logo

బాబ్బాబు.. ఎమ్మెల్యే ఎదుట సమస్యలు చెప్పకండి!

‘బాబ్బాబు.. ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనేందుకు గ్రామాలకు వస్తున్నారు.. ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి.. నేను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే ముందు చెప్పొద్దు’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుడు

Published : 17 Aug 2022 03:54 IST

ఇంటింటికి వెళ్లి బతిమాలుతున్న వైకాపా నాయకుడు
చెన్నేకొత్తపల్లి మండలంలో వెలుగులోకి..

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘బాబ్బాబు.. ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనేందుకు గ్రామాలకు వస్తున్నారు.. ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి.. నేను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే ముందు చెప్పొద్దు’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలంలో అధికార పార్టీ నాయకుడు ఒకరు గడప గడపకు వెళ్లి ప్రజలను బతిమాలుతున్న విషయం వెలుగు చూసింది. మండలంలోని ఓ గ్రామంలో త్వరలోనే ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ముందు ప్రజలు సమస్యలు చెబితే తాను చిన్నబోయే అవకాశం ఉందని పసిగట్టిన ఓ నేత తన అనుచరులతో కలసి ముందుగానే గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని తనదైన శైలిలో పరిష్కారానికి హామీ ఇస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సగం పంచాయతీ గ్రామాల్లో సదరు నాయకుడు ఎమ్మెల్యే కంటే ముందుగానే గడప గడపకు కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలిసింది.

అసంతృప్తులను బుజ్జగిచేందుకు నేతన్న నేస్తం

సొంత పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించేందుకు సదరు నాయకుడు నేతన్న నేస్తం జాబితాలో అధికారులపై ఒత్తిడితెచ్చి వారికి చోటు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ గ్రామంలో దాదాపు 120 మందికి నేతన్న నేస్తం అర్హత జాబితాలో చోటు దక్కగా, అందులో సగానికిపైగా అనర్హత ఉన్నవారి పేర్లే ఉన్నాయని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. నేతన్న నేస్తం నగదును రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి మీటనొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమచేసే అవకాశం ఉంది. అర్హత ఉన్నప్పటికీ తమకు జాబితాలో పేర్లు నమోదు చేయలేదని, అధికార అండ ఉన్నవారికి మాత్రమే దక్కిందని నిజమైన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వస్తే మీవాళ్లు సైతం సమస్యలు చెప్పకుండా చూడాలని, తనకు అనుకూలంగా ఉన్న కొందరు స్థానిక తెదేపా నాయకులతో వైకాపా నేత లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు భోగట్టా. తెదేపా నాయకుల అనుయాయుల పేర్లు సైతం జాబితాలో చోటు దక్కించుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి చేసి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులకు అందించి మెప్పు పొందాలనేగాని ఇలా బతిమాలుకోవడమేంటని స్థానిక నాయకుడి తీరుపై మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు