logo

పట్టు రైతుకు ప్రోత్సాహం లేదాయె

మల్బరీ సాగుపై రైతులకు ఆసక్తి ఉన్నా రాయితీలు అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టు రైతులపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో రెండేళ్లుగా పట్టుగూళ్ల మార్కెట్లో అందించాల్సిన ప్రోత్సాహక బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు.

Updated : 17 Aug 2022 05:16 IST

రూ.10.30 కోట్ల బకాయి


రైతులు పండించిన పట్టుగూళ్లు

మడకశిర, హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: మల్బరీ సాగుపై రైతులకు ఆసక్తి ఉన్నా రాయితీలు అందక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టు రైతులపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో రెండేళ్లుగా పట్టుగూళ్ల మార్కెట్లో అందించాల్సిన ప్రోత్సాహక బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా 32 వేల ఎకరాలకు పైగా మల్బరీ పంట సాగవుతోంది. జిల్లాలో అత్యధికంగా బైవోల్టిన్‌, సీబీ రకం పట్టుగూళ్ల పెంపకం చేపడుతున్నారు. రైతులు ఉత్పత్తి చేసిన బైవోల్టిన్‌ పట్టుగూళ్లకు జిల్లాలోని మార్కెట్లో విక్రయిస్తే కిలోకు రూ.50 అదనంగా ప్రోత్సాహకం అందిస్తుంది. దీంతో రైతులు కర్ణాటక రాష్ట్రం వెళ్లకుండా హిందూపురం మార్కెట్కు వెళ్తున్నారు. గత రెండేళ్లుగా ప్రోత్సాహకం ఇవ్వకపోవడంతో ఒక్కో రైతుకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఇప్పటికీ దీనిపై అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

* హిందూపురం మార్కెట్లో గత రెండేళ్ల నుంచి దాదాపు 3,538 టన్నుల పట్టుగూళ్ల విక్రయం జరిగింది. రైతులకు ప్రోత్సాహకం అందకపోవడంతో ఏడాదిగా కర్ణాటక రాష్ట్రం శిడ్లఘట్ట, రాంనగర్‌ మార్కెట్కు తరలిస్తున్నారని పట్టు రీలర్లు పేర్కొన్నారు. గతంలో 3 నెలల్లో ప్రోత్సాహకం రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుతం ఏళ్లుగా బకాయి ఉండటంతో ఇబ్బందిగా మారింది.

* 2019 జులై నుంచి 2020 వరకు 9,428 మంది రైతులు 1,201 టన్నుల గూళ్లు మార్కెట్కు తీసుకెళ్లగా వారికి రూ.4.50 కోట్లు, 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు 8 వేల మంది రైతులు 1,276 టన్నులు విక్రయిస్తే వారికి రూ.5.80 కోట్లు ప్రోత్సాహక బకాయిలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.  

* మార్కెట్లోని పట్టు రీలర్లకు ఇచ్చే ప్రోత్సాహకం కూడా 2020 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు రూ.1.75 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. ఇందుకు పట్టు రీలర్లు మార్కెట్ బంద్‌ చేసి ఆందోళనలు కూడా చేశారు.


రూ.లక్షకు పైగా రావాలి
- నర్సేగౌడు, మల్బరీ రైతు, భక్తరహళ్లి

మల్బరీ రైతులకు కిలో బైవోల్టీన్‌ పట్టుగూళ్లకు అందించే రూ.50 ప్రోత్సాహకం గత 16 నెలలుగా అందించలేదు. నాకు దాదాపు రూ.1.20 లక్షల వరకు రావాల్సి ఉంది. గతంలో మార్కెట్లో గూళ్లు విక్రయించిన వెంటనే నగదు, ప్రోత్సాహకం ఖాతాలకు వేసేవారు. క్వింటాల్‌ గూళ్లకు రూ.5వేల ప్రోత్సాహకం ఇచ్చేవారు. ఈ మొత్తంతో కూలీల ఖర్చులు, పట్టుగూళ్లను మార్కెట్కు తరలించేందుకు రవాణాకు సరిపోయేది.


ఉన్నతాధికారులకు నివేదించాం
- సురేష్‌కుమార్‌, ఏడీ, పట్టుపరిశ్రమ శాఖ, హిందూపురం

రైతులకు రావాల్సిన ప్రోత్సాహకాల బకాయిలకు సంబంధించి నివేదికను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపించాం. మంజూరైన వెంటనే సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేస్తాం. హిందూపురం మార్కెట్లో రైతులు విక్రయించిన పట్టుగూళ్లకు ప్రభుత్వం దాదాపు రూ.10.30 కోట్ల వరకు ప్రోత్సాహక బకాయిలు మంజూరు చేయాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని