logo

అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు

దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్‌ ధరకు మించి ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ ఉప కమిషనర్‌ శివరామ ప్రసాద్‌ కాంట్రాక్టు క్యారేజీ బస్సు యజమానులను  హెచ్చరించారు.

Published : 02 Oct 2022 02:58 IST

మాట్లాడుతున్న డీటీసీ శివరామప్రసాద్‌

అరవిందనగర్‌(అనంతపురం): దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్‌ ధరకు మించి ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ ఉప కమిషనర్‌ శివరామ ప్రసాద్‌ కాంట్రాక్టు క్యారేజీ బస్సు యజమానులను  హెచ్చరించారు. అనంతపురంలోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం డీటీసీ మాట్లాడుతూ సీసీ బస్సులో ప్రయాణికుల లగేజీని మాత్రమే అనుమతించాలని, ఇతరత్రా వాణిజ్య సామగ్రిని తరలించకూడదని పేర్కొన్నారు. అలా చేస్తే బస్సు సీజ్‌ చేసి, అపరాధరుసుం విధిస్తామని చెప్పారు.  కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై ఈనెల 6వరకు  తనిఖీలు చేస్తామని, నిబంధనలు పాటించని బస్సులు సీజ్‌ చేస్తామని పేర్కొన్నారు.

హై సెక్యూరిటీ నంబరు ప్లేట్‌ తప్పనిసరి

ప్రతి వాహనదారుడు తమ వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ విధిగా అమర్చుకోవాలని డీటీసీ సూచించారు. జిల్లాలో ఇప్పటికీ పన్ను చెల్లించకుండా 11,656 వాహనాలు తిరుగుతున్నాయని గుర్తించామని తెలిపారు.

ఆటోమేటెడ్‌ సేఫ్టీ డ్రైవింగ్‌ టెస్ట్‌ సిద్ధం

అనంతపురంలోని ప్రధాన కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆటోమేటెడ్‌ సేఫ్టీ డ్రైవింగ్‌ టెస్ట్‌ సోమవారం నుంచి 15 రోజులు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నామని డీటీసీ శివరామ ప్రసాద్‌ తెలిపారు. మోటారు వాహన తనిఖీ అధికారులు, దళారీల ప్రమేయం లేని విధంగా కంప్యూటరైజ్డ్‌ సిస్టంతో చోదక అనుమతి మంజూరు చేసే విధానం అందుబాటులోకి రానుందన్నారు. కేవలం 10 సెకన్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌లో పాసయ్యారా లేదా అనేది అభ్యర్థి సెల్‌ఫోనుకు సమాచారం అందుతుందన్నారు. విలేకరుల సమావేశంలో మోటారు వాహన తనిఖీ అధికారులు రమణారెడ్డి, అతిఖానాజ్‌, సునీత పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని