logo

బాలుడికి ప్రాణం పోశారు!

వెన్నెముక కండరాల క్షీణత  (స్పైనల్‌ మస్కులర్‌ డిస్‌ట్రోఫీ)తో బాధ పడుతున్న రెండేళ్ల బాలుడికి ఓ సంస్థ ప్రాణం పోసింది. అరుదైన జబ్బుకు గురైన చిన్నారి వైద్యానికి రూ.కోట్లలో ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Published : 07 Oct 2022 04:42 IST

తల్లి అరుణతో ధనుష్‌

అనంతపురం గ్రామీణం, అనంతపురం వైద్యం, న్యూస్‌టుడే: వెన్నెముక కండరాల క్షీణత  (స్పైనల్‌ మస్కులర్‌ డిస్‌ట్రోఫీ)తో బాధ పడుతున్న రెండేళ్ల బాలుడికి ఓ సంస్థ ప్రాణం పోసింది. అరుదైన జబ్బుకు గురైన చిన్నారి వైద్యానికి రూ.కోట్లలో ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వివరాలు.. అనంతపురం జిల్లా నార్పల మండలం మూగే తిమ్మంపల్లి గ్రామానికి చెందిన రాజు, అరుణ దంపతులు అనంతపురం గ్రామీణ మండలం ఎ.నారాయణపురం గ్రామానికి వలస వచ్చారు. రాజు జేసీబీ డ్రైవరుగా, అరుణ గ్రామ వాలంటీరుగా పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు భరత్‌ (5) రెండు నెలల కిందట కండరాల క్షీణత వ్యాధితో మృతి చెందాడు. చిన్న కుమారుడు ధనుష్‌ వయసు రెండేళ్లు. ఐదు నెలల వయసు ఉన్నప్పుడు ఇతను అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా వెన్నెముక కండరాల క్షీణత వ్యాధిగా వైద్యులు గుర్తించారు. రూ.కోట్లు విలువైన సూది మందు ఇస్తే తప్ప ఈ వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పారు. బాధిత తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని గుర్తించి ఆర్గనైజేషన్‌ ఫర్‌ రేర్‌ డిసీజెస్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ఉచితంగా సూది మందు ఇప్పిస్తోంది. లాటరీ పద్ధతిలో ఈ బాలుడికి గత ఏడాది నవంబరులో సూది మందు ఇచ్చారు. అప్పట్నుంచి కూర్చోవడం ప్రారంభించాడు. కోలుకోవడానికి  చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

నెలకు రూ.10 వేలు మందుల ఖర్చు

ధనుష్‌కు మందులు అందించడానికి నెలకు రూ.10 వేలు వరకు ఖర్చవుతోంది. ఆరోగ్యశ్రీ కింద దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. దాతల కోసం ఆ దంపతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రతినిధుల సాయం కోరినా ఎవరూ పెద్దగా కనికరించలేదని బాలుడి తండ్రి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రెండో కుమారుడికి జన్యుపరమైన పరీక్ష చేయించామని, ఎలాంటి ఢోకా లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని