logo

పతి కోసం.. సతి వేదన..!

భర్తకు చిన్న గాయమైతేనే భార్య మనసు తల్లడిల్లుతుంది. అలాంటిది తన భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై నాలుగు రోజులు ఐసీయూలో, రెండు రోజులు కోమాలోకి వెళ్తే.. చికిత్సలందించినా లాభం లేదని వైద్యులు చెబితే..

Published : 27 Sep 2022 03:08 IST

బతుకును ఛిద్రం చేసిన రోడ్డు ప్రమాదం


మంచానికే పరిమితమైన శ్రీరాములు

ముదిగుబ్బ, ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే : భర్తకు చిన్న గాయమైతేనే భార్య మనసు తల్లడిల్లుతుంది. అలాంటిది తన భర్త రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై నాలుగు రోజులు ఐసీయూలో, రెండు రోజులు కోమాలోకి వెళ్తే.. చికిత్సలందించినా లాభం లేదని వైద్యులు చెబితే.. ఆ భార్య పరిస్థితి వర్ణణాతీతం. దేవుడిపైనే భారం వేసిన ఆమె చివరికి భర్త ప్రాణాలను కాపాడుకుంది. మంచానికే పరిమితమైన భర్త యోగక్షేమాలు చూస్తూ కుటుంబ పోషణ భారమైన ఆ కుటుంబం ఇప్పుడు దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ముదిగుబ్బ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు, అక్కమ్మ దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనంగడిపేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. అప్పు చేసి వారిద్దరికీ వివాహం చేశారు. నిత్యం కూలీపని చేస్తూ వచ్చే ఆదాయంతోనే చేసిన అప్పులకు వడ్డీ చెల్లించి మిగిలిన దాంతోనే కుటుంబ జీవనం గడిపేవారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం పులివెందులకు వెళ్లి తిరిగి వస్తుండగా దొరిగల్లు ఘాట్ రోడ్డులో బొలెరో వాహనం బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీరాములకు రెండు కాళ్లు విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య, బంధువుల సాయంతో బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా నాలుగు రోజులు ఐసీయూలో పెట్టారు. పరిస్థితి విషమించడంతో రెండు రోజులు కోమాలోకి వెళ్లారు. గుండె నెమ్మదిగా కొట్టుకుంటోందని, చికిత్సలందించినా ఎటువంటి ప్రయోజనం లేదని వైద్యులు చెప్పడంతో భార్య అక్కమ్మ గుండెలవిసేలా ఏడ్చింది. చివరికి ఆపరేషన్‌ చేసి ఒక కాలు పూర్తిగా తొలగించి, మరొక కాలుకు ఇనుప రాడ్డు వేశారు. మూడు నెలలపాటు ఆసుపత్రిలో చికిత్సలందించారు. భార్య అక్కమ్మ తెలిసిన వారి దగ్గర రూ.3 లక్షల వరకు అప్పు తెచ్చి వైద్యం చేయించారు. అదే సమయంలో తన చిన్న కుమార్తె ప్రశాంతికి పురిటినొప్పులు రావడంతో ఆర్డీటీ ఆసుపత్రిలో చేర్పించారు. బాధను దిగమింగి ఓ వైపు భర్త, మరోవైపు కూతురి బాధ్యతలను చూసుకుంది. నెలకు మాత్రల కోసం రూ.2 వేలు, డ్రెసింగ్‌, చెకప్‌ కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటో బాడుగు వెయ్యి ఖర్చవుతోంది. నిత్యం కూలీపనికెళ్తేనే కుటుంబ పోషణ సాగేది. భర్త మంచానికే పరిమితం కావడంతో బాగోగులన్నీ భార్య చూసుకుంటోంది. నాలుగు నెలలుగా కూలీపనికి వెళ్లకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దాతలు ఎవరైనా స్పందించి ఆర్థికసాయమందించాలని అక్కమ్మ కోరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు