logo

ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాల్సిందే..

‘జాకీ’ దుస్తుల పరిశ్రమ వెనక్కి వెళ్లడానికి కారణమైన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై సుమోటో కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని సీపీఐ జిల్లా సమితి డిమాండు చేసింది.

Published : 30 Nov 2022 05:52 IST

డీఐజీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకుల ఫిర్యాదు

వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ, తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘జాకీ’ దుస్తుల పరిశ్రమ వెనక్కి వెళ్లడానికి కారణమైన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై సుమోటో కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని సీపీఐ జిల్లా సమితి డిమాండు చేసింది. మంగళవారం సీపీఐతో పాటు తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు డీఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఐజీ అందుబాటులో లేకపోవడంతో క్యాంపు ఆఫీసులోని ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఖాదర్‌బాషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జాఫర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 2017లో జాకీ పరిశ్రమకు అప్పటి తెదేపా ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ 27 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి రూ.10 కోట్లు డిమాండు చేయడంతో సదరు పరిశ్రమ యాజమాన్యం ముడుపులు ఇచ్చుకోలేక జిల్లా నుంచి వెళ్లిపోయారన్నారు. పరిశ్రమ ఏర్పాటు అయి ఉంటే ఆరు వేలకు పైగా ఉద్యోగాల సృష్టి జరిగేదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆరోపణ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి సీపీఐ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బెదిరించాడన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి మల్లికార్జున, నగర కార్యదర్శి శ్రీరాములు, లింగమయ్య, తెదేపా నాయకులు కొండప్ప, నారాయణస్వామి, కాంగ్రెస్‌ నాయకులు శంకర్‌, గోవిందు, ఇతర నాయకులు రమణయ్య, అల్లీపీరా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని