logo

పోలీసు జీపునే ఎత్తుకెళ్లాడు

సామాన్య ప్రజలు వాహనాలు లేదా ఇళ్లల్లో చోరీలు జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది సత్యసాయి జిల్లా అమరాపురం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో నిలిపి ఉన్న పోలీసు జీపుతో ఓ వ్యక్తి పట్టపగలే పరారయ్యాడు. వివరాలు..

Published : 27 Sep 2022 03:08 IST


చెట్టుకు ఢీకొన్న పోలీసు జీపు

అమరాపురం, మడకశిర, న్యూస్‌టుడే: సామాన్య ప్రజలు వాహనాలు లేదా ఇళ్లల్లో చోరీలు జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది సత్యసాయి జిల్లా అమరాపురం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో నిలిపి ఉన్న పోలీసు జీపుతో ఓ వ్యక్తి పట్టపగలే పరారయ్యాడు. వివరాలు.. కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామానికి చెందిన నవీన్‌ అలియాస్‌ దుర్గేష్‌ అనే మతి స్థిమితం లేని వ్యక్తి సోమవారం అమరాపురం పోలీసుస్టేషన్‌లో ఉన్న పోలీసు జీపును తీసుకుని వేగంగా వలస గ్రామం వైపు వెళ్లాడు. దీన్ని గమనించిన పోలీసులు ద్విచక్రవాహనంపై వెంబడిస్తూ వెనకే వెళ్లినా.. మరింత వేగంగా నడుపుతూ రోడ్డు పక్కనే ఉన్న ఓ చెట్టును ఢీకొట్టాడు. దీంతో జీపు ముందు భాగం దెబ్బతినగా నడుపుతున్న వ్యక్తి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. అంతలోపే పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జీపు చోరీకి ప్రయత్నించిన నవీన్‌ చిత్రదుర్గంలో ఒక కేసుకు సంబంధించిన రిమాండ్‌ ఖైదీగా గుర్తించారు. ఇతడు నాలుగు నెలల కిందట బెయిల్‌పై బయటికి వచ్చి పోలీసుల కంటబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతడు గతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. భార్యపై తరచూ గొడవ పడుతుండటంతో ఆమె వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మతి స్థిమితం లేకుండా వాహనాలు ఎత్తుకెళ్లడం, ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం వంటివి చేస్తున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు