logo

క్రైమ్‌ వార్తలు

ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీలో సీటు వస్తుందో లేదో అని ఒత్తిడికి గురై వైద్య విద్యార్థిని బలవన్మరణం చేసుకున్న ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం... హిందూపురం పట్టణం సమీప కొట్నూరుకు చెందిన ఒకటో వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) కర్నూలులోని ఓ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది.

Published : 04 Oct 2022 02:35 IST

ఒత్తిడి తట్టుకోలేక వైద్య విద్యార్థిని బలవన్మరణం

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీలో సీటు వస్తుందో లేదో అని ఒత్తిడికి గురై వైద్య విద్యార్థిని బలవన్మరణం చేసుకున్న ఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం... హిందూపురం పట్టణం సమీప కొట్నూరుకు చెందిన ఒకటో వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) కర్నూలులోని ఓ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. వైద్యవిద్య పీజీ అభ్యసించటానికి బెంగళూరులో శిక్షణ పొందుతూ దసరా పండగకు గ్రామానికి వచ్చింది. తీవ్ర ఒత్తిడికి గురైన విద్యార్థిని సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకటో పోలీస్‌స్టేషన్‌ సీఐ ఇస్మాయిల్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


భార్యాభర్తలపై గొడ్డలితో దాడి

ఉరవకొండ, న్యూస్‌టుడే: మద్యం మత్తులో భార్యతో గొడవపడుతున్న వ్యక్తికి సర్దిచెప్పబోయిన భార్యాభర్తలపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసిన ఘటన ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా... ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల గ్రామంలో సోమవారం రాత్రి వెంకటేశ్‌ అనే వ్యక్తి మద్యం తాగి భార్యతో గొడవపడుతూ కొట్టడానికి యత్నించాడు. అదే సమయంలో పక్క ఇంటిలో ఉన్న మర్రిస్వామి, ఎర్రమ్మ దంపతులు గొడవ పడవద్దంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. తనకు అడ్డుచెప్పడానికి మీరెవరంటూ వారిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వీరిని చికిత్సకు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతులపై దాడిచేయడంతో ఆవేశానికి గురైన వారి బంధువులు గొడ్డలితో దాడిచేసిన వెంకటేశ్‌పై కూడా కట్టెలతో ప్రతిదాడి చేసినట్లు తెలిసింది. అతడిని కూడా చికిత్స కోసం అత్యవసర వాహనంలో ఉరవకొండ తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీశారు. దీనిపై వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో కౌకుంట్లకు చెందిన ఇరువర్గాలు ఉరవకొండ వైపు రాకుండా గ్రామ శివారులో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


భర్తను హత్య చేసిన భార్య

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిలో సోమవారం తెల్లవారుజామున భర్తను భార్య హత్య చేసింది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక చెర్లోపల్లి కాలనీలో నివాసం ఉంటున్న ఈశ్వర్‌నాయక్‌(35) స్వగ్రామం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బాటతండా. 15ఏళ్ల కిందట గుత్తికి వచ్చి స్థిరపడ్డాడు. కొంతకాలంపాటు ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేశాడు. ప్రస్తుతం గుత్తి అటవీశాఖ క్షేత్రాధికారి జీపునకు ఒప్పంద పద్ధతిన డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈశ్వర్‌నాయక్‌కు తాగుడు అలవాటు ఉంది. భార్యపై అనుమానంతో వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేదింపులు తాళలేక అతని భార్య ఉమాబాయి పథకం ప్రకారం మద్యం మత్తులో ఉన్న భర్త తలపై రోకలి బండతో బాదింది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను ఆటోలో ఆసుపత్రికి తీసుకొచ్చింది. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున అతడు మృతిచెందాడు. తన భర్త మద్యం మత్తులో కిందపడి, గాయపడి మృతిచెందినట్లు ఆమె పోలీసులను బుకాయించింది. బంధువులనూ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు లోతుగా విచారించగా తానే హత్య చేసినట్లు ఉమాబాయి అంగీకరించింది. ఈశ్వర్‌నాయక్‌ సోదరుడు ఇంద్రసేనానాయక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ట్రాక్టర్‌ కిందపడి రైతు మృతి

గార్లదిన్నె, న్యూస్‌టుడే: పంటల సాగులో ఆదర్శంగా నిలుస్తున్న బయపరెడ్డి(52) అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి మృతిచెందారు. ఈ ఘటన సోమవారం గార్లదిన్నె గ్రామంలో చోటుచేసుకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువుల వివరాల మేరకు.. బయపరెడ్డి తన సొంత పొలంలో రోటావేటర్‌ను ట్రాక్టర్‌కు తగిలించుకొని వ్యవసాయ పనులు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కాలు చక్రంలో ఇరుక్కుపోయింది. కుమారుడు తండ్రికి ఫోన్‌ చేయగా ఎంతకూ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానంతో తోట వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్‌ కింద పడి ఉన్నారు. సోదరులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలికి చేరుకొని రైతును బయటకు తీసి హుటాహుటిన అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులతోపాటు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


డెంగీతో విద్యార్థి...

గుడిబండ: మండలంలోని రామయ్యనహట్టి గ్రామానికి చెందిన కరేగుడ్డప్ప, శివమ్మ కుమారుడు విద్యార్థి గోపి (12) డెంగీ లక్షణాలతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి గత ఐదు రోజుల కిందట జ్వరం ప్రబలడంతో సమీప కర్ణాటక రాష్ట్రం కొరటగెరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గోపి సోమవారం మృతి చెందాడు. విద్యార్థి జంబులబండ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని