logo

పురుగుల చిక్కీ.. బూజుపట్టిన కర్జూరం: పాత నిల్వలకు కొత్త లేబుళ్లు

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో గర్భిణులు, బాలింతలకు అందించే అదనపు పౌష్టికాహారాన్ని అక్రమార్కులు వదలడం లేదు.

Updated : 24 Nov 2022 07:42 IST

ఐసీడీఎస్‌లో నయా మోసం

న్యూస్‌టుడే: అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌)

కిట్‌లోని రకాలు

జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో గర్భిణులు, బాలింతలకు అందించే అదనపు పౌష్టికాహారాన్ని అక్రమార్కులు వదలడం లేదు. సంపూర్ణ పోషణ పథకం కింద పంపిణీ చేస్తున్న ‘వైఎస్‌ఆర్‌ కిట్ల’ రూపంలో ప్రతి నెలా రూ.లక్షలు దోపిడీ చేస్తున్నారు. కొందరు సీడీపీఓలు, పర్యవేక్షకులు గుత్తేదారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారు. పాత సరకు (నిల్వలు)కు కొత్త లేబుళ్లు (స్టికర్లు) వేసి నయా దందాకు తెర లేపారు. తాజాగా అనంత నగరం రాణినగర్‌లో ఓ అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన వేరుసెనగ చిక్కీలో పురుగులు బయటపడ్డాయి. మరోచోట ముద్దలా మారిన అటుకుల ప్యాకెట్‌ బయటకు తీశారు. రాగిపిండిలో ఇసుక, బూజుపట్టిన ఖర్జూరం.. వంటివి వైఎస్‌ఆర్‌ కిట్‌లో వెలుగు చూశాయి. ఉమ్మడి జిల్లాలో నాణ్యతలేని సరకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలకు దారి తీస్తోంది.

ఏమేమి ఇవ్వాలంటే..

కిట్‌లో ఆరు రకాల సరకులు ఉంటాయి. రాగిపిండి, జొన్నపిండి, అటుకులు కిలో చొప్పున, బెల్లం, చిక్కీ, ఖర్జూరం 250 గ్రాముల ప్రకారం ఇస్తున్నారు. రావులపాలెం, విశాఖ, నెల్లూరుకు చెందిన గుత్తేదారులు టెండర్లు దక్కించుకున్నారు.

బూజుపట్టిన కర్జూరం

తయారీ తేదీపై సందేహాలు

మొదట్నుంచి కిట్ల తయారీ, ఎమ్మార్పీ, గడువు వంటి వివరాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత నిల్వలకే కొత్త ప్యాకెట్లను తయారు చేసి.. ఎమ్మార్పీ వివరాలను కూడా కొత్తగా ముద్రిస్తున్నట్లు సమాచారం. అనంత నగరంలో ఈ తరహాలో 136 ప్యాకెట్లు బయటకు పడినట్లు తెలిసింది. సదరు గుత్తేదారుడికి షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు. అయినా మార్పు రాలేదు. నాణ్యత, తూకాలపై నిరంతరం ఆహార కల్తీ నిరోధక శాఖ, తూనిక, కొలతల శాఖ పరిశీలన చేయాలి. అవసరమైతే ల్యాబొరేటరీలకు పంపాలి. ఏడాది కాలంలో ఒక్క రోజు కూడా తనిఖీలు జరిగిన దాఖలాలు లేవు. పేదలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 ప్రాజెక్టుల పరిధిలో 5,126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు 27,778 మంది, బాలింతలు 25,504 మంది చొప్పున మొత్తం 53,282 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ వైఎస్‌ఆర్‌ కిట్లు ఇస్తున్నట్లు ‘లెక్క’ రాస్తున్నారు. ఒక్కో కిట్‌లో ఆరు రకాల సరకులు ఉంటాయి. ఒక్కో కిట్‌ ధర రూ.222. ఈ లెక్కన నెలకు రూ.1,18,28,604 ఖర్చు చేస్తున్నట్టే. 2021 సెప్టెంబరు నుంచి నలుగురు గుత్తేదారులు ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు.


నాణ్యమైనవే సరఫరా చేస్తాం

కొన్ని ప్రాంతాల్లో నాసిరకం సరకులు ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో గుత్తేదారులకు నోటీసులు జారీ చేశాం. తాజాగా నాసిరకం సరకులు ఇచ్చినట్లు తేలితే బిల్లుల్లో కోత పెడతాం. ఇప్పటికే చాలాసార్లు గుత్తేదారులను హెచ్చరించాం. పాత నిల్వలపై కొత్త లేబుళ్లు వేస్తున్నారన్న దానిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విచారణ చేయిస్తున్నాం.

- బి.ఎన్‌.శ్రీదేవి, పీడీ, ఐసీడీఎస్‌


ఉమ్మడి జిల్లా లెక్క

అంగన్‌వాడీలు: 5,126
గర్భిణులు: 27,778
బాలింతలు: 25,504
వైఎస్‌ఆర్‌ కిట్‌ ధర: రూ.222
నెలకు రూ.1.18 కోట్లు ఖర్చు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని