logo

కల్తీ కల్లు ఆరోగ్యానికి చిల్లు!

అది కల్తీ కల్లు అని తెలుసు.. తాగిన వారి ప్రాణాలు హరిస్తుందని తెలుసు.. అయినా అధికారపార్టీ అండతో.. అధికారుల నీడలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

Published : 30 Nov 2022 05:52 IST

హానికర రసాయనాలతో తయారీ
జోరుగా విక్రయాలు

హిందూపురం మండల పరిధిలో నిర్వహిస్తున్న దుకాణం


హిందూపురం ప్రాంతంలో ఓ సొసైటీ యజమానికి 13 దుకాణాలు ఉన్నాయి. రోజుకు 5 వేల నుంచి 6 వేల లీటర్ల కల్లు విక్రయిస్తారు. ఇందులో 80 శాతం కల్తీయే. ఈయన ఎక్సైజ్‌ అధికారులకు ప్రతి నెలా రూ.2 లక్షలు మామూళ్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజకీయ పలుకుబడితో అధికారులు ఆయన జోలికి వెళ్లడం లేదు


హిందూపురంలో పనిచేస్తున్న ఓ అధికారి ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌ శాఖలో రింగు మాస్టర్‌ అనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు కానిస్టేబుళ్లతో ఒక్కో కల్లు దుకాణం నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో పొరుగు జిల్లాల్లోనూ ఈయన హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.


ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, అనంత నేరవార్తలు, హిందూపురం పట్టణం, పుట్టపర్తి గ్రామీణం: అది కల్తీ కల్లు అని తెలుసు.. తాగిన వారి ప్రాణాలు హరిస్తుందని తెలుసు.. అయినా అధికారపార్టీ అండతో.. అధికారుల నీడలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వ్యసనానికి అలవాటు పడిన ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. కాలకూట విషాన్ని పేదల శరీరాల్లోకి నింపి డబ్బులు దండుకుంటున్నారు. చాలామంది మత్తు పదార్థాలు కలిపిన కల్లు తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొందరు మానసికస్థితి కోల్పోతున్నారు. మరణాలు సంభవిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నా ఎక్సైజ్‌శాఖ పట్టించుకోవడం లేదు. నియంత్రించాల్సిన అధికారుల్లో కొందరు మామూళ్ల మత్తులో ముగిని తేలుతున్నారు.

నమూనాల సేకరణ ఏదీ?

నిబంధనల ప్రకారం ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కల్లు దుకాణాలు తనిఖీ చేయాలి. నమూనాలను ప్రాథమికంగా పరీక్షించడానికి అధికారుల వద్ద మినీ కిట్లు ఉంటాయి. ఎక్కడా నమూనాల ఫలితాలను బయటకు వెల్లడించడం లేదు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి పరీక్షలు చేస్తున్నారు. కల్తీ తేలిన దుకాణాలకు కొంత జరిమానా విధించి చేతులు దులుపుకొంటున్నారు.

తీవ్ర దుష్ప్రభావం

డైజోఫాం, క్లోరోహైడ్రెట్‌ కారణంగా నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. ఆలోచనశక్తి తగ్గి మతిమరుపు వస్తుంది. కాలేయంపై ప్రభావం చూపుతుంది. విచక్షణ కోల్పోతారు. ప్రభుత్వం కల్తీ కల్లును నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి. సాధారణ కల్లులోనూ శుభ్రత ఉండటం లేదు. చెట్లలోని కొన్ని పురుగుల ద్వారా కల్లులో హానికర బ్యాక్టీరియా చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

ఎండ్లూరి ప్రభాకర్‌, మానసిక వైద్య నిపుణులు

అనుమతికి మించి

అనంతపురం జిల్లాలో 258 కల్లు దుకాణాలు (టీఎఫ్‌టీలు), శ్రీసత్యసాయి జిల్లాలో 79 టీఎఫ్‌టీ (ట్రీ ఫర్‌ ట్యాపర్‌), 159 టీసీఎస్‌ (టాడీ కోఆపరేటివ్‌ సొసైటీ) ఉన్నాయి. హిందూపురం, మడకశిర, పరిగి ప్రాంతాల్లో అనుమతిలేని కల్లు దుకాణాలు వందల్లో వెలిశాయి. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 496 దుకాణాలు ఉండగా.. అనధికారికంగా మరో వెయ్యి నడుపుతున్నారు. ఎక్సైజ్‌ రికార్డులో మూసివేసినట్లుగా ఉన్న దుకాణాల్లోనూ జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. ఎక్సైజ్‌ నిబంధనల ప్రకారం ఏయే దుకాణం పరిధిలో ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి? వాటి నుంచి రోజుకు ఎంత కల్లు ఉత్పత్తి అవుతోంది? అనే వివరాలు పక్కాగా ఉండాలి. ఈత చెట్లకు నంబర్లు కేటాయించాలి. ఎక్సైజ్‌ అధికారులు కొన్నేళ్ల కిందటి లెక్కల్ని నివేదికలో చూపుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి సరఫరా

డైజోఫాం, క్లోరోహైడ్రెట్‌ వంటి హానికర పదార్థాలను హైదరాబాద్‌ నుంచి తెప్పిస్తున్నట్లు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా గుంతకల్లు, గుత్తి ప్రాంతాలకు తీసుకొచ్చి అక్కడ్నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. క్లోరోహైడ్రెట్‌ కిలో రూ.25 వేలు, డైజోఫాం కిలో రూ.80 వేలు చొప్పున విక్రయిస్తున్నారని, వీటి సరఫరాకు గుంతకల్లు కేంద్రంగా ప్రత్యేక ముఠా ఉన్నట్లు సమాచారం. ఇటీవల జిల్లాలో ఆల్ఫ్రోజోలం అనే అత్యంత హానికరమైన మత్తు మందును వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కల్తీ ఇలా..

10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు కలుపుతారు. హిందూపురం, మడకశిర, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో డిమాండుకు సరిపడా ఈత చెట్లు లేవు. 5 శాతం మేర మాత్రమే స్వచ్ఛమైన కల్లు విక్రయిస్తున్నారు. మిగిలిన 95 శాతం కల్తీనే. వ్యవసాయ తోటల్లో ఎక్కడికక్కడ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని డైజోఫాం, క్లోరో హైడ్రెట్‌ వంటి నిషేధిత పదార్థాలను కలుపుతున్నట్లు సమాచారం. మొత్తం మిశ్రమాన్ని నీటి తొట్టెలో కలియ తిప్పుతారు. తీపి కోసం శాక్రిన్‌, నురగ కోసం అమ్మోనియం వంటి రసాయనాలను వాడుతున్నారు. ఉదయం పూట తయారు చేసిన మిశ్రమానికి ఈస్ట్‌ కలిపి సాయంత్రం వరకు పులియబెడతారు. తర్వాత సీసాల్లో నింపి దుకాణాలకు చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని