logo

పట్టుకున్నారు.. వదిలేశారు

బొమ్మనహాళ్‌ మండలం కల్లుదేవనహళ్లి నుంచి రాయదుర్గం ఆర్టీసీ డిపోకు 15 వేల లీటర్ల డీజిల్‌ తీసుకొస్తుండగా వెంబడించి పట్టుకున్న ట్యాంకరును వదిలేశారు.

Published : 25 Nov 2022 03:33 IST

డీజిల్‌ తరలింపుపై అనుమానాలు

ఆర్టీసీ డిపోలో ఆపిన డీజిల్‌ ట్యాంకర్‌

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: బొమ్మనహాళ్‌ మండలం కల్లుదేవనహళ్లి నుంచి రాయదుర్గం ఆర్టీసీ డిపోకు 15 వేల లీటర్ల డీజిల్‌ తీసుకొస్తుండగా వెంబడించి పట్టుకున్న ట్యాంకరును వదిలేశారు. పలు రికార్డులు పరిశీలించాక, బిల్లులు సరిపోయాయని చెబుతున్న సేల్స్‌ట్యాక్స్‌ అధికారుల మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడంలేదు. ఆంధ్రలో కన్నా కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్‌ లభిస్తుండటంతో అక్కడి నుంచే తీసుకొస్తున్నారనే అనుమానంతో సేల్స్‌ట్యాక్స్‌ అధికారులు బుధవారం రాత్రి ట్యాంకర్‌ను పట్టుకున్నారు. బిల్లులు లేకుండా అన్‌లోడ్‌ చేయరాదని ఆపేశారు. గురువారం ఉదయం బిల్లులు చూపించడంతో వదిలేశామని సేల్‌ ట్యాక్స్‌ అధికారి సుదర్శన్‌ తెలిపారు.

మార్గం లేకపోయినా...

మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలకు బొమ్మనహాళ్‌ మండలంలోని కల్లుదేవనహళ్లి, బండూరు మీదుగా కల్లుదేవనహళ్లి, దర్గా హొన్నూరు, తారకాపురం, గోవిందవాడ, కళ్లుహొళ, బొల్లనగుడ్డం మీదుగా ఉరవకొండకు వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. కల్లుదేవనహళ్లి నుంచి రాయదుర్గానికి రావాలంటే తప్పకుండా బళ్లారి మీదుగా లేదంటే బెళుగుప్ప మీదుగా రావాల్సిందే. అధికారులు మాత్రం నెలరోజులుగా కల్ల్లుదేవనహళ్లిక్రాస్‌ నుంచి దేవగిరిక్రాస్‌, కణేకల్లుక్రాస్‌ మీదుగా రాయదుర్గం ఆర్టీసీ డిపోకు డీజిల్‌ తరలిస్తున్నట్లు డిపో మేనేజర్‌ చెబుతున్నారు. హగరి మీదుగా ఏర్పాటు చేసిన వంతెన ధ్వంసం కావడంతో రాకపోకలు కొనసాగకపోయినా ఇదే మార్గంలో డీజిల్‌ తరలిస్తున్నామని అధికారులు చెప్పడం గమనార్హం.

తక్కువ ధరకు ఇస్తున్నారని..

రాయదుర్గం డిపోలో రోజుకు 4500 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుండటంతో తక్కువ ధరకు ఎవరైతే పంపిణీ చేస్తామని కోట్‌ చేస్తారో వారి నుంచి కొనుగోలు చేస్తున్నామని డీఎం సురేష్‌బాబు తెలిపారు.లీటరు రూ.97.40కు సరఫరా చేస్తుండటంతో కల్లుదేవనహళ్లి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు, యజమానులే తమకు సరఫరా చేస్తారని ఆయన తెలిపారు.

దందాతో అక్రమార్జన..!

అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కర్ణాటకలో కొనుగోలు చేసిన డీజిల్‌ను ఆంధ్రాలో ఆర్టీసీ డిపోకు అమ్ముతూ నెలకు రూ.లక్షలు ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న డీజిల్‌ బంకులు, కర్ణాటకలో ఉన్న డీజిల్‌ బంకుల యజమానులు సిండికేట్‌గా మారి ఆర్టీసీకి డీజిల్‌ సరఫరా చేసేందుకు అందరినీ ఒప్పించినట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts