logo

‘కల్తీ డీజిల్‌తో వైకాపా నాయకుల అక్రమార్జన’

కరాట్ణక నుంచి భారీ ఎత్తున కల్తీ డీజిల్‌ను ఆర్టీసీ డిపోకు సరఫరా చేస్తూ వైకాపా నాయకులు కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

Published : 26 Nov 2022 04:37 IST

వివరాలు పరిశీలిస్తున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: కరాట్ణక నుంచి భారీ ఎత్తున కల్తీ డీజిల్‌ను ఆర్టీసీ డిపోకు సరఫరా చేస్తూ వైకాపా నాయకులు కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం బొమ్మనహాళ్‌ మండలం కల్లుదేవనహళ్లి పరిధిలోని డీజిల్‌ బంక్‌ను పరిశీలించారు. అక్కడికి ఎంత డీజిల్‌ వస్తుంది, ఎక్కడెక్కడికి సరఫరా చేశారనే విషయాన్ని సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి రికార్డులు పరిశీలిస్తే రాయదుర్గం ఆర్టీసీ డిపోకు సరఫరా చేసినట్లు ఎక్కడా కనిపించడంలేదన్నారు. కొందరు అధికారులు సహాయ సహకారాలతో సరిహద్దులోని పెట్రోల్‌బంకుల పేరుతో నకలీపత్రాలు సృష్టించి ఆర్టీసీ డిపోలకు కల్తీ డీజిల్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విప్‌ కాపురామచంద్రారెడ్డి వద్ద పనిచేసే గుంతకల్లుకు చెందిన ఓ వ్యకికి వాహనం ఇచ్చి డీజిల్‌ దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. కర్ణాటక నుంచి తెచ్చే డీజిల్‌లో బయోడీజిల్‌ కలిపి భారీగా మిగుల్చుకుంటున్నారన్నారు. అధికారులు ఎందుకు తనిఖీలు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి రాయదుర్గం వెళ్లడానికి రోడ్డుమార్గం కూడా నాలుగు నెలలుగా లేదని చెప్పారు. కల్లుదేవనహళ్లిలో ఉన్నది హెచ్‌పీసీఎల్‌ బంకు కాగా రాయదుర్గం ఆర్టీసీ డిపోలో ఐఓసీఎల్‌ స్టాక్‌పాయింట్‌ ఉందన్నారు. ఒక కంపెనీకి చెందిన డీజిల్‌ను మరో కంపెనీ స్టాక్‌పాయింట్‌లోకి ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న దొంగలు ఎవరో తేల్చాలని డిమాండు చేశారు. ఆయన వెంట మండల పార్టీ కన్వీనర్‌ బలరామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, నాయకులు కొత్తపల్లి మల్లికార్జున, వెంకటేశులు, తిమ్మరాజు, నాగరాజు, మహేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని