logo

సుద్దముక్కకు దిక్కులేదు

పాఠశాలలు తెరిచి మూడు నెలలు గడచినా నిర్వహణ నిధుల విడుదల కాలేదు. దీంతో సుద్ధ ముక్కలు, బోధన ఉపకరణాలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఓవైపు నిధుల్లో కోత మరోవైపు నిధుల విడుదలలో జాప్యం వెరసి పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారింది.

Updated : 03 Oct 2022 05:42 IST

పాఠశాలల నిర్వహణ నిధుల్లో కోత

మూడు నెలలుగా విడుదలకాని వైనం

పుట్టపర్తి గ్రామీణం, అనంతపురం విద్య, న్యూస్‌టుడే

బోధనలో ఉపాధ్యాయిని

పాఠశాలలు తెరిచి మూడు నెలలు గడచినా నిర్వహణ నిధుల విడుదల కాలేదు. దీంతో సుద్ధ ముక్కలు, బోధన ఉపకరణాలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఓవైపు నిధుల్లో కోత మరోవైపు నిధుల విడుదలలో జాప్యం వెరసి పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారింది. సుద్ధముక్కలు, రిజిష్టర్ల నిర్వహణకు హెచ్‌ఎంలు జేబు నుంచి సొంత డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే నిర్వహణ నిధులతోనే సుద్ద ముక్కలు, డస్టర్లు, స్టేషనరీ, విద్యుత్తు బిల్లులు, రిజిష్టర్లు, క్రీడా సామగ్రి, ప్రయోగశాలలు, దిన పత్రికలు, ఇంటర్నెట్‌ సదుపాయం, తాగునీరు, బోధన సామగ్రి కొనుగోలు, చిన్నపాటి మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. మూడు నెలలుగా నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఇబ్బంది పడుతుంటే తాజాగా ప్రభుత్వ కొత్త నిబంధనలు, కోత పెడుతూ విడుదల చేసిన నిధులు చూసి ఉపాధ్యాయులు అవాక్కవుతున్నారు. దీంతో కనీస అవసరాలుగా వాడే సుద్ధ ముక్కలు, రిజిష్టర్లకూ ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.

గతేడాది వరకు నిధుల విడుదల ఇలా.. 

పాఠశాలలకు సమగ్ర శిక్షా అభియాన్‌ తరఫున ఏటా నిర్వహణ నిధులు విడుదల చేయడం జరుగుతోంది. వీటిని పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇచ్చేవారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా నిర్వహణ నిధుల్లో కోత విధించేలా ప్రభుత్వం నిబంధనలు తీసుకువచ్చింది. స్కూల్‌ గ్రాంట్‌గా ప్రాథమిక పాఠశాలలకు రూ.10 వేలు, యూపీ, ఉన్నత పాఠశాలలకు రూ.25 వేలు మాత్రమేనని మార్గదర్శకాల్లో పేర్కొంది. 10 నుంచి 25 మంది విద్యార్థులున్నా.. 150 మంది విద్యార్థుల సంఖ్య ఉన్నా రూ.10 వేలు ఇవ్వడమేమిటని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ నిధులతో సుద్దముక్కలు కొనాలా.. రూ.వేలల్లో వచ్చే విద్యుత్తు బిల్లు చెల్లించాలా, దస్త్రాలు, బోధన సామగ్రికి ఎక్కడి నుంచి తీసుకు రావాలని ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్తు బిల్లుకే చాలదు

ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. గాలి వెలుతురు కోసం ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు వంటకు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర వాటికోసం నీటి వినియోగం బాగా పెరిగింది. శుద్ధజలం నిమిత్తం పెట్టిన ఆర్వో ప్లాంట్లు విద్యుత్తు ఆధారంగా నడవాలి. మరోవైపు కంప్యూటర్లు, ప్రింటర్లు వివిధ నివేదికల తయారీకి విద్యుత్తు వాడకం పెరిగి బిల్లులు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు ప్రాథమిక పాఠశాలలకు రూ.350 వచ్చే బిల్లు రూ.వెయ్యి, ఉన్నత పాఠశాలల్లో రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వచ్చే బిల్లు రూ.5 వేలు దాటుతోంది. దీనికి ఏదైనా రిపేరు వస్తే వాటిని బాగు చేయడానికి ప్లంబర్‌, మెకానిక్‌లకు రూ.500 నుంచి రూ.1000 వరకు సేవా రుసుములు చెల్లించాల్సి వస్తోంది.

అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇదీ పరిస్థితి

ఉమ్మడి అనంత జిల్లాలో ప్రాథమిక స్థాయి పాఠశాలలు 3,164 ఉండగా వీటికి యూనిట్‌ రూ.10 వేల మేర రూ.3.16 కోట్లకుగాను రూ.820.250 లక్షలు, యూపీ, ఉన్నత స్థాయి పాఠశాలలు 697 ఉండగా వీటికి రూ.25 వేల మేర రూ.1.39 కోట్లకుగాను రూ.412.20 లక్షలు విడుదల చేశారు. మొత్తంగా జిల్లాలోని 3,861 పాఠశాలలకు స్కూల్‌ గ్రాంట్‌ కింద రూ.1232.45 లక్షలకుగాను ప్రస్తుతం 20 శాతం నిధులు అంటే రూ.246.49 లక్షలు మాత్రమే విడుదల చేశారు.


జేబు నుంచి కట్టాల్సి వస్తోంది

రూ.లక్షకు పైగా బిల్లు ఉన్న పాఠశాలలకు పాఠశాల గ్రాంటు రాలేదు. రాప్తాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా రూ.1.04 లక్షలు బిల్లు పెట్టాం. ఇంతవరకూ రాలేదు. ఉన్నత పాఠశాలకు నెలకు కనీసం రూ.ఐదారు వేలు కరెంటు బిల్లు వస్తోంది. ప్రధానోపాధ్యాయుడి జీతం నుంచి బిల్లు కట్టాల్సిన పరిస్థితి.

- నరసింహులు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి


ప్రభుత్వ ఆదేశాల మేరకే

పాఠశాలల నిర్వహణ గ్రాంటు విడుదల ప్రభుత్వ పరిధిలో ఉంది. విద్యార్థుల సంఖ్యతో కూడిన జాబితా కూడా ప్రభుత్వం పంపింది. గ్రాంట్‌ విద్యార్థుల సంఖ్య ఆధారంగానా లేక మార్గదర్శకాల మేరకు వినియోగించాలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

- తిలక్‌విద్యాసాగర్‌, ఏపీసీ

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని