logo

పోలీసుల బాధ్యత.. ఇంటికి భద్రత

లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) యాప్‌ను చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకుని పోలీసులకు సమాచారమిస్తే మీరు ఎక్కడున్నా సరే.. మీ ఇంటి భద్రత అరచేతిలో ఉంటుంది. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు

Published : 17 Aug 2022 04:01 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: లాక్డ్‌హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) యాప్‌ను చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసుకుని పోలీసులకు సమాచారమిస్తే మీరు ఎక్కడున్నా సరే.. మీ ఇంటి భద్రత అరచేతిలో ఉంటుంది. ప్రజలు తమ విలువైన సొత్తును కాపాడుకునేందుకు పోలీసు శాఖ అమలు చేస్తున్న ఈ యాప్‌ను వినియోగించుకుంటే భరోసా లభిస్తుంది. ఈ యాప్‌ ద్వారా ప్రజల ఆస్తులు, సొత్తుకు రక్షణ కల్పించడంతో పాటు దొంగల ఆగడాలను అరికట్టే అవకాశం ఉంటుంది.


ఊరు వెళ్లే ముందు చెబితే చాలు

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సదుపాయం పొందాలనుకునేవారు తమ చరవాణిలో గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా ‘ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఏపీ పోలీస్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో పేరు, ఫోన్‌ నెంబరు వివరాలతో రిజిస్టర్‌ కావాలి. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్న సమయంలో యాప్‌ ద్వారా రిక్వెస్టులో సూచించిన విధంగా సమాచారం అందించాలి. ఏ రోజు.. ఏ సమయంలో ఆ ఇంటి నుంచి వెళ్తున్నారు.. ఎప్పుడు తిరిగి రానున్నారో వివరాలను అందులో పొందుపరిచి సందేశం పంపాలి. అది జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నడిచే కమాండ్‌ కంట్రోల్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి సంబంధిత పోలీసులకు సమాచారం చేరుతుంది. దీనికి సంబంధించిన సిబ్బంది వెంటనే రిక్వెస్టు పెట్టిన వారి ఇంటికి వెళ్లి, ఎవరికీ కనిపించని ప్రదేశంలో రహస్య కెమెరాను అమర్చుతారు. ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు మోడమ్‌ను సైతం ఏర్పాటు చేస్తారు.

* ఇంట్లో అమర్చిన కెమెరా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమై ఉంటుంది. ఆ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశిస్తే ఇంట్లో అమర్చిన వ్యవస్థ ద్వారా కంట్రోల్‌ రూమ్‌లో పోలీస్‌ అలారం మోగుతుంది. దీంతో పోలీసులు దొంగతనం జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఇంట్లో కదలికలపై ఐదు క్షణాల్లో కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగుతుంది. యాప్‌ ద్వారా రిజిస్టరైన ఇంటి యజమాని ఫోన్‌కు కూడా హెచ్చరిక వెళ్తుంది.


రాష్ట్రంలో అనంతలోనే తొలిసారి

ఇళ్లలో బిగించే రహస్య కెమెరాలు

ఈ వ్యవస్థను 2017లో మొదటగా అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. అప్పటి ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రతిష్టాత్మంగా తీసుకుని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. అధికారులు మారినప్పటికీ ఈ సిస్టమ్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి, హిందూపురం, ధర్మవరం పట్టణాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో 53,062 మంది ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను తమ ఫోన్‌ నెంబర్ల ద్వారా రిజిస్టర్‌ చేసుకున్నారు. 5,237 మంది ఈ వ్యవస్థను సద్వినియోగం చేసుకున్నారు. దీనికోసం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ కంట్రోల్‌ రూమ్‌లో ‘ఈ సర్విలెన్స్‌’ ద్వారా 24 గంటలూ పోలీసులు పర్యవేక్షిస్తుంటారు. ఈ వ్యవస్థకు జాతీయ స్థాయి ‘స్కోచ్‌’ అవార్డు కూడా దక్కింది.


సద్వినియోగం చేసుకోవాలి

- ఎస్పీ ఫక్కీరప్ప, అనంతపురం

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ వ్యవస్థ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితమనే విషయాన్ని గ్రహించాలి. ఇంటి దొంగతనాలను నియంత్రించేందుకు వీలుగా తాళాలు వేసిన ఇళ్లపై కూడా నిఘా ఉంచుతున్నాం. ఈ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలు సాధించాం. ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని