logo

దసరాకు రైలెక్కలేం!

పేద, మధ్య తరగతి వర్గాలకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. బస్సు, ప్రైవేటు వాహనాలతో పోల్చితే సగం ధరకే ఊరెళ్లడానికి వీలవుతుంది. ప్యాసింజర్‌ రైలులో ఛార్జీ తక్కువగా ఉంటుంది. అయితే మూడు, నాలుగు నెలల ముందే రిజర్వు చేసుకుంటేనే సీటు లభిస్తుంది.

Published : 02 Oct 2022 02:58 IST

అనంత రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ

అనంతపురం(రైల్వే), న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి వర్గాలకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంది. బస్సు, ప్రైవేటు వాహనాలతో పోల్చితే సగం ధరకే ఊరెళ్లడానికి వీలవుతుంది. ప్యాసింజర్‌ రైలులో ఛార్జీ తక్కువగా ఉంటుంది. అయితే మూడు, నాలుగు నెలల ముందే రిజర్వు చేసుకుంటేనే సీటు లభిస్తుంది. ముంబయి, న్యూదిల్లీ రైళ్లకు మూడు నెలలు ముందుగా రిజర్వేషన్‌ చేసుకోవాల్సిందే. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు వైపు వెళ్లాలంటే కనీసం నెల రోజులు ముందుగా రిజర్వు చేసుకోవాలి. ఇక సెలవు రోజుల్లో పరిస్థితి దయనీయంగా ఉంటుంది. రద్దీ రోజుల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండు ఉన్నా అనంతపురం జిల్లా మీదుగా ఒకటి, రెండు రైళ్లు కూడా రావడం లేదు. ప్రస్తుతం దసరాకు ఊరెళ్దామనుకుంటే రైళ్లన్నీ వెయిటింగ్‌ జాబితాలో ఉన్నాయి.

విజయవాడ వెళ్లాలంటే కష్టమే

జిల్లాకు చెందిన విద్యార్థులు సుమారు 25 వేల మంది విజయవాడ, గుంటూరులో ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. సెలవులు రాగానే తల్లిదండ్రులు విజయవాడకు వెళ్లి పిల్లలను తీసుకురావాలి. సెలవులు ముగిసిన తర్వాత వదలాలి. విజయవాడ వెళ్లే రైళ్లలో సీట్లు ఈనెల 17 వరకు ఖాళీ లేవు. ధర్మవరం రైలులో కొన్ని రోజుల్లో మాత్రమే ఖాళీలు ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ముగ్గురు, నలుగురు కలుసుకొని ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని విజయవాడకు బయలుదేరారు.

* ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌(18464) రైలులో ఈనెల 17 వరకు స్లీపర్‌, 3ఏసీ, 2 ఏసీలోనూ ఖాళీలు లేవు. తిరుగు ప్రయాణంలో 18463లో స్లీపర్‌, 3 ఏసీ, 2ఏసీ 12 వరకు సీట్లు లేవు.

* కొండవీడు ఎక్స్‌ప్రెస్‌(17212)లో విజయవాడ వెళ్లడానికి ఈనెల 25 వరకు వెయిటింగ్‌ లిస్టు ఉంది. తిరుగు ప్రయాణంలో 17211 విజయవాడ నుంచి అనంతపురం రావడానికి 17 వరకు సీట్లు లేవు.

* ధర్మవరం-విజయవాడ(17216) రైలుకు స్లీపర్‌ కోచ్‌లో ఈనెల 13 వరకు ఖాళీలు లేవు. 3ఏసీ కోచ్‌లో 3,4 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. 11వ తేదీ వరకు వెయిటింగ్‌ జాబితా ఉంది.

హైదరాబాద్‌ వైపూ అంతే..

జిల్లాకు చెందిన యువత ఎక్కువమంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని కావడంతో జిల్లా వాసులకు అక్కడ సంబంధాలు ఉన్నాయి. అక్కడ్నుంచి పండగ వేళ జిల్లాకు వచ్చి వెళుతుంటారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతోపాటు ప్రైవేటు పరిశ్రమలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది అధికంగా ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి అనంతపురం మీదుగా కాచిగూడ-యశ్వంతపూర్‌, కాచిగూడ-మైసూరు మధ్య రెండు రైళ్లు రోజూ నడుస్తున్నాయి. కాచిగూడ-మైసూర్‌(12786) రైలులో ఈనెల 11 వరకు సీట్లు లేవు. కాచిగూడ-యశ్వంతపూర్‌(17604)లోనూ 12 వరకు ఖాళీల్లేవ్‌.

ఇతర పట్టణాలకూ..

జిల్లా కేంద్రం నుంచి ఇతర పట్టణాలకు ప్రయాణం భారంగా మారుతోంది. అనంతపురం నుంచి ముంబయి, న్యూదిల్లీ వైపు రైళ్లలోనూ అక్టోబరు నెలాఖరు దాకా ఖాళీలు లేవు. ముంబయికి వెళ్లే లోకమాన్యతిలక్‌ కుర్లా(11014) రైలులో అక్టోబరు 30 వరకు సీట్లు ఖాళీ లేవు. న్యూదిల్లీ వైపు వెళ్లే 12627 రైలులో అక్టోబరు 30 దాకా ఏ కోచ్‌లలోనూ ఖాళీలు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని