logo

అమ్మ నిరీక్షణ

గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి... మాతాశిశు మరణాలను నివారించడమే ధ్యేయంగా అమలవుతున్న మాతృత్వ వందన యోజన నీరుగారిపోతోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో లక్ష్యం అమలు కావడం లేదు. ఫలితంగా నెలల తరబడి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి.

Published : 04 Oct 2022 02:35 IST

మాతృత్వ వందన యోజనకు 12,640 మంది ఎదురుచూపు
న్యూస్‌టుడే, పుట్టపర్తి

పేర్లు నమోదు చేసుకుంటున్న గర్భిణులు

ర్భిణుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి... మాతాశిశు మరణాలను నివారించడమే ధ్యేయంగా అమలవుతున్న మాతృత్వ వందన యోజన నీరుగారిపోతోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో లక్ష్యం అమలు కావడం లేదు. ఫలితంగా నెలల తరబడి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. తొలి కాన్పు కింద నమోదైన బాలింతలకు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ద్వారా రూ.5 వేలు చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ పథకానికి బాలారిష్టాలు తప్పడం లేదు.

అపరిష్కృతంగా  12,640 దరఖాస్తులు
జిల్లాలో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద 2022-23 మార్చి నుంచి ఇప్పటి వరకు 14,081 దరఖాస్తులు రాగా, వీటిలో అపరిష్కృతంగా 12,640 దరఖాస్తులు ఉన్నాయి. వీటికితోడు రోజూ దాదాపు వంద దరఖాస్తులు అదనంగా చేరుతున్నాయి. తొలి విడతలో గర్భిణులకు సక్రమంగా నిధులు రాకపోవడంలో వైద్యసిబ్బంది నమోదు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. 2017 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో 21,282 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు జమ చేయకపోవడంతో గర్భిణులు సరైన పోషకాహారాన్ని తీసుకలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు.

నీరుగారుతోన్న లక్ష్యం
గర్భిణులకు పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో.. మూడు దశల్లో రూ.5 వేలు అందజేస్తున్నారు. మొదటి విడతగా గర్భిణి నమోదు సమయంలో రూ.1,000, ఆరు నెలల తర్వాత రూ.2 వేలు, కాన్పు అయ్యాక రూ.2 వేలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను విడివిడిగా పంపుతున్నారు. ఈ క్రమంలో తొలి విడత కాన్పులను తొలి విడత నమోదులో జాప్యంతో చాలామందికి నగదు అందడం లేదు. రెండు, మూడో విడత డబ్బులు సైతం అందకపోవడంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు.

నిధుల విడుదలలో జాప్యం
సకాలంలో నిధులు విడుదల కాకపోవడం, రోజురోజుకు కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేయడం మినహాయిస్తే, లబ్ధిదారులకు అందకపోవడంతో దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. నిరుపేద గర్భిణులు ప్రభుత్వం ఇచ్చే ఈ సొమ్ము అందక సరైన ఆహారం తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిధులు విడుదల కాకపోవడంతో తొలి కాన్పు మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, వైద్యులను సంప్రదిస్తున్నా.. బ్యాంకు ఖాతాలను పరిశీలించుకుంటూ మిన్నకుండిపోతున్నారు.

గర్భిణుల ఖాతాల్లో జమ చేస్తున్నాం
- తిప్పేంద్రనాయక్‌, జిల్లా వైద్యాధికారి

గర్భిణుల ఖాతాల్లో దశలవారీగా నగదు జమ చేస్తున్నాం. త్వరలో నిధులు విడుదల అవుతాయి. కొత్త దరఖాస్తునూ స్వీకరిస్తున్నాం. ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేస్తున్నాం. నిధులు విడుదల కాగానే ఖాతాల్లోకి జమ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని