logo

ఘన కీర్తి.. ఏదీ అభివృద్ధి?

లేపాక్షి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం, ఏడు శిరస్సుల నాగేంద్రుడు, వేలాడే స్తంభం, లతామండపం. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న లేపాక్షికి నిత్యం వంద సంఖ్యలో, శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

Published : 27 Sep 2022 03:08 IST

లేపాక్షిలో పర్యాటకులకు కరవైన సౌకర్యాలు


లేపాక్షి విహంగ వీక్షణం

లేపాక్షి, న్యూస్‌టుడే: లేపాక్షి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం, ఏడు శిరస్సుల నాగేంద్రుడు, వేలాడే స్తంభం, లతామండపం. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న లేపాక్షికి నిత్యం వంద సంఖ్యలో, శని, ఆదివారాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు లేపాక్షి సందర్శనకు వస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందినా.. ఇక్కడ పర్యాటకులకు తగిన వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

ఉత్సవాలతో వెలుగులోకి...
ఎంతో ఘన చరిత్ర కలిగిన లేపాక్షి ఆలయ ఘనకీర్తి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలతో విశ్వవ్యాప్తమైంది. మొదటగా 2012లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నిర్వహించగా, తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వంలో రెండమార్లు ఉత్సవాలను ప్రపంచ స్థాయికి తగినట్లుగా చేసి లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆయన హయాంలోనే లేపాక్షిలో జఠాయువు థీమ్‌ పార్కు పేరుతో పక్షిని ఏర్పాటు చేసి ఆ ప్రాంతమంతా సుందరంగా తీర్చిదిద్దారు. జఠాయువు మోక్ష ఘాట్‌ పేరుతో పక్షి పడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు బస చేసేలా పర్యాటకశాఖ అతిథి గృహాన్ని నిర్మించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచి పోయింది.


ఏడు శిరస్సుల నాగేంద్రుడు

చేయాల్సిన కార్యక్రమాలు ఇవే..
పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా లేపాక్షిలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. నాణ్యమైన, రుచికరమైన అల్పాహారం, భోజన సౌకర్యం కల్పించాలి. హిందూపురం రైల్వేస్టేషన్‌, కొడికొండ చెక్‌పోస్టు వద్ద లేపాక్షి ప్రాశస్త్యం తెలుపుతూ హోర్డింగులు ఏర్పాటుచేయాలి. జాతీయ రహదారి వెంబడి హోర్డింగులు ఏర్పాటు చేయడమే కాకుండా ఎయిర్‌పోర్టు, బెంగళూరు నగరంలోనూ అక్కడక్కడా బోర్డులు పెట్టాలి. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలి. థీమ్‌ పార్కు వద్ద శిథిలావస్థకు చేరిన కోనేరును పునరుద్ధరించి ఎంపోరియం ప్రారంభించాలి. లేపాక్షితో పాటు సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, పెనుకొండలను కలుపుతూ సర్క్యూట్‌ను ఏర్పాటుచేయాలి. ఏటా ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేస్తే లేపాక్షిని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దవచ్చు.


ఏకశిలా నంది విగ్రహం

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని