logo

చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు!

అధికారులు అవినీతి చేస్తే ఆయన ఏమాత్రం సహించరు.. అక్కడికక్కడే కడిగేస్తారు.. అవినీతిరహిత పాలన అంటూ ప్రసంగిస్తారు. ఇదంతా చూసి ఆయనేదో నిజాయతీపరుడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో భూముల్ని ఆక్రమించినట్లు

Updated : 30 Sep 2022 06:35 IST

వైకాపా నాయకుడి భూ దందా

చెరువు, గుట్ట పోరంబోకు కబ్జా

వైకాపా నాయకుడు ఆక్రమించిన ఎర్రగుట్ట

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: అధికారులు అవినీతి చేస్తే ఆయన ఏమాత్రం సహించరు.. అక్కడికక్కడే కడిగేస్తారు.. అవినీతిరహిత పాలన అంటూ ప్రసంగిస్తారు. ఇదంతా చూసి ఆయనేదో నిజాయతీపరుడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో భూముల్ని ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉన్నట్లు సమాచారం. ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూముల్ని మింగేశారు. ధర్మవరం సమీపంలో చెరువు ఆనుకుని ఉన్న గుట్టను కబ్జా చేశారు. పేదరైతుల్ని బెదిరించి అసైన్డ్‌ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. దీంతోపాటు పొలాలకు ఆనుకుని ఉన్న గుట్టపోరంబోకు, చెరువు పోరంబోకు భూముల్ని కలిపేసుకుని పంటలు పండిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు జలవనరుల శాఖ అధికారులు నోరు మెదపడం లేదు.

విశ్రాంత ఉద్యోగి సహకారంతో..

ఎర్రగుట్టపై ఉన్న పొలాలను లాగేసుకోవడానికి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసినట్లు తెలుస్తోంది. ధర్మవరానికి చెందిన ఓ విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి సహకారం తీసుకున్నట్లు సమాచారం. 902 నుంచి 909 వరకు ఉన్న సర్వే నంబర్లలో సుమారు 20 సబ్‌ డివిజన్లను కొత్తగా సృష్టించి, సుమారు 20 ఎకరాల పొలాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. గుట్ట ఆనుకుని ఉన్న పట్టా భూముల్ని యజమానులను బెదిరించి తక్కువ ధరకు తీసుకున్నట్లు తెలిసింది. ఇవన్నీ కుటుంబ సభ్యులు, అనుచరులు, బినామీల పేరుతో రాయించేసుకున్నారు.

పిత్రార్జితంగా మార్చారు

ఎర్రగుట్ట సర్వే నంబర్లలో సుమారు 20 ఎకరాలను తన కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో పదెకరాలు కొనుగోలు చేయగా.. మరో 8 ఎకరాలు ఆమెకు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డుల్లో చూపారు. సదరు మహిళది కర్నూలు జిల్లా కాగా ఇక్కడికి ఇచ్చి వివాహం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించిందనేది ప్రశ్నగా మారింది.

చెరువు కబ్జా

ఎర్రగుట్టకు ఆనుకుని ఉన్న చెరువును సుమారు 15 ఎకరాల వరకు పూడ్చి తన స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బయటి వ్యక్తులెవరూ అక్కడికి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పడవ ప్రయాణం సరదా కోసం రెండేళ్లుగా ఆయకట్టుకు నీరు విడుదల చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే నీరు విడుదల చేసినట్లు రైతులు చెబుతున్నారు.

రికార్డులు లేకుండానే రిజిస్ట్రేషన్లు?

ఎర్రగుట్ట విస్తరించి ఉన్న ధర్మవరం పొలం పరిధిలోని 904, 905, 908, 909 సర్వే నంబర్లు, పోతులనాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నంబర్లు, మల్లాకాలువ పరిధిలోని 1, 4 సర్వే నంబర్లు ఎవరికి, ఎప్పుడు అసైన్డ్‌ చేశారనే వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. కొందరు సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా.. వీటికి సంబంధించి తమ వద్ద ఎలాంటి రికార్డులు లభ్యం కాలేదని రెవెన్యూ అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రికార్డులు లేకుండా ఆ భూములను ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారనేది ప్రశ్నగా మారింది.

రైతులను బెదిరించి..

ధర్మవరం రెవెన్యూ పొలం పరిధిలో 902, 903, 904, 905, 906, 908, 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట ఉంది. దీంతోపాటు పోతులనాగేపల్లి పొలం పరిధిలోని 42, 43 సర్వే నంబర్లలో గుట్ట విస్తరించి ఉంది. ఇందులో మోటుమర్ల, కత్తేకొట్టాల గ్రామాలకు సంబంధించి పేద రైతులకు 1976, 1977 సంవత్సరాల్లో డి-పట్టాలు ఇచ్చారు. ఎర్రగుట్ట, చెరువుకు మధ్యలో ఉన్న ఈ భూముల్ని తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కీలక నాయకుడి కన్ను పడింది. పేద రైతుల్ని బెదిరించి ఎకరాకు రూ.లక్ష ఇచ్చి పొలాలను రాయించుకున్నట్లు తెలిసింది. ఇలా 45 ఎకరాల వరకు బలవంతంగా లాక్కున్నట్లు సమాచారం. దౌర్జన్యాన్ని ప్రశ్నించిన కొందరు యువకులపై తప్పుడు కేసులు బనాయించి పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

రుణాల పేరుతో లింకు డాక్యుమెంట్లు

ఎర్రగుట్టపై భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయించడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి సదరు సర్వే నంబర్లపై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో సదరు నాయకుడి కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు సృష్టించారు. వాటిని ఆధారంగా అసైన్డ్‌ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని