logo

కొండల్ని తవ్వేసి.. మట్టి అమ్మేసి!

నార్పల మండలంలో మట్టి మాఫీయా చెలరేగిపోతోంది. కొండలు, గుట్టలు, చెరువులు, వంకలు దేన్నీ వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.

Published : 07 Oct 2022 04:42 IST

మూగేతిమ్మంపల్లి సమీపంలో కొండను తవ్వేశారిలా..

నార్పల గ్రామీణం, న్యూస్‌టుడే: నార్పల మండలంలో మట్టి మాఫీయా చెలరేగిపోతోంది. కొండలు, గుట్టలు, చెరువులు, వంకలు దేన్నీ వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సంపద కనుమరుగవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. నార్పల మండలంలోని నార్పల, బొందలవాడ, చామలూరు, గూగూడు తదితర వ్యవసాయ పొలాల్లో భారీగా వెంచర్లు వెలిశాయి. వాటిలో రహదారుల ఏర్పాటుకు, ఇతర పనులకు మట్టి అవసరం అవుతోంది. దీంతో కొందరు అక్రమార్కులు కొండలు, వంకలు, చెరువులను ఎంపిక చేసుకొని పొక్లెయిన్‌లతో తవ్వేస్తున్నారు. ఇప్పటికే రంగాపురం, మూగేతిమ్మంపల్లి, నరసాపురం, పులసనూతల, నడిమిదొడ్డి, గడ్డంనాగేపల్లి తదితర గ్రామాల సమీపంలోని కొండలను భారీగా తవ్వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. పచ్చని కొండలు రోజురోజుకు తరిగిపోతున్నా.. అధికారులు చూసుకుంటూ వెళ్తుతున్నారే తప్ప.. ఏ మాత్రం తనిఖీలు చేపట్టడం లేదు. బహిరంగంగా మట్టి దందా సాగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే హడావుడిగా తనిఖీలు చేసి వాహనాలను పట్టుకోవడం.. నాయకుల నుంచి ఫోన్లు రాగానే విడుదల చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది.

ఈ విషయమై తహసీల్దార్‌ నారాయణస్వామి వివరణ కోరగా మండలంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. నిఘా పెట్టి మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

రంగాపురం సమీపంలో భారీగా ఏర్పడిన గోతులు


అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే..

కొండపై లభ్యమయ్యే ఎర్రమట్టి నాణ్యమైనది. దీంతో అక్రమార్కుల కన్ను కొండలపై పడింది. యంత్రాలతో శరవేగంగా కావాల్సినంత మట్టిని తవ్వి ట్రాక్టర్లలో తరలించేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ దందా సాగిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక ట్రాక్టర్‌ మట్టిని రూ.800 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నారు. మండలంలోని అధికార పార్టీ చోటా నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన సహజ వనరులు కనుమరుగవుతుంటే భావితరాలకు ముప్పు వాటిల్లుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని