logo

అతి వేగం.. బతుకులు ఛిద్రం

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరవకొండ సమీపంలోని బూదగవి, కొట్టాలపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

Updated : 02 Oct 2022 05:14 IST

 నెత్తురోడుతున్న రహదారులు

అందుబాటులో లేని స్పీడ్‌గన్‌లు

* ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరవకొండ సమీపంలోని బూదగవి, కొట్టాలపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.


* కడప వైద్య కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్న జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆగస్టులో కారులో అనంతపురం బయలుదేరారు. ముదిగుబ్బ సమీపంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు జాతీయ రహదారి పక్కన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వైద్యుడు మృతి చెందాడు.


* సెప్టెంబరు 25న గార్లదిన్నె వద్ద 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్‌ వాసులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి అల్యూమినియం రెయిలింగ్‌ను ఢీకొట్టింది. రెయిలింగ్‌ కారులోకి చొచ్చుకు పోయి తల్లీ కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.


* అదే రోజు పంగల్‌ రోడ్డు వద్ద రాప్తాడుకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంతో డివైడర్‌కు ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై మృతి చెందాడు.


అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ర్యాష్‌ డ్రైవింగ్‌.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలతో కొందరు చేజేతులా జీవితంలో విషాదం నింపుకొంటున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న వారితో పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులకూ ముప్పువాటిల్లుతోంది. ఇటీవల ఉమ్మడి అనంత జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నెలకు సగటున 50 మందికి పైగా మృతి చెందుతున్నారు.

ఇటీవల గార్లదిన్నె వద్ద ప్రమాదానికి గురైన కారు

బ్లాక్‌ స్పాట్‌లు ఇలా..

500 మీటర్ల రోడ్డు పరిధిలో ఏడాదికి సగటున ఒకటి అంతకంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే వాటిని బ్లాక్‌స్పాట్‌లుగా పిలుస్తారు. ఏడాదికి సగటున 1 నుంచి 4 ప్రమాదాలు జరిగితే ‘సి’ కేటగిరి గాను, 5 నుంచి 9 ప్రమాదాలు జరిగితే ‘బి’ కేటగిరి, 10కి పైన ప్రమాదాలు జరిగితే ‘ఏ’ కేటగిరి బ్లాక్‌స్పాట్లుగా గుర్తిస్తారు. ఉమ్మడి జిల్లాలో 8 పోలీస్‌ సబ్‌డివిజన్ల పరిధిలో 106 బ్లాక్‌ స్పాట్‌లు ఉన్నాయి. ఎక్కువగా పెనుకొండ డివిజన్‌లో 25, అనంతపురం 22, తాడిపత్రి 20, ధర్మవరం సబ్‌డివిజన్‌లో 19 ఉన్నాయి. ‘బి’కేటగిరి 7, ‘సి’కేటగిరి 99 ఉన్నాయి. ‘ఏ’ కేటగిరివి లేవు.

జిల్లాకు 4 స్పీడ్‌గన్‌లే

జాతీయ రహదారులపై వేగంగా దూసుకెళ్లే వాహనాలను నియంత్రించడానికి పోలీసు శాఖ రాడార్‌ స్పీడ్‌గన్‌లను వినియోగిస్తోంది. ఇవి కదులుతున్న వాహనాల కచ్చిత వేగాన్ని గణిస్తాయి. జిల్లాలో కేవలం నాలుగే ఉన్నాయి. ఉరవకొండ, రాప్తాడు, గుత్తి, తాడిపత్రి ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.

44వ హైవేపై ప్రమాదాలు అధికం

గుత్తి నుంచి చిలమత్తూరు వరకు సుమారు 150 కి.మీ. ఉన్న ఎన్‌హెచ్‌ 44పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ హైవేపై 40 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నాయి.  గుత్తి, పామిడి, గార్లదిన్నె, సోములదొడ్డి, తపోవనం, రాప్తాడు, మామిళ్లపల్లి, ఎన్‌ఎస్‌గేట్‌, దామాజిపల్లి, కోన, పాలవెంకటాపురం, పెనుకొండ తదితర ప్రాంతాల కూడళ్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

అవసరం లేని చోట రెయిలింగ్‌.. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు రెయిలింగ్‌ (రక్షణ గోడలు) ఏర్పాటు చేస్తున్నారు. అయితే పలు చోట్ల అవసరం లేని చోట ఏర్పాటు చేశారు.

నిధుల్లేవంటూ.. నిర్లక్ష్యం

బ్లాక్‌స్పాట్లపై రోడ్లు, భవనాల శాఖ, మోటారు వాహనాల శాఖలతో పోలీసు శాఖ సమన్వయం చేసుకుని సంయుక్తంగా తనిఖీ చేసి, శాశ్వతమైన చర్యలు తీసుకోవాలి.  వేగ నిరోధకాలు, సూచికబోర్డులు, లైటింగ్‌, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. రోడ్డుపై శబ్దం వచ్చే రంబుల్‌ స్ట్రిప్స్‌ నిర్మించాలి. ఈ నిబంధనలు అంతంత మాత్రమే పాటిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి, అనంతరం వదిలేస్తున్నారు. ప్రధానంగా హైవే, ఆర్‌ అండ్‌ బీ అధికారులు బ్లాక్‌స్పాట్లను గుర్తించినా నిధుల్లేవంటూ తప్పించుకుంటున్నారు.

39 శాతానికి తగ్గించాం

రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాం.  బ్లాక్‌స్పాట్లను పర్యవేక్షించి అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గతేడాది సెప్టెంబరుతో పోల్చుకుంటే 39 శాతానికి ప్రమాదాలను తగ్గించగలిగాం.

- ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని