logo

భూ హక్కు.. తొలగని చిక్కు!

అక్టోబరు 2 నుంచి శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుడతాం. రాష్ట్రంలో 17,500 గ్రామాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 2వేల గ్రామాల్లో హక్కు పత్రాల పంపిణీ చేస్తాం. పనులు వేగంగా సాగుతున్నాయి. - ఆగస్టు 17న అనంత కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లం చెప్పిన మాటలివి.

Published : 04 Oct 2022 02:35 IST

30 శాతంపైగా తప్పులు

పత్రాల పంపిణీ వాయిదా

న్యూస్‌టుడే: జిల్లా సచివాలయం

అక్టోబరు 2 నుంచి శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుడతాం. రాష్ట్రంలో 17,500 గ్రామాలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 2వేల గ్రామాల్లో హక్కు పత్రాల పంపిణీ చేస్తాం. పనులు వేగంగా సాగుతున్నాయి. - ఆగస్టు 17న అనంత కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్‌ కల్లం చెప్పిన మాటలివి.

డ్రోన్‌తో రీ సర్వే

గనన్న శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీపై స్పష్టత కొరవడింది. ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబరు 2న భూ హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా ప్రకటించింది. గాంధీ జయంతి రోజున ఆ ఊసేలేదు. హక్కు పత్రాల ముద్రణ ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అరకొరగా ముద్రించిన పత్రాల్లోనూ ముప్పై శాతానికిపైగా తప్పులు దొర్లాయి. అందుకే పంపిణీ వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదట్నుంచి రీ సర్వే హడావుడిగా నడుస్తోంది. రోవర్లు, డ్రోన్లు వంటి అధునాతన సాంకేతిక సర్వే పరికరాల కొరత వేధిస్తోంది. క్షేత్ర స్థాయిలో తలెత్తిన సమస్యలు, ఇబ్బందులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా లక్ష్యాలను నిర్దేశించడంతో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది.

రెండేళ్ల కిందటే శ్రీకారం
భూముల రీ సర్వే నిర్వహించి శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020 నవంబరులో ప్రక్రియ మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని 63 మండలాల పరిధిలో 965 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో అనంతలో 504, శ్రీసత్యసాయి జిల్లాలో 461 ఉన్నాయి. తొలి విడతగా 311 గ్రామాల్లో రీ సర్వేకు శ్రీకారం చుట్టారు. తొలుత ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాల్లో పూర్తి చేశారు. దశల వారీగా 28 మండలాల పరిధిలో 64 గ్రామాల్లో సర్వే చేశారు. 64 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేయడానికి రెండేళ్ల కాలం పట్టింది.

2,584 హక్కు పత్రాలు
ఉమ్మడి జిల్లాలో 42,110 ఎల్‌పీఎంలు పూర్తయినా.. అనంత జిల్లాలో 31,923 ఎల్‌పీఎంల్లో 2,584 భూ కమత పటాలు, హక్కు పత్రాలు మాత్రమే వచ్చాయి. ఇందులోనూ తప్పులు అనేకం ఉన్నాయి. భూ యజమాని పేర్లు, సర్వే నంబర్లు, ఫొటోలు, ఇతర వివరాల్లో తప్పులు దొర్లినట్లు సమాచారం. నాలుగు రోజుల కిందట ఎల్‌పీఎంలను యజమానులు పరిశీలించారు. ఈ క్రమంలో తప్పులు బయటపడ్డాయి. దీంతో పంపిణీ వాయిదా వేశారు. సరైన వివరాలు ముద్రించేందుకు పత్రాలను వెనక్కి పంపినట్లు తెలిసింది. శ్రీసత్యసాయి జిల్లాకు ఒక ఎల్‌పీఎం కూడా సరఫరా కాలేదు.

42,110 ఎల్‌పీఎంలు సిద్ధం
రెండేళ్లలో అనంతలో 41, శ్రీసత్యసాయి జిల్లాలో 23 గ్రామాలు చొప్పున సర్వే పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 42,110 భూ కమత పటాల(ఎల్‌పీఎం) పరిధిలో 1,68,351.95 ఎకరాల విస్తీర్ణంలో సర్వే పూర్తయింది. అనంత జిల్లాలో 31,923 పటాల పరిధిలో 1,41,149.99 ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 10,187 పటాల పరిధిలో 27,201.96 ఎకరాల చొప్పున సర్వే పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

పత్రాలు పరిశీలిస్తున్నాం
- కేతన్‌గార్గ్‌, జేసీ

అనంత జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా 2,584 హక్కు పత్రాలు వచ్చాయి. వీటిని సంబంధిత మండలాల్లో పరిశీలిస్తున్నారు. కొన్నింటిలో తప్పులు దొర్లాయి. వాటిని సరిచేసి మళ్లీ ముద్రించేందుకు వెనక్కి పంపిస్తున్నాం. హక్కు పత్రాల పంపిణీ దశల వారీగా సాగుతుంది. రీ సర్వేలో ఎలాంటి తప్పులు జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని