logo

కాసులిస్తేనే క్షేత్రానికి !

రెవెన్యూ శాఖలో పలువురు సర్వేయర్ల అవినీతి తారాస్థాయికి చేరింది. కాసులిస్తేనే క్షేత్రస్థాయికి వస్తున్నారు. లేదంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే.

Updated : 26 Nov 2022 05:10 IST

తారాస్థాయికి సర్వేయర్ల అవినీతి

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, పుట్టపర్తి, హిందూపురం అర్బన్‌: రెవెన్యూ శాఖలో పలువురు సర్వేయర్ల అవినీతి తారాస్థాయికి చేరింది. కాసులిస్తేనే క్షేత్రస్థాయికి వస్తున్నారు. లేదంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. నిబంధనల మేరకు చలానా కట్టినా సర్వేయర్లకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోంది. యంత్రాలతో సర్వే చేయాలంటే ఎకరాకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇస్తే భూవివాదాలకు సంబంధించి అనుకూలంగా నివేదికలు ఇచ్చేస్తున్నారు. కొంతమంది సర్వేయర్లు స్థానిక నాయకుల ఆదేశాల మేరకు నివేదికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో గొడవలు, ఘర్షణలకు దారి తీస్తున్నాయి.

ప్రతి గ్రామంలో సర్వేయర్లు ఉన్నా..

ఉమ్మడి జిల్లాలో మండల సర్వేయర్ల కొంత వేధిస్తోంది. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి సర్వేయర్‌ ఉన్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే ఏ చిన్న సర్వే చేయాలన్నా మండల సర్వేయర్‌ ఉండాల్సిందే. కొన్నిచోట్ల గ్రామ సర్వేయర్లు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు నేరుగా మండల సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని పెద్దఎత్తున లంచాలు డిమాండు చేస్తున్నారు.

నిబంధనలు గాలికి..

భూ సర్వేకు రైతు తొలుత గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో సర్వేకు రూ.550 చొప్పున రుసుం చెల్లించాలి. దరఖాస్తుతోపాటు రశీదును రెవెన్యూ అధికారులకు అందిస్తే, మండల లేదా గ్రామ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడి అనుభవంలో ఎంత మేర విస్తీర్ణం ఉందో స్కెచ్‌ను అందించాల్సి ఉంటుంది. చలానా కట్టిన 30 రోజుల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. చుట్టుపక్కల రైతులకు సర్వే తేదీ తెలుపుతూ నోటీసులు జారీ చేస్తారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారికి అప్పీల్‌కు వస్తే గరిష్ఠంగా 60 రోజుల్లో ప్రక్రియ నిర్వహించాలి. ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రాజకీయ నాయకుల అండతో దందా సాగిస్తున్నారు.

ఉరవకొండ నియోజకవర్గంలోని ఓ మండల సర్వేయర్‌ కాసులిస్తేనే క్షేత్రస్థాయికి వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనంత నగరానికి ఆనుకుని ఉన్న మండలంలో పెద్దఎత్తున ప్రైవేటు లేఅవుట్లు వెలిశాయి. దరఖాస్తుదారులతో ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సామాన్య రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సాగు భూముల్ని కొలవడానికి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు డిమాండు చేసినట్లు తెలుస్తోంది.
అనంతపురం పరిధిలో ఓ సర్వేయర్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ అండతో కొన్నేళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారు. సర్వే చేయడానికి సెంటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులతో డబ్బులు తీసుకుని తప్పుడు నివేదికలు ఇవ్వడంతో వివాదాలు నెలకొంటున్నాయి. రుద్రంపేట పంచాయతీ పరిధిలో నడిమి వంకకు సంబంధించి భారీగా ముడుపులు తీసుకుని తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

పుట్టపర్తి సమీపంలో ఇద్దరు సాయి భక్తులు భూమి కొనుగోలు చేశారు. సర్వేకు దరఖాస్తు చేయగా.. హద్దులు ఏర్పాటు చేసి, సబ్‌ డివిజన్‌ చేసేందుకు రూ.7 వేలు సిబ్బంది వసూలు చేశారు. ప్రశాంతి నిలయం పడమర రహదారిలో 30 సెంట్ల భూమి సర్వేకు ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా.. రూ.5 వేలు డిమాండు చేశారు.

హిందూపురం సమీపంలో స్థిరాస్తి వ్యాపారి లేఅవుట్లు వేసేందుకు రైతు నుంచి భూమి కొనుగోలు చేశారు. సర్వే చేసేందుకు దరఖాస్తు చేసి, కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినా స్పందించలేదు. గత్యంతరం లేక రూ.15 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చింది.
బత్తలపల్లి మండలం ఘంటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు  భూమి సర్వే చేసేందుకు మూడు నెలల కిందట దరఖాస్తు చేశారు. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా స్పందించలేదు.

ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు

నిర్ణీత గడువులోపు సర్వే చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా రైతుల మధ్య వివాదం ఉంటే జాప్యం జరుగుతోంది. సర్వే చేయకుండా నిర్లక్ష్యం చేస్తే స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం. సర్వే సమయంలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
  - ఏడీ రామకృష్ణ

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని