logo

పురస్కారాలకు 353 మంది ఎంపిక

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ సేవా అవార్డుల జాబితా వెల్లడైంది. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరచిన మొత్తం 353 మంది పురస్కారాలకు ఎంపిక అయ్యారు. ఎంపిక జాబితాను ఆదివారం కలెక్టర్‌ నాగలక్ష్మి ఆమోదం తెలిపారు. 49 మంది జిల్లా అధికారులు, మిగతా

Published : 15 Aug 2022 05:22 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ సేవా అవార్డుల జాబితా వెల్లడైంది. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరచిన మొత్తం 353 మంది పురస్కారాలకు ఎంపిక అయ్యారు. ఎంపిక జాబితాను ఆదివారం కలెక్టర్‌ నాగలక్ష్మి ఆమోదం తెలిపారు. 49 మంది జిల్లా అధికారులు, మిగతా వారు వివిధ కేడర్లల్లో పని చేస్తున్న డివిజన్‌, మండల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున 707 మందికి పురస్కారాలు అందజేశారు. జిల్లా విభజన తర్వాత ఆ సంఖ్య సగానికి తగ్గినా ఎక్కువ మందిని ఎంపిక చేసినట్లే. ఎప్పటిలాగే పోలీసు, రెవెన్యూ శాఖలో పని చేసే వారికే ఎక్కువ పురస్కారాలు అందనున్నాయి. రెవెన్యూ శాఖలో 29 మంది ఉన్నారు. ఆర్డీ మున్సిపల్‌ శాఖ పరిధిలో 19 మంది, డీఎంహెచ్‌ఓ, డీఆర్‌డీఏ పరిధిలో 12 మంది చొప్పున ఎంపిక చేశారు. విద్యుత్తు శాఖలో తొమ్మిది, జడ్పీ, హౌసింగ్‌, బీసీ సంక్షేమంలో ఆరుగురు ప్రకారం ఉన్నారు. మిగతా శాఖల్లో ఒకటి నుంచి ఐదు మంది లోపు ఉన్నారు. ఈసారి ప్రప్రథమంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 41 మందిని పురస్కారాలకు ఎంపిక చేశారు.

పోలీసుశాఖలో...

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు, సిబ్బంది ప్రశంసాపత్రాలకు ఎంపికయ్యారు. పోలీసు శాఖలో మొత్తం 72 మంది, అగ్నిమాపక శాఖ నుంచి నలుగురు, ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ నుంచి 22 మంది ఎంపికయ్యారు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, తాడిపత్రి డీఎస్పీ చైతన్య, దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరెడ్డి పురస్కారం అందుకోనున్నారు. సీఐలు కత్తి శ్రీనివాసులు, జాకీర్‌హుస్సేన్‌, బి.శేఖర్‌, యుగంధర్‌, వెంకటరమణ, ఎస్సైలు శ్రీకాంత్‌, పి.వెంకటేశ్వర్లు, గురుప్రసాద్‌రెడ్డి, ధరణిబాబు, యేషేంద్ర కుమార్‌ ఎంపికయ్యారు. అగ్నిమాపక శాఖలో అనంతపురం ఏడీఎఫ్‌వో అశ్వర్థ, ఎస్‌ఎఫ్‌వో మోహన్‌బాబుతో పాటు సిబ్బంది ప్రశంసకు అర్హత సాధించారు.

పైరవీలకే సిఫారసు!

ఎప్పటి మాదిరిగానే ఈసారి అధికారులకు నచ్చిన వారికే అవార్డులకు సిఫారసు చేసినట్లు తేటతెల్లమవుతోంది. గతంలో అనేక సార్లు స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో పురస్కారాలు పొందిన వారి పేర్లు కూడా ఈసారి ఉన్నాయి. పైరవీ చేసిన ఉద్యోగులకే జిల్లా అధికారులు సిఫార్సు చేసినట్లు స్పష్టమవుతోంది. నెల క్రితం బదిలీపై వచ్చిన వారు సైతం అవార్డుల జాబితాలో ఉన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన చాలా మందికి అన్యాయం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. నచ్చిన వారినే ఎంపిక చేయొద్దని కలెక్టర్‌ నాగలక్ష్మి స్వయంగా అధికారుల సమీక్షలో ఆదేశించినా ఫలితం లేదని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని