logo

నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల వల

నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల ఆశజూపి వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి ముఖం చాటేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

Published : 27 Sep 2022 06:12 IST

కొలువులు ఇప్పిస్తానని రూ.4.50 లక్షలు వసూలు
వైకాపా నాయకుల అనుచరుడి బెదిరింపులు

అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల ఆశజూపి వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి ముఖం చాటేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ మోసంపై పలువురు నిరుద్యోగులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిజాముద్దీన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆరుగురు అమ్మాయిల నుంచి రూ.4.50 లక్షలు వసూలు చేశాడు. ఇతను వైకాపా నాయకులతో కలిసి తిరుగుతూ, వారి పేర్లు చెబుతూ నమ్మకం కల్గించి మోసం చేస్తున్నాడు. గతేడాది జూన్‌లో తనకు పరిచయం ఉన్న ఉరవకొండ నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన నిరుద్యోగ మహిళతో ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌, క్లర్క్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందుకు కొంచెం ఖర్చవుతుందని తెలిపాడు. అతని మాటలు నమ్మిన సదరు మహిళ సుమారు రూ.లక్షకు పైగా ఇచ్చింది. ఆమెతో పాటు, స్నేహితురాళ్లతో సైతం డబ్బు కట్టించమని సదరు వ్యక్తి కోరాడు. దీంతో ఆమె తనకు పరిచయమున్న ఐదు మంది చేత డబ్బు కట్టించింది. డబ్బు చెల్లించిన మరుసటి రోజే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు వస్తాయని చెప్పాడు. 15 రోజులైనా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో బాధితులు అనుమానంతో నిజాముద్దీన్‌కు ఫోన్‌ చేశారు. అతను అప్పటికే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. ఫోన్‌ ఆన్‌లో ఉన్నపుడు బాధితులు ఫోన్‌చేస్తే సరైనా సమాధానం ఇవ్వకుండా సుమారు 15 నెలల నుంచి అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న బాధితులతో ‘మీ ఇష్టమున్న చోట చెప్పుకోండి. పోలీసులు నన్ను ఏమి చేయలేరు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వీరితోనే కాకుండా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాల్లో నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. తమను మోసం చేసిన నిజాముద్దీన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డబ్బు వెనక్కి ఇప్పించాలని బాధితులు ఎస్పీతో మొరపెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని