logo

క్రైమ్‌ వార్తలు

అప్పులబాధతో రైతు బలవన్మరణానికి పాల్పడిన విషాదఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల వివరాల మేరకు.. భట్టువానిపల్లికి చెందిన వెంకటేశులు(68)కు 20 ఎకరాల పొలం ఉంది. టమోటా, మొక్కజొన్న, కర్బూజ సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా పంటలు పండక నష్టాలు మిగిలాయి.

Updated : 07 Oct 2022 05:12 IST

చరవాణి కోసం అక్కాచెల్లెళ్ల గొడవ

మనస్తాపానికి గురై అక్క ఆత్మహత్య

అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: చరవాణి కోసం అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. అక్క ప్రాణాన్ని బలితీసుకుంది. అనంతపురం గ్రామీణ పోలీసుల వివరాల మేరకు.. విడపనకల్లు మండలం పొలికి గ్రామానికి చెందిన తిప్పారెడ్డి కుటుంబం కొన్నేళ్ల కిందట అనంతపురం నగరానికి ఉపాధి నిమిత్తం వచ్చారు. ఈయనకు జ్యోతి (27), అనంతలక్ష్మి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జ్యోతి బీటెక్‌ పూర్తి చేసి పెనుకొండ వద్ద ఉన్న కియా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో ఉన్న ఒక చరవాణి కోసం అక్కాచెల్లెలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వారు ఘర్షణ పడ్డారు. తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతి కిరాణా దుకాణానికి వెళ్లి కేశ అలంకరణకు ఉపయోగించే ద్రావణాన్ని తెచ్చుకుంది. ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఆ ద్రావణాన్ని తాగి పడుకుంది. అర్ధరాత్రి దాటాక వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆరా తీశారు. ద్రావణం తాగినట్లు చెప్పడంతో వారు హుటాహుటిన ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందింది. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


యువకుడు వేధిస్తున్నాడని  బాలిక బలవన్మరణం

తనకల్లు, న్యూస్‌టుడే: తనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (18) బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాంభూపాల్‌, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు... సామాజిక మధ్యమంలో పరిచయమైన నల్లచెరువుకు చెందిన రాళ్లపల్లి ఇంతియాజ్‌ ప్రేమ పేరుతో పరిచయమయ్యాడని, తనతో చనువుగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తానని బెదిరిస్తున్నాడని, అందువల్ల తను ఉరి వేసుకుంటున్నానంటూ సదరు బాలిక సెల్ఫీ వీడియో తీసుకుంది. తన చావుకు ఇంతియాజ్‌ కారణమని చెబుతూ.. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని వీడియోలో పేర్కొంది. ఈ వీడియో అంతర్జాలంలో వైరలైంది. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఫేస్‌బుక్‌లో యువకుడి వేధింపుల వల్లే తన కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బాలిక ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతుండగా ఇంతియాజ్‌ నల్లచెరువు మండల తెలుగుయువత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె ఆత్మహత్యకు పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులు బోరున విలపించారు.

అప్పుల బాధతో అన్నదాత..

భట్టువానిపల్లి(కళ్యాణదుర్గం గ్రామీణం), న్యూస్‌టుడే: అప్పులబాధతో రైతు బలవన్మరణానికి పాల్పడిన విషాదఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల వివరాల మేరకు.. భట్టువానిపల్లికి చెందిన వెంకటేశులు(68)కు 20 ఎకరాల పొలం ఉంది. టమోటా, మొక్కజొన్న, కర్బూజ సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా పంటలు పండక నష్టాలు మిగిలాయి. ప్రైవేటుగా, బ్యాంకుల్లోనూ సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. మనోవేదనకు గురై గతనెల 30న పొలంలో పురుగుమందు తాగారు. చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబపెద్ద మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్యాణదుర్గం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


మానసిక స్థితి బాగాలేదని యువకుడు..

అప్పస్వామి (పాతచిత్రం)

బత్తలపల్లి, న్యూస్‌టుడే: మానసికస్థితి బాగులేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన అప్పస్వామి (32) గురువారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. తన మానసిక పరిస్థితి సక్రమంగా లేదని, అందుకే చనిపోవాలని ఉందని కొద్దిరోజుల కిందట అప్పస్వామి భార్య రమాదేవితో చెప్పాడు. తల్లిదండ్రులు నచ్చజెప్పి, రెండ్రోజుల్లో డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రమాదేవి ప్రసుత్తం మూడు నెలల గర్భిణి. భర్త దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.


కారు బోల్తా.. ఏడుగురికి గాయాలు

పాతకొత్త చెరువు వద్ద బోల్తా పడి డివైడర్‌ పైకి ఎక్కిన కారు

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఏడుగురికి గాయాలైన ఘటన గురువారం గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామం వద్ద చోటుచేసుకుంది. కర్నూలు పట్టణానికి చెందిన రాంరెడ్డి తన కుటుంబ సభ్యులతో రెండు వాహనాల్లో గుంతకల్లు పట్టణంలోని పాడురంగస్వామిని, అనంతరం కసాపురంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని తిరిగి ప్రయాణంలో ఉండగా.. పాతకొత్తచెరువు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాంరెడ్డి, కావ్య, మౌనిక, భావన, మహీధర్‌రెడ్డి, మాజిస్‌ రెడ్డి, సుజల సాయి రెడ్డి గాయపడ్డారు. మరో కారులో ఉన్న బంధువులు, స్థానికుల సాయంతో 108 ద్వారా గుంతకల్లు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యుల సూచనలు మేరకు కర్నూలుకు తరలించారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పండగకు వచ్చి.. ప్రాణాలు వదిలి..

రొద్దం, శెట్టూరు, న్యూస్‌టుడే: మండలంలోని చెరుకూరు బీసీకాలనీ సమీపంలో మడకశిర-పెనుకొండ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. సంఘటనా స్థలంలోనే ఇంజినీరింగ్‌ విద్యార్థి హర్షవర్దన్‌రెడ్డి (22) మృతి చెందగా, అతని స్నేహితుడు మరో విద్యార్థి రవికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... శెట్టూరు మండలం బొచ్చుపల్లికి చెందిన అశ్వర్థరెడ్డి, గిరిజమ్మల ప్రథమ  కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి, హిందూపురానికి చెందిన రవి కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం ఆర్‌ఎస్‌ జాలప్ప ఇంజినీరింగ్‌ కళాశాలలో నాల్గో సంవత్సరం చదువుతున్నారు. దసరా పండగకు బొచ్చుపల్లికి ఇద్దరూ వచ్చారు. పండగ ముగించుకొని గురువారం సాయంత్రం అక్కడ నుంచి కళాశాలకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో చెరుకూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. రొద్దం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ద్విచక్ర వాహనం ఢీకొని ఎంఈవోకు తీవ్రగాయాలు  

గాయపడిన గంగప్ప

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: హిందూపురం మండల విద్యాధికారి గంగప్పకు గురువారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. విధి నిర్వహణలో భాగంగా ఇంటి నుంచి కార్యాలయానికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, మున్సిపల్‌ కార్యాలయ సమీపంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఆయన్ని ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌ సకాలంలో చేరుకోలేదు. అక్కడికి వెళ్లిన మున్సిపల్‌ ఉద్యోగి ఆనందరాజు చొరవ తీసుకొని ఆటో మాట్లాడి ఎంఈవోను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్సకు బెంగళూరు తరలించారు. ఇటీవల కాలంలో నాడు-నేడు పనుల కారణంగా విపరీతమయిన పని భారంతో సతమతమవుతున్నారని, సెలవులు ఉన్నా, కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని గంగప్ప భార్య వాపోయారు. వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ ఆదినారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని