logo

అద్దె గదుల్లో.. బినామీల పాగా!

నగర, పురపాలికల వాణిజ్య సముదాయాలను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బినామీలకు అప్పగించేశారు.

Published : 07 Oct 2022 04:42 IST

అనంతపురం నగరపాలిక, న్యూస్‌టుడే: నగర, పురపాలికల వాణిజ్య సముదాయాలను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బినామీలకు అప్పగించేశారు. వేలం పాటలో తక్కువ అద్దెకు గదులను దక్కించుకుని, ఎక్కువ అద్దెకు ఇచ్చేసి లబ్ధి పొందుతున్నారు. దీనిపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. ఎవరికి అద్దెకు ఇచ్చాం.. అందులో ఎవరు వ్యాపారం చేస్తున్నారో ఆరా తీయడం లేదు. ఖాళీగా ఉన్న దుకాణాలకు సైతం సకాలంలో వేలంపాట నిర్వహించకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది.

పేరొకరిది..వ్యాపారం మరొకరిది
ధర్మవరం: ధర్మవరం పురపాలక సంఘం పరిధిలో 9 వాణిజ్య సముదాయాలు, 97 గదులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల రూ.7,44,020 అద్దె వస్తోంది. అయితే టెండరు ద్వారా గదులు దక్కించుకున్నవారు మరొకరికి అద్దెకు ఇచ్చారు. వాటిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. 20 ఏళ్లుగా అద్దె గదుల్లో పలువురు వ్యాపారులు మారారు. పెద్ద వ్యాపారులు, ప్రముఖుల చేతుల్లోనే ఎక్కువగా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.

లీజు హక్కును అవకాశంగా తీసుకుని..
ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, గుత్తి, రాయదుర్గం, తాడిపత్రి, మడకశిర, ధర్మవరం తదితర ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఒకసారి వేలం పాటలో దుకాణం పొందితే 25 ఏళ్లపాటు లీజుదారునికి హక్కు ఉంటోంది. నిబంధనల ప్రకారం గదిని అద్దెకు తీసుకున్న వ్యక్తి సొంతంగా దుకాణం నిర్వహించాలి. ఈ నిబంధన అమలు కావడం లేదు. సగం దుకాణాలు బినామీల చేతులోనే ఉన్నాయి. ఎక్కువ కాలం లీజు హక్కు ఉండటంతో దీన్ని అవకాశంగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు.

రెండుగా విభజించి..
కొందరు ఏకంగా గదులను రెండుగా విభజించి ఇద్దరికి అద్దెకు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. లీజు పొందిన వ్యక్తులు వాణిజ్య సముదాయాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. పలు పట్టణాల్లో అడ్డంగా గోడ కట్టేసి, రెండుగా విభజించినా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రతి మూడేళ్లకోసారి 33 శాతం అద్దె పెంచాలి. ఈ ప్రక్రియ కూడా సకాలంలో నిర్వహించడం లేదు.


షెడ్లను ఆక్రమించేశారు..

కూరగాయల మార్కెట్‌లోని మున్సిపాలిటీ షెడ్లు

గుంతకల్లు: గుంతకల్లులో 25 ఏళ్ల కిందట రూ.15 లక్షలు వెచ్చించి కూరగాయల మార్కెట్‌ యార్డులో 25 షెడ్లను నిర్మించారు. వాటిని వ్యాపారులకు అద్దెకు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఆక్రమించేశారు. ఇతరులకు అద్దెలకిచ్చి పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నారు. ఓ వ్యాపారికి ఏకంగా నాలుగు షెడ్లను స్వాధీనం చేసుకుని ఇతరులకు అద్దెకిచ్చారు. ఒక్కో షెడ్డు నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున గుడ్‌విల్‌తోపాటు ప్రతినెలా రూ.7 వేలకుపైగా అద్దె తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.21 లక్షలకుపైగా మున్సిపాలిటీకి గండి కొడుతున్నారు. ఈ తతంగం అధికారులు, నాయకుల కళ్లెదుటే జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్‌ రెవెన్యూ అధికారి నాసిర్‌ హుసేన్‌ మాట్లాడుతూ షెడ్ల నుంచి అద్దె వసూలుకు చర్యలు తీసుకుంటామని, మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు.


ఇతరుల చేతుల్లోనే..

ప్రారంభానికి నోచుకోని షాపింగ్‌ కాంప్లెక్స్‌

రాయదుర్గం పట్టణం: రాయదుర్గంలోని పురపాలక సంఘం పరిధిలో 74 గదులు ఉన్నాయి. వీటితోపాటు సీతమ్మ కుంటలో మరో 14 దుకాణాలను నిర్మించి అద్దెకిచ్చారు. గది వైశాల్యం బట్టి నెలకు అద్దె రూ.3 వేల నుంచి రూ.12,500 వరకు నిర్ణయించారు. మొత్తంగా 84 గదులకు కలిపి రూ.4.11 లక్షలు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. వేలంపాటలో దక్కించుకున్న వారు మాత్రం దీనికి రెండింతలు బాడుగ వసూలు చేసుకుంటున్నారు. 50 శాతానికి పైగా గదులు ఇతరుల చేతుల్లో ఉన్నాయి. కూరగాయల మార్కెట్‌ పరిధిలో బినామీలే నిర్వహిస్తున్నారు. రికార్డులు, అద్దె చెల్లింపు, విద్యుత్తు బిల్లు చెల్లింపు ఇతర లావాదేవీలన్నీ ఒకరి పేరుమీదనే ఉంటున్నాయి. మార్కెట్‌లో రెండో అంతస్తులో 50 గదులు నిర్మించినా వాటికి వేలం నిర్వహించలేదు.


ఆదాయంపై శ్రద్ధేదీ?

అనంతపురం పాతూరులోని వాణిజ్య సముదాయం

నగరపాలక పరిధిలో 410 గదులు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి రూ.3 కోట్లు సమకూరుతోంది. నగరపాలక కార్యాలయం ఎదురుగా వాణిజ్య సముదాయంలో 39 గదులు ఉండగా.. ప్రస్తుతం 25 గదుల నుంచే అద్దె వస్తోంది. పైభాగాన ఉన్న 14 షాపులు శిథిలావస్థకు చేరడంతో వాటిని ఖాళీ చేశారు. అద్దె చెల్లించడం లేదని మూడు దుకాణాలను సీజ్‌ చేశారు. మరో రెండు షాపుల నుంచి ఏళ్ల తరబడి అద్దె వసూలు చేయడం లేదన్న విమర్శ ఉంది. తాడిపత్రి బస్టాండు వద్ద 44 దుకాణాలు ఉన్నాయి. ఇందులో పైభాగాన 21 గదులు ఏడాదిగా ఖాళీగానే ఉన్నాయి. మార్కెట్‌ ఎదురుగా ఉన్న గదులు శిథిలావస్థకు చేరాయి. కొత్తూరు మార్కెట్‌ వద్ద మూడు షాపులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఓ షాపులో ప్రైవేటు వ్యక్తి అద్దె చెల్లించకుండా పూలవ్యాపారం చేస్తున్నా నగరపాలక ఆలస్యంగా మేల్కొని చర్యలకు ఉపక్రమించారు. జూనియర్‌ కళాశాల ఎదురుగా 42 దుకాణాల్లో నాలుగు ఖాళీగా ఉన్నాయి. నగరపాలక వాణిజ్య సముదాయాల్లో 50 శాతంపైగా బినామీలు తిష్ఠ వేశారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మించి, ఎప్పటికప్పుడు అద్దె వసూలు చేస్తే నగరపాలకకు ఏడాదికి మరో రూ.2 కోట్ల దాకా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- రమణారెడ్డి, నగరపాలక ఇన్‌ఛార్జి కమిషనరు

అద్దె చెల్లించని వారిపై కోర్టుకు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని దుకాణాలను సీజ్‌ చేశాం. లీజుకు తీసుకున్నవారే దుకాణం నిర్వహించాలి. లేదంటే చర్యలు తప్పవు. నగరపాలక ఆదాయం పెంపునకు చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని