logo

టమోటాకు ధర లేదప్పా!

మార్కెట్‌కు సరకు ఎక్కువ వస్తే ధరలు తగ్గుతాయి. తక్కువ వస్తే సాధారణంగా ధరలు పెరుగుతాయి.

Published : 30 Nov 2022 05:52 IST

మార్కెట్‌కు వచ్చిన ఎర్రపండు

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: మార్కెట్‌కు సరకు ఎక్కువ వస్తే ధరలు తగ్గుతాయి. తక్కువ వస్తే సాధారణంగా ధరలు పెరుగుతాయి. అయితే అనంతపురం టమోటా మార్కెట్‌లో మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రైవేటు మార్కెట్‌ కావడంతో అధికారుల పర్యవేక్షణ లేక ధరలు దిగజారుతూనే ఉన్నాయి. రైతులు అహర్నిశలు కష్టపడి పంట పండించి మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులే బాగుపడుతున్నారు. నిత్యం అనంతపురం మార్కెట్‌కు 2,500-3,000 టన్నుల వరకు టమోటా వచ్చేది. ప్రస్తుతం 1,000 టన్నుల్లోపే వస్తోంది. మంగళవారం మార్కెట్‌కు 915 టన్నులు వచ్చాయి. ఇక ధరలు పరిశీలిస్తే.. కనిష్ఠంగా కిలో రూ.3, మధ్యస్థ ధర రూ.4.50, గరిష్ఠ ధర కిలో రూ.8.50 వరకు పలికింది. అంటే 15 కిలోల బాక్సు రూ.45 నుంచి రూ.127.50 పడింది. మార్కెట్‌లో గరిష్ఠ ధర కొద్ది మంది రైతులకు మాత్రమే దక్కింది. ఎక్కువ భాగం రూ.30కే బాక్సు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మచ్చలున్న టమోటా 15 కిలోల బాక్సు రూ.10-20కు వదిలేసి వెళ్లిపోయారు. చాలా మంది రైతులు రవాణాకు గిట్టుబాటు కాక తోటల్లోనే పంటను వదిలేశారు. మార్కెట్‌కు రైతులు టమోటా తీసుకొస్తే వ్యాపారులు కిలో రూ.2-3 చొప్పున కొంటున్నారు. అదే వ్యాపారులు కిలో రూ.10కు తగ్గకుండా వినియోగదారులకు అమ్ముకుంటున్నారు. వీటన్నింటికి కారణం బయట వ్యాపారులు మార్కెట్‌కు రావడం లేదని, సరకు తక్కువ రావడంతోపాటు ధరలు పడిపోయాయని ఉద్యానశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో ధరలు పడిపోతే ప్రభుత్వమే టమోటా కొనుగోలు చేయాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ఏపీ రైౖతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని