logo

పంట.. పండిందప్పా

పంటకు నీటితడి అందించేందుకు ధర్మవరం డివిజన్‌ పరిధిలోని కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామానికి చెందిన గ్రామీణ తపాలాశాఖ చిరుద్యోగి, రైతు భీమనేని శ్రీనివాస్‌చౌదరి కొత్త పద్ధతి అనుసరించారు. తక్కువ నీటితో వేరుసెనగలో చక్కటి దిగుబడి సాధించారు.

Published : 04 Oct 2022 02:35 IST

ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్‌

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పంటకు నీటితడి అందించేందుకు ధర్మవరం డివిజన్‌ పరిధిలోని కనగానపల్లి మండలం చంద్రాచర్ల గ్రామానికి చెందిన గ్రామీణ తపాలాశాఖ చిరుద్యోగి, రైతు భీమనేని శ్రీనివాస్‌చౌదరి కొత్త పద్ధతి అనుసరించారు. తక్కువ నీటితో వేరుసెనగలో చక్కటి దిగుబడి సాధించారు.

ఎక్కువ విస్తీర్ణంలో తడి..
స్ప్రింకర్ల ద్వారా నీటితడి అందించడం కాస్త కష్టమే. పొలాల్లో పైపులు ఎత్తుకొని నడవడం ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రీనివాస్‌చౌదరికి 16 ఎకరాల పొలం ఉంది. అందులో డ్రిప్‌కు ఏర్పాటుచేసిన పైపులకు 20 అడుగులకు ఒకచోట రంధ్రాలు ఏర్పాటు చేయించారు. అక్కడ 3/4 ఇంచుల డ్రిప్‌ వైరు లాగారు. చివరిభాగంలో కడ్డీకి ప్లాస్టిక్‌ పైపు ఏర్పాటుచేసి వాటికి స్ప్రింక్లర్‌ గన్‌ అమర్చారు. ఒక్కోదానికి రూ.800 వెచ్చించారు. నీటితడి సులభతరమవడంతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో అందించేందుకు దోహదపడిందని రైతు పేర్కొన్నారు.

వేరుసెనగ తొలగిస్తున్న కూలీలు

పొలం వద్దే కొనుగోలు..
పైపులతో 20 గన్నుల ద్వారా నీటితడి అందించేవారు. కొత్త విధానంలో నీటి పొదుపుతోపాటు 40 స్ప్రింకర్ల గన్నులతో పంటను తడిపారు. కే-6 రకం విత్తనం నార్పల నుంచి కొనుగోలు చేశారు. క్వింటా రూ.12 వేలు చొప్పున 12 క్వింటాళ్లకు రూ.1.44 లక్షలు, మందుల పిచికారీ, పంట తొలగింపు, ఇతర ఖర్చులు కింద సుమారు రూ.2.56 లక్షలు వెచ్చించారు. 320 బస్తాలు దిగుబడి వచ్చింది. పొలం వద్దే వ్యాపారులు బస్తా(46 కిలోలు) రూ.3,400 చొప్పున కొనుగోలు చేశారు. పశుగ్రాసం రూ.40 వేలకు విక్రయించారు. పెట్టుబడిపోను రూ.7.18 లక్షల రాబడి వచ్చింది.


శ్రమ తక్కువ..
-భీమనేని శ్రీనివాస్‌ చౌదరి, రైతు

వ్యవసాయానికి రెండు దఫాలుగా విద్యుత్తు సరఫరా చేస్తారు. ఆ సమయంలో తుంపర పరికరాలు మార్చుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. డ్రిప్‌వైర్‌ ఏర్పాటు చేసిన స్ప్రింకర్ల పైపులు సులభంగా మార్చుకోవచ్చు. నీళ్లు కూడా ఆదా అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని