్రాంగణం, ఉపన్యాస మందిరాన్ని నెలకొల్పారు. ఇది నేటికీ కొనసాగడం విశేషం. ధర్మవరంలో 1915లో శిరిపి ఆంజనేయులు, రామానందుల వెంకటేశయ్య ఆధ్వర్యంలో శ్రీక్రియాశక్తి ఒడయార్‌ పేరుతో మరొకటి స్థాపించారు. 1960లో దీన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ స్వాధీనం చేసుకుంది. కోటలో బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు 1921లో శ్రీసరస్వతీ నిలయం పేరుతో ఇంకొకటి నెలకొల్పారు. నిర్వహణ భారం భరించలేక కొంతకాలానికి దీన్ని ఎడ్వర్డు రీడింగ్‌ రూమ్‌ వారికి స్వాధీనం చేశారు. అప్పటినుంచి సంయుక్తంగా ఎడ్వర్డు కారొనేషన్‌ రీడింగ్‌ రూమ్‌ అండ్‌ సరస్వతీ నిలయం అనే పేరు స్థిరపడింది.


1883లోనే రీడింగ్‌ రూమ్‌

జిల్లాకు చెందిన సమరయోధులు పత్రికలు నడపడంతోపాటు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యం చేశారు. అనాటి అధికారులు, కొందరు బ్రిటీష్‌ పాలకులు కూడా వాటిని నెలకొల్పారు. అనంతపురంలో 1883లోనే మొట్టమొదటగా రీడింగ్‌ రూమ్‌ను స్థాపించారు. 1884లో పెనుకొండ కేంద్రంగా న్యూస్‌పేపర్‌ క్లబ్‌ వెలిసింది. ప్రారంభ దశలో గ్రంథాలతో నిమిత్తం లేకుండా దిన, వార, మాస పత్రికలతో దీన్ని ఏర్పాటు చేశారు. 1883 నుంచి 1900 వరకు హిందూపురం, గుత్తి, తాడిపత్రి, ధర్మవరం, కంబదూరు, మడకశిర, రాయదుర్గం ప్రాంతాల్లో పఠన మందిరాలు, న్యూస్‌ పేపర్‌ క్లబ్‌లు వెలిశాయి. వీటిని వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో నిర్వహించాయి.


రపాలికల ఆధ్వర్యంలో..

పురపాలక సంస్థలు అవసరమైన ప్రోత్సాహం ఇచ్చేవి. స్వయంగా పట్టణాల్లో విజ్ఞాన భాండాగారాలను ఏర్పాటు చేశాయి. హిందూపురం పురపాలకసంస్థ అప్పటి ప్రైవేటు లైబ్రరీని 1929లో స్వాధీనం చేసుకుని నిర్వహించింది. 1942లో మరొకటి కొత్తగా నెలకొల్పారు. తాడిపత్రి పురపాలకసంస్థ 1923లో ‘ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌’ పఠన మందిరానికి గ్రంథాల కొనుగోలు నిమిత్తం రూ.100 గ్రాంటు మంజూరు చేసింది. 1938లో ఉచిత పఠనాలయం, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. అనంత మున్సిపాలిటీ కూడా 1947లో రెండు పఠన మందిరాలు, పుస్తకాలయాలను ఏర్పాటు చేసింది. గుంతకల్లులో రెండు ఏర్పాటు చేసి, అందులో ఒకటి చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించింది. అనంతపురం జిల్లా బోర్డు ప్రత్యేకంగా నిర్వహించేది. 1944లో జిల్లాబోర్డు తరఫున జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ఉచితంగా గ్రంథాలు, సాంకేతిక పరికరాలను సరఫరా చేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు