logo

అప్పు తీసుకుంటే అంతే!

ధర్మవరంలో వడ్డీకాసురుల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. చిరువ్యాపారులు, చేనేత కార్మికులు, చిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని జలగల్లా పీడిస్తున్నారు.

Published : 07 Oct 2022 04:42 IST

జలగల్లా పీలుస్తున్న వడ్డీ వ్యాపారులు

ఏడాదిలో పదిమంది బలవన్మరణం

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరంలో వడ్డీకాసురుల దందాకు అడ్డుకట్ట పడటం లేదు. చిరువ్యాపారులు, చేనేత కార్మికులు, చిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకుని జలగల్లా పీడిస్తున్నారు. సకాలంలో అప్పు చెల్లించకపోతే వడ్డీకి వడ్డీ వేసి రుణగ్రహీతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఏడాది కాలంలో ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల బెదిరింపులు తాళలేక 10 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీసుకున్న రుణానికి ఖాళీ ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం యథేచ్ఛగా కొనసాగుతోంది. కట్టడి చేయాల్సిన పోలీసు యంత్రాంగం ఫిర్యాదు లేదనే కారణంతో మిన్నకుండిపోతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని వడ్డీ వ్యాపారులు పేట్రేగుతున్నారు.

నాలుగు నెలల్లో ఘటనలివీ..

ధర్మవరం చంద్రబాబునగర్‌కు చెందిన చేనేత కార్మికుడు లక్ష్మీకాంత్‌ మగ్గాల నిర్వహణకు వడ్డీ వ్యాపారులతో అప్పు తీసుకున్నాడు. వడ్డీతోపాటు రుణం చెల్లించాలని వ్యాపారులు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగి అవసరార్థం అప్పు చేశాడు. అధిక వడ్డీ కావడంతో సకాలంలో చెల్లించలేక మరోచోట అప్పు చేశాడు. వడ్డీల భారం పెరగడంతోపాటు, వ్యాపారులు ఒత్తిడి చేయడంతో బలవన్మరణం చెందాడు.
ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్‌ అవసరార్థం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. తీసుకున్న రుణానికి అధిక వడ్డీలు కట్టించుకోవడం, రుణం కట్టాలని వ్యాపారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఉరి వేసుకున్నాడు.

దోపిడీ ఇలా..

వ్యాపారుల వద్ద రూ.లక్ష అప్పు తీసుకుంటే వారానికి వందకు రూ.10 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. రూ.లక్ష అప్పు తీసుకున్నవారు నెలకు వడ్డీ రూపంలోనే రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నెల తర్వాత అసలు, వడ్డీ పూర్తి చెల్లించాలి. లేదంటే అసలు, వడ్డీ కలిపి మరో ప్రామిసరీ నోటు రాయించుకుంటున్నారు. అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోతే ఫోన్లు చేసి బెదిరించడం, వాహనాల్లో గుంపులుగా ఇళ్ల వద్దకు రావడం చేస్తున్నారు. దీంతో రుణగ్రహీతలు భయపడి ఆస్తులు తనఖా పెడుతున్నారు. మరికొందరు బెదిరింపులు తాళలేక బలవన్మరణం చెందుతున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
- రమాకాంత్‌, డీఎస్పీ, ధర్మవరం

బాధితులు ధైర్యంగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. బెదిరింపులకు పాల్పడి, అధిక వడ్డీలు వసూలు చేసేవారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులను ఆశ్రయిస్తే తగిన న్యాయం చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని