logo

అయ్యవారు.. హాజరుతో బేజారు

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఉపాధ్యాయులకు కష్టాలు తప్పడం లేదు. గతంలో బయోమెట్రిక్‌, ఐరిస్‌ ద్వారా హాజరు విధానం అమలు చేయగా.. తాజాగా ముఖచిత్రం ద్వారా నమోదుకు శ్రీకారం చుట్టింది. ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ ఆధారిత నమోదు) విధానాన్ని విద్యాశాఖ ప్రవేశపెట్టింది.

Published : 17 Aug 2022 03:54 IST

కొత్త విధానంతో ఇబ్బందులు

ఉపాధ్యాయుల ఆందోళన

కంబదూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న ఉపాధ్యాయుల చిత్రమిది. ప్రధానోపాధ్యాయుడి లాగిన్‌ నుంచి యాప్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వారంతా ప్రయత్నించారు. సర్వర్‌ పనిచేయకపోవడంతో యాప్‌ డౌన్‌లోడ్‌ కాలేదు. దీంతో తమ వివరాలు నమోదు చేసుకోలేకపోయారు.


కదిరిలోని బాలుర ఉన్నత పాఠశాలలో 32 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. సగం మందే హాజరు వేశారు. కదిరి వీవర్స్‌కాలనీలోని మున్సిపల్‌ పాఠశాల కాంప్లెక్స్‌ పరిధిలో 12 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కేజీబీవీ, గిరిజన గురుకుల బాలుర, బాలికల పాఠశాలలు యాప్‌లో కనిపించలేదు.


ధనియానిచెరువు పాఠశాలలో తొమ్మిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తొలిరోజు ముఖ ఆధారిత హాజరుకు ప్రయత్నించినా ముగ్గురు మాత్రమే సమయానికి నమోదు చేశారు. సాయంత్రం నలుగురికే ఫలించింది. సాంకేతిక సమస్య లేకుండా యాప్‌లను ప్రవేశ పెట్టాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


అగళి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తమ ముఖ ఆధారిత హాజరు నమోదుకు చేస్తున్న ప్రయత్నిమిది. సర్వర్‌ పనిచేయక హాజరు నమోదుకు నానా తంటాలు పడ్డారు.


అనంతపురం విద్య, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఉపాధ్యాయులకు కష్టాలు తప్పడం లేదు. గతంలో బయోమెట్రిక్‌, ఐరిస్‌ ద్వారా హాజరు విధానం అమలు చేయగా.. తాజాగా ముఖచిత్రం ద్వారా నమోదుకు శ్రీకారం చుట్టింది. ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ ఆధారిత నమోదు) విధానాన్ని విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ను సక్రమంగా అభివృద్ధి చేయకుండా ఆగమేఘాలపై అమలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 15న యాప్‌ను ప్రవేశపెట్టారు. 16 నుంచి అందులోనే హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. లేదంటే ఉపాధ్యాయులు సెలవులో ఉన్నట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు. వేడుకలు ముగించుకుని ఇళ్లకు చేరుకున్న గురువులకు సమాచారం అందింది. పాఠశాల దగ్గరగా ఉన్న వారు అక్కడికి వెళ్లి యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇతరులు మంగళవారం ఉదయాన్నే పాఠశాలలకు చేరుకుని సెల్‌ఫోన్లతో కుస్తీ పట్టారు.

నెట్‌వర్క్‌ సమస్య

ఉపాధ్యాయులు తమ సొంత మొబైల్‌లోనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, వివరాలు నమోదు చేసుకోవాలి. 3 సార్లు సెల్ఫీ తీసుకోవాలి. 3 చిత్రాలు కలిపి ఒక చిత్రంగా రిజిస్ట్రేషన్‌ అవుతుంది. రిజిస్ట్రేషన్‌ కూడా ప్రధానోపాధ్యాయుడి వద్ద, స్కూల్‌కాంప్లెక్స్‌ పరిధిలోనే చేసుకోవాలి. చాలాచోట్ల నెట్‌వర్క్‌, సర్వర్‌ సమస్యలు తలెత్తాయి. అనంతపురం జిల్లాలో 39.73 శాతం, శ్రీసత్యసాయి జిల్లాలో 36.29 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా..

ఉపాధ్యాయులు రోజుకు రెండుసార్లు హాజరు నమోదు చేయాలి. ఉదయం 8 నుంచి 9 వరకూ యాప్‌ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుంది. 9 తరువాత ఒక్కనిమిషం ఆలస్యమైనా యాప్‌ క్లోజ్‌ అవుతుంది. 9లోపు ఉపాధ్యాయుడు సెల్ఫీ నమోదు చేయాలి. ఇంట్లో ఉండి సెల్ఫీ తీసుకుంటే కుదరదు. పాఠశాలలోనే యాప్‌ పనిచేస్తుంది. నిర్దేశిత సమయంలోపు నమోదు చేయకపోతే సెలవు ఉన్నట్లు పరిగణిస్తారు. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల్లోపు పాఠశాలలోనే మరోసారి సెల్ఫీతీసుకుని
హాజరు నమోదు చేయాలి. 5 తరువాత వెబ్‌సైట్‌ క్లోజ్‌ అవుతుంది.

సమస్యలెన్నో..

సెల్ఫీ తీసుకుని, యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయడానికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉపాధ్యాయుడు సెలవు పెట్టినా ఆ వివరాలు కూడా అందులోనే నమోదు చేయాల్సిఉంది. సెలవు యాప్‌ ఇంకా అమలు చేయలేదు. మారుమూల మండలాల్లోని పాఠశాలల్లో నెట్‌వర్క్‌ సక్రమంగా ఉండదు. కొందరు ఉపాధ్యాయులకు స్మార్ట్‌ఫోన్లు లేవు. ఉన్నా చాలా మంది వినియోగించడం రాదు. సర్వర్‌; మొబైల్‌, నెట్‌వర్క్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.


నమోదు చేయాల్సిందే
- శామ్యూల్‌, డీఈఓ

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు ఫేషియల్‌ యాప్‌లో సెల్ఫీతీసుకుని కచ్చితంగా నమోదు చేయాల్సిందే.  సర్వర్‌, వెబ్‌సైట్‌ వంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు.


బోధనపై ప్రభావం
- నరసింహులు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

ముఖఆధారిత హాజరుకు ఎవరూ భయపడరు. సర్వర్‌ పెట్టే హింస భరించలేకపోతున్నాం. ఒకేసారి అందరూ యాప్‌ వినియోగిస్తే సర్వర్‌ సామర్థ్యం తగ్గుతుంది. కొన్ని ప్రాంతాల్లో సర్వర్‌ సక్రమంగా పనిచేయదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ఒకేసారి చేయాల్సి రావడం కూడా ఇబ్బందే. ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు.


ఒత్తిడికి గురవుతున్నాం
- హరికృష్ణ, ఫోర్టో రాష్ట్ర అధ్యక్షుడు

ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుకు ప్రభుత్వమే ట్యాబ్‌లు, డివైజర్లు తదితర యంత్రాలు సరఫరా చేయాలి. ఉపాధ్యాయుల వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించి, హాజరునమోదు చేయడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కనిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామని ఆదేశాలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. యాప్‌ల నిర్వహణతో ఒత్తిడికి గురవుతున్నాం. పాతపద్ధతిలోనే హాజరు నమోదు చేయాలి

ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు 3,855
మొత్తం ఉపాధ్యాయులు 16,945
యాప్‌ డౌన్‌లోడ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు 6,454
మొదటిరోజు హాజరు నమోదు 2,364

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని