logo

ఆర్భాటం చేసినా.. ఆదరణ అంతంతే!

మధ్య ఆదాయ వర్గాలవారి సొంతింటి కల నెరవేరడం కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లేఔట్) స్థలాల కేటాయింపునకు ధర్మవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుణుతూరు రెవెన్యూ పొలంలో 120 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది.

Updated : 03 Oct 2022 05:44 IST

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌కు స్పందన కరవు

ప్రారంభించి 9 నెలలవుతున్నా కనిపించని పురోగతి

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో నత్తనడకన జరుగుతున్న పనులు

ధర్మవరం, న్యూస్‌టుడే: మధ్య ఆదాయ వర్గాలవారి సొంతింటి కల నెరవేరడం కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లేఔట్) స్థలాల కేటాయింపునకు ధర్మవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుణుతూరు రెవెన్యూ పొలంలో 120 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. రూ.106 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరి 11న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. అదేరోజు కుణుతూరులో ఎంఐజీ లేఔట్ ప్రారంభించారు. 1,273 ప్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాటు ధరలో 20 శాతం రాయితీ కల్పించారు. చదరపు గజం రూ.5,999 ధర నిర్ణయించారు. 150, 200, 240 చదరపు గజాల చొప్పున మూడు రకాల ప్లాట్లు రూపొందించారు.

ప్లాట్లు 1273, దరఖాస్తులు 350

ధర్మవరం నుంచి మరూరు వెళ్లే రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ లేఔట్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఉద్యోగులు, మధ్యతరగతి ఆదాయ వర్గాలవారు సుముఖత చూపడం లేదు. 1,273 ప్లాట్లకుగాను ఇప్పటివరకు కేవలం 350 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్లాటు కోసం లబ్ధిదారులు 10 శాతం నగదు చెల్లించారు. విస్తృత ప్రచారం చేసినా కొనుగోలుదారుల నుంచి మాత్రం స్పందన కొరవడింది. ఎంఐజీ లేఔట్ ఏర్పాటు చేసిన సమీప ప్రాంతాల్లో ఉన్న స్థలాలు మరింత చౌకగా లభిస్తుండటంతో జగనన్న టౌన్‌షిప్‌లో కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. దరఖాస్తు చేసుకొని 10 శాతం నగదు చెల్లించినవారికి ప్లాట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పనులెప్పుడు పూర్తి అవుతాయో..?

ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీˆసీˆ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, నీటి సరఫరా, భూగర్భ మురుగు కాలువల పైపులైన్లు, విద్యుత్తు సదుపాయం, వీధిదీపాలు, వర్షపు నీటి కాలువలు, ఉద్యానవనాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్ పర్యవేక్షణలో పనులు చేపట్టారు. పొక్లెయిన్లు, హిటాచీలతో నేల చదునుతో పాటు వివిధ పనులు చేస్తున్నారు. సరిహద్దులు ఏర్పాటు చేశారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు సాగుతున్నాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులు జరగాల్సి ఉంది. పథకం ప్రారంభించి 9 నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేకపోవడంతో ఎప్పటికి పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


40 శాతం పనులు పూర్తి చేశాం

ధర్మవరం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో ఇప్పటివరకు 40 శాతం పనులు జరిగాయి. అంతర్గత రహదారుల సరిహద్దులు పూర్తి చేశాం. భూగర్భ డ్రైనేజీ పనులు తుది దశకు వచ్చాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే మిగతా పనులు వేగవంతం అవుతాయి. రహదారుల పనులు త్వరలో ప్రారంభిస్తాం. పనుల పురోగతిపై పర్యవేక్షణ చేస్తున్నాం. లబ్ధిదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- మురళీకృష్ణ గౌడ్‌ (వైస్‌ ఛైర్మన్‌, అహుడా)

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts
Telugu-news