logo

వినూత్న ప్రయెగం.. రైతుకు తగ్గిన భారం

వ్యవసాయ పనులకు గతంలోలా కూలీలు దొరకటం లేదు. వివిధ కారణాలతో జీవనోపాధికి బెంగళూరు, ఇతర నగరాల్లోని పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా ఉపాధి పనులకు వెళ్తున్నారు. కూలీల ఖర్చు పెరిగింది.

Published : 02 Oct 2022 02:58 IST

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయ పనులకు గతంలోలా కూలీలు దొరకటం లేదు. వివిధ కారణాలతో జీవనోపాధికి బెంగళూరు, ఇతర నగరాల్లోని పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా ఉపాధి పనులకు వెళ్తున్నారు. కూలీల ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో రైతుల ఉపయోగపడేలా హిందూపురం బిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు సోలార్‌ పలకల ఆధారంతో తక్కువ ఖర్చుతో కలుపు మొక్కల తొలగింపు, విత్తనాలు విత్తే యంత్రాలను రూపొందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.రమేష్‌, అధ్యాపకుడు సుదర్శన్‌ పర్యవేక్షణలో కళాశాల సమీపంలోని పొలంలో వీటిని ఉపయోగించి ప్రయోగాత్మకంగా పంటలను సాగుచేసి సత్ఫలితాలు సాధించారు.


భవిష్యత్తులో మరిన్ని యంత్రాలు తయారుచేస్తాం

సమాజానికి దోహదమయ్యేలా మాకున్న పరిజ్ఞానంతో సోలార్‌ పలకలను ఉపయోగించి పొలంలో విత్తనాలు విత్తే యంత్రాన్ని తయారుచేశాం. ఎకరా పొలంలో మొక్కజొన్న విత్తనాలను విత్తి సాగు చేస్తున్నాం. కావాల్సిన పరికరాలు మోటారు, బ్యాటరీ, ఇనుపచక్రాలు, సర్క్యులేట్‌, రాడ్స్‌, బాడీప్రేమ్‌, సోలార్‌ ప్యానల్‌, స్విచ్‌లు, రెండు ఇనుప మడకలు. ఇందుకు రూ.6 వేలు ఖర్చు అయ్యింది. బయట మార్కెట్‌లో కొనాలంటే రూ.20 వేలు అవుతుంది. ఎకరా పొలంలో ఈ యంత్రం ద్వారా విత్తనాలు విత్తుకోవడానికి ఐదుగురు కూలీలు సరిపోతారు. భవిష్యత్తులో మరెన్నో యంత్రాలను ప్రాజెక్టు రూపంలో తయారుచేయాలన్నదే మా లక్ష్యం.

- ప్రీతంరెడ్డి, సాయిరాం, ఈసీఈ, చివరి ఏడాది


రూ.2,500కే కలుపు తొలగించే యంత్రం

సోలార్‌ పలకల ఆధారంగా మేము తయారుచేసిన కలుపు తీసే యంత్రానికి కేవలం రూ.2,500 ఖర్చు మాత్రమే అయ్యింది. బయట మార్కెట్‌లో రూ.10వేలకు పైగానే పెట్టుకోవాలి. కావాల్సిన పరికరాలు మోటారు, బ్యాటరీ, సోలార్‌ ప్యానల్‌, కంట్రోలర్‌, సర్క్యులేట్‌, ఐరన్‌రాడ్స్‌, బ్లేడ్‌, స్విచ్‌. రైతుల చరవాణులకు ఈ యంత్రంలో కల్పించిన స్వీచ్‌తో రీఛార్జి చేసుకోవచ్చు. ఎకరా పొలంలో కలుపుతీయాలంటే ఐదుగురు కూలీలు కావాలి. వారికి రూ.2,500 ఇవ్వాలి. ఈ యంత్రం ద్వారా ఎకరా పొలంలో ఒక కూలీ మాత్రమే కలుపును తొలగించవచ్చు. లేదంటే రైతే స్వయంగా కలుపుతీసుకుంటే కూలి ఖర్చు మిగులుతుంది. భవిష్యత్తులో రైతులకు ఉపయోగేపడే మరిన్ని యంత్రాలను తయారు చేయాలన్నదే మా ఆకాంక్ష.

- ఆదర్శ్‌, ఆంజనేయులు, ఈసీఈ, చివరి ఏడాది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని