logo

సంక్షిప్త వార్తలు

ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ప్రసన్నాయపల్లి రైల్వేగేట్ వద్ద శనివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు భ్యాగరాజు (35) జేఎన్‌టీయూలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

Published : 02 Oct 2022 02:57 IST

యువకుడి దుర్మరణం

భాగ్యరాజు (పాతచిత్రం)

రాప్తాడు(ఆత్మకూరు), రొద్దం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ప్రసన్నాయపల్లి రైల్వేగేట్ వద్ద శనివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు భ్యాగరాజు (35) జేఎన్‌టీయూలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. జాతీయ రహదారిలోని రెస్టారెంట్ వద్ద భోజనం తెచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఈ క్రమంలో ప్రసన్నాయపల్లి రైల్వేగేట్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వేగంగా వెళ్లి రైల్వేగేట్ని ఢీకొంది. గాయపడిన అతడిని స్థానికులు 108వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిది రొద్దం మండలం సానిపల్లి గ్రామం. అనంతపురం శారదానగర్‌లో నివాసం ఉంటున్నాడు. భార్య గౌతమి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవరెడ్డి తెలిపారు.


తడకలేరు పశువుల సంతను మూయించండి

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సమీపంలో తడకలేరులో గత ఆదివారం వ్యాపారులు ప్రైవేటు సంత నిర్వహించడంపై కలెక్టర్‌ నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పశువుల సంత నిర్వహించకుండా మూయించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టంబరు 26న ‘ఈనాడు’లో ‘తడకలేరులో పశువుల సంత!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. వ్యాపారులు అనుమతి లేకుండా అనధికారికంగా సంత నిర్వహిస్తారా అంటూ మండిపడ్డారు. పశుసంవర్థక, రెవెన్యూ, పోలీసులు సంయుక్తంగా సంతను కట్టడి చేయాలని ఆదేశించారు. వ్యాపారులు వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి పశువులను తీసుకోరాకుండా జిల్లా సరిహద్దుల్లో నిఘా ఉంచాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.


రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

గుంతకల్లు: బీటెక్‌ చదవడానికి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు లభిస్తుందో లేదో, తండ్రి డబ్బు చెల్లించి ప్రైవేట్‌ కళాశాలలో చేరుస్తారో లేదోనని ఆందోళన చెంది ఓ విద్యార్థి(17) శనివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై మహేంద్ర తెలిపారు. ఈ ఘటన గుంతకల్లు-ద్రోణాచలం సెక్షన్‌ కసాపురం సమీపంలోని రైల్వే లైనులో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూ ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వివరించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


వాహనం ఢీకొని బాలుడి మృతి 

హిందూపురం పట్టణం: సంతేబిదనూరు గేట్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని ఐచర్‌ వాహనం ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు.  పట్టణంలోని కోట ప్రాంతానికి చెందిన చాంద్‌బాషా కుమారుడు ఇర్ఫాన్‌ (15) మరో యువకుడితో కలిసి సొంత పని మీద ద్విచక్ర వాహనంలో తూమకుంట వెళ్లాడు. శనివారం పట్టణానికి తిరిగి వస్తుండగా, ఐచర్‌ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ఇర్ఫాన్‌ అక్కడిక్కడే మృతి చెందాడు.  


నంబర్‌ప్లేట్లు లేని వాహనాలు నడిపితే సీజ్‌ చేస్తాం

అనంత నేరవార్తలు: నంబర్‌ప్లేట్లు లేని వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం, అలాంటి వాహన చోదకులలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. ఈనెల 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నంబర్‌ప్లేట్లు లేని వాహనాలను గుర్తించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.
 

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని