logo

భూ పత్రాలు.. తప్పుల తిప్పలు!

భూ రీసర్వేలోనే కాదు.. యజమానుల హక్కు పత్రాల ముద్రణలోనూ తప్పులు తెరపైకి వస్తున్నాయి. రెండేళ్ల కిందట రీసర్వేకు శ్రీకారం చుట్టారు. తాజాగా హక్కు పత్రాల పంపిణీ చేపట్టారు.

Published : 26 Nov 2022 04:37 IST

న్యూస్‌టుడే: జిల్లా సచివాలయం, కళ్యాణదుర్గం గ్రామీణం, పెద్దవడుగూరు

 

బోయంపల్లిలో పత్రాలు అందుకున్న రైతులతో మంత్రి ఉష

భూ రీసర్వేలోనే కాదు.. యజమానుల హక్కు పత్రాల ముద్రణలోనూ తప్పులు తెరపైకి వస్తున్నాయి. రెండేళ్ల కిందట రీసర్వేకు శ్రీకారం చుట్టారు. తాజాగా హక్కు పత్రాల పంపిణీ చేపట్టారు. రైతు పేరు, ఇంటి పేరు, లింగం, సర్వే నంబరు, ఆధార్‌, ఫోన్‌, విస్తీర్ణం.. ఇలా ప్రతి దాంట్లోనూ తప్పులు ఉన్నాయి. చాలామందికి వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ ముద్రించారు. వీటిపై రైతులు రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వడం లేదు. వివరాలన్నీ పక్కాగా ఉన్నవే అందజేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. శుక్రవారం తాడిపత్రి, రాప్తాడు, అనంత, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో భూహక్కు పత్రాల పంపిణీ ప్రారంభించారు.

భూమి తక్కువగా ఉంది

నాకు 47-1ఏ4లో 2.84 ఎకరాల భూమి ఉంది. హక్కు పత్రంలో 2.56 ఎకరాలే ముద్రించారు. మిగిలిన 28 సెంట్ల భూమి ఏమైందో తెలియడం లేదు. తాము నష్టపోవాల్సి వస్తుంది. మిగిలిన భూమి జత చేస్తారో లేదో? నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
రుద్రమ్మ, రైతు, బోయలపల్లి

అరకొరగా పంపిణీ

ఉమ్మడి జిల్లాలో 37,715 పత్రాలు అందజేయాల్సి ఉంది. ఒక్క అనంత జిల్లాలోనే ఇప్పటిదాకా 6,726 పత్రాల్లో తప్పులు సరిదిద్దినట్లు జేసీ కేతన్‌గార్గ్‌ తెలియజేశారు. దీనికి రెట్టింపు స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. తప్పులు ఉండటంతోనే పూర్తి స్థాయిలో పత్రాలు రైతులకు అందజేయలేదు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో 705 మందికి గాను 254 పత్రాలే వచ్చినట్లు తెలుస్తోంది. అందులోనూ పది మందికే ఇచ్చారు. పెద్దవడుగూరు మండలం విరుపాపురం, మల్లేనిపల్లి, వెంకటాంపల్లి, అవులాంపల్లిలో 35 మందికే పత్రాలు ఇచ్చారు.

తొలివిడత 64 గ్రామాలు

ఉమ్మడి జిల్లాలో 2020 నవంబరులో భూ రీసర్వే మొదలైంది. అనంత జిల్లాలో 31 మండలాల్లో 504 గ్రామాలు ఉండగా.. తొలి విడత 13 మండలాల్లోని 41 గ్రామాల్లో 1,15,744 ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే ముగించారు. మొత్తం 27,528 హక్కు పత్రాలు రైతులకు అందజేయాల్సి ఉంది. శ్రీసత్యసాయి జిల్లాలో 32 మండలాల్లో 461 గ్రామాలు ఉండగా.. ఇప్పటికి 14 మండలాల పరిధిలోని 23 గ్రామాల్లో 27,202 ఎకరాల విస్తీర్ణంలో సర్వే పూర్తి చేశారు. 10,187 పత్రాలు సిద్ధం చేయాల్సి ఉంది.

తొలివిడత 64 గ్రామాలు

రీసర్వేపై అసంతృప్తి

రెండేళ్లుగా సాగుతున్న భూ రీసర్వేపై క్షేత్రస్థాయిలో రైతుల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సర్వే-సరిహద్దుల చట్టం-1923 ప్రకారం సెక్షన్‌ 9(1), 9(2) ప్రకారం సర్వేలో సంబంధిత రైతులను పూర్తిగా భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు ఇవ్వాలి. పలు గ్రామాల్లో రైతులు, స్థానికులకు తెలియకుండానే రీసర్వే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వివరాల్లో తప్పులు దొర్లినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని