logo

అక్కడ ప్రగతి ఇక్కడ అధోగతి!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత ర్యాంకుల్లో అనంతపురం చతికిలపడింది. కనీసం చిన్న పురపాలకల స్థాయిలో కూడా లేదు. అనంతపురం పురపాలక నుంచి నగరంగా రూపాంతరం చెంది ఇప్పటికే 17 ఏళ్లు దాటింది. పేరుకే నగరమే తప్ప.. స్వచ్ఛత కన్పిస్తున్న దాఖలాలు లేవు.

Updated : 03 Oct 2022 06:04 IST

స్వచ్ఛత ర్యాంకుల్లో జిల్లా కేంద్రం నగుబాటు

అనంత నగరపాలక, తాడిపత్రి, న్యూస్‌టుడే:

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత ర్యాంకుల్లో అనంతపురం చతికిలపడింది. కనీసం చిన్న పురపాలకల స్థాయిలో కూడా లేదు. అనంతపురం పురపాలక నుంచి నగరంగా రూపాంతరం చెంది ఇప్పటికే 17 ఏళ్లు దాటింది. పేరుకే నగరమే తప్ప.. స్వచ్ఛత కన్పిస్తున్న దాఖలాలు లేవు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛత ర్యాంకుల్లో తాడిపత్రి జిల్లాలోనే మంచి ర్యాంకు సాధించింది. ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా కేంద్రం స్వచ్ఛతలో ఎందుకు వెనుకబడిందో కాస్త ఆలోచించి ఆదిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.


ఆరంభ శూరత్వం

నగరంలో ప్లాస్టిక్‌ కవర్లలో విక్రయాలు

ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం అనంతపురంలో ఆరంభశూరత్వంగా మారింది. జులై ఒకటో తేదీ నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. మొదటి నెలలో ర్యాలీలతో పాటు అడపాదడపా దాడులు నిర్వహించి రూ.లక్ష వరకు జరిమానా విధించారు. రెండు నెలల నుంచి హెచ్చరికలతో సరిపెట్టి దాడుల గురించి మరచిపోయారు. నగరంలో రోజుకు సుమారుగా 20 నుంచి 30 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ పోగవుతోంది.

తాడిపత్రిలో ఇలా..

సరకులకు ఇలా సంచి తెసుకెళ్లాల్సిందే..

తాడిపత్రిలో ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు ఉండవు. వంద శాతం నిషేధం అమల్లో ఉంది. గతంలో అవార్డు సైతం దక్కింది. పట్టణంలో ఎక్కడా ప్లాస్టిక్‌ కవర్లు కనిపించవు. అందువల్లే స్వచ్ఛత ర్యాంకుల్లో తన సత్తాను మరో సారి ప్రదర్శించింది.


ఎన్నికల హమీగానే భూగర్భ డ్రైనేజీ

గుల్జార్‌పేటలో రోడ్డుపై మురుగు

అనంతలో భూగర్భ డ్రైనేజీ ఎన్నికల హామీగానే మిగులుతోంది. గత ప్రభుత్వ హయాంలో నగరంలో భూగర్భ డ్రైనేజీ కోసం రూ.440.75 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు ఉత్తర్వులు అందినా భూగర్భ డ్రైనేజీ గురించి పట్టించుకోవడం లేదు. కమలానగర్‌లోని రాజు రోడ్డు, సప్తగిరి కూడలి, ఆదిమూర్తినగర్‌, గుల్జార్‌పేటలో నిత్యం మురుగు రోడ్డుపైకి వస్తుంది. శివారు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కాలువలు లేక మురుగు నివాసాల మధ్య నిలుస్తోంది.

అక్కడ 90 శాతం అమలు

మురుగునీటి శుద్ధి ప్లాంటు

తాడిపత్రిలో 90 శాతం భూగర్భ డ్రైనేజీ ఉంది. విశాలమైన సిమెంటు రోడ్లు ఉన్నాయి. మురుగు నీరు శుభ్రం చేయడానికి రెండు ప్లాంట్లు ఉన్నాయి. శుభ్రం చేసిన వాటిని పురపాలకలో మొక్కలకు పోసి సంరక్షిస్తారు. రోడ్లపై ఎక్కడా మురుగు ప్రవాహం కనిపించదు.


కొరవడిన చిత్త శుద్ధి

ఆరో రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా చెత్త ఇలా..

నగరంలో పరిశుభ్రత కొరవడింది. నగరంలో 79 వేల నివాసాలు ఉన్నాయి. రోజుకు 125 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవుతోంది. పారిశుద్ధ్య కార్మికులు 678 మంది ఉన్నారు. కార్మికుల కొరత ఉన్నా, ఉన్నవారు చిత్తశుద్ధితో పని చేస్తే చెత్త కనిపించకుండా చేయవచ్చు. ప్రజల ఆలోచనా విధానంలో సైతం కొంత మార్పు రావాల్సి ఉంది.

శుభ్రతే ప్రామాణికం

నిత్యం చెత్త తరలింపు

తాడిపత్రిలో రహదారులు శుభ్రంగా కన్పిస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. కార్మికులు 180 మంది మాత్రమే ఉన్నారు. చెత్త సేకరించి వాటిని వర్మీ కంపోస్టు చేసి మొక్కలకు వేయడంతో పాటు ప్రత్యేకంగా అల్లనేరేడు తోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్వచ్ఛత కార్యక్రమాలతో పాటు వృథాగా ఉన్న వాటితో సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తున్నారు.


పచ్చదనం అంతంతే..

నగరంలో కనిపించని పచ్చదనం

నగరం మొత్తం 50 డివిజన్లు ఉండగా ఏ డివిజన్లో కూడా పూర్తి స్థాయిలో పచ్చదనం కనిపించదు. మొక్కలు నాటుతున్నా వాటిని సంరక్షించడంలో శ్రద్ధ చూపడం లేదు. పచ్చదనం పెంపు కోసం నగరంలో 12 వేలు మొక్కలు నాటాలని నిర్ణయించారు. మొత్తం 16 కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య పెంచాలని నిర్ణయించారు. ఇందు కోసం నగరపాలక సాధారణ, 15వ ఆర్థిక ప్రణాళిక నుంచి రూ.2 కోట్లు వెచ్చించాలని ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో కార్యాచరణ లేదు.

తాడిపత్రిలో ఆహ్లాద వాతావరణం

ఏ వీధిలో చూసినా పచ్చనిచెట్లే

తాడిపత్రిలో మొక్కల పెంపకం విరివిగా చేపట్టారు. గతంలో ఒకేసారి పురపాలక పరిధిలో 16 వేల మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించారు. ప్రతి దుకాణం వద్ద కచ్చితంగా మొక్క నాటడంతో పాటు సంరక్షించాలని కఠినంగా వ్యవహరించడంతోనే అక్కడ పచ్చదనం పరిడవిల్లింది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉన్నా చెట్లు కొంత వరకు కాలుష్యాన్ని నివారిస్తున్నాయి.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts