logo

ఒకటిన జీతాలు వచ్చేనా?

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతం చెల్లింపు కష్టంగా మారింది.

Published : 30 Nov 2022 05:52 IST

సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ మొరాయింపు
బిల్లుల అప్‌లోడ్‌లో కష్టాలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతం చెల్లింపు కష్టంగా మారింది. తాజాగా నవంబరు నెల జీతం డిసెంబరు ఒకటో తేదీన వస్తుందో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారంతో నవంబరు నెల ముగుస్తున్నా జీతాల బిల్లులు పూర్తి స్థాయిలో అప్‌లోడ్‌ చేయలేదు. సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ మొరాయిస్తోంది. ఒక బిల్లు అప్‌లోడ్‌కు దాదాపు గంటకుపైగా సమయం పడుతుండటంతో ఖజానా ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ప్రతి నెలా బిల్లులు సకాలంలో అప్‌లోడ్‌ చేసినా ఒకటో తేదీ జీతం రావడం కష్టమైంది. అక్టోబరు జీతం నవంబరు రెండో వారం దాకా చెల్లింపులు జరిపారు. ఈక్రమంలో డిసెంబరు ఒకటో తేదీ జీతం చెల్లింపులు అనుమానమే. రెండు రోజుల నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ మందగించినట్లు సీనియర్‌ ఎస్టీఓ ఒకరు ఆవేదనతో చెప్పారు.

3 వేలకుపైగా బిల్లులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 ఉప ఖజానా కార్యాలయాలు (ఎస్టీఓ) ఉన్నాయి. వీటి పరిధిలో 1383 మంది డ్రాయింగ్‌ డిస్‌పర్సమెంట్‌ అధికారులు(డీడీఓ) ఉన్నారు. అన్ని రకాల బిల్లులు 3 వేలకుపైగా అందుతున్నాయి. ప్రతి నెలా 17 నుంచి 25లోపు సంబంధిత డీడీఓల నుంచి ఎస్టీఓ కార్యాలయాలకు జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేస్తారు. 26 నుంచి 30లోపు సదరు ఎస్టీఓలు సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా నిర్దేశిత గడువులోపు సాగాలి. ఈనెల 27 వరకు సర్వర్‌ వేగంగానే పని చేసింది. రెండు రోజులుగా బాగా మందగించినట్లు తెలిసింది. ఇప్పటికి 60 శాతం బిల్లులే అప్‌లోడ్‌ అయినట్లు తెలుస్తోంది. బుధవారంలోపు ప్రక్రియ పూర్తి చేయడం కష్టమేనని ఖజానా ఉద్యోగులు చెబుతున్నారు.

1.37 లక్షల మందిపై ప్రభావం

అనంత, శ్రీసత్యసాయి జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు 1.37 లక్షల మంది ఉన్నారు. ఇందులో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, ప్రజా రవాణా, ఎస్కేయూ, జేఎన్‌టీయూ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులు 31 వేలు, పెన్షనర్లు 38 వేలు, ఉపాధ్యాయులు 18 వేలు, అప్కాస్‌ ఉద్యోగులు 25 వేలు, సచివాలయ ఉద్యోగులు 10 వేలు, గెజిటెడ్‌ అధికారులు 9,700, ఆర్టీసీ ఉద్యోగులు 5 వేలు చొప్పున ఉన్నారు. వీరంతా ప్రతి నెలా ఒకటో తేదీన జీతం కోసం ఎదురుచూస్తుంటారు. ఇంటి అద్దె, సరకులు, నెల వారీగా చెల్లింపులు ఉంటాయి. జీతం ఆలస్యమైతే ఇబ్బందులు పడాల్సిందే.

ప్రక్రియ పూర్తి చేస్తాం

సరళా విజయకుమారి, డీడీ, జిల్లా ఖజానా శాఖ

సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్‌ కొంత నిదానమైంది. ఇప్పుడు ఇబ్బంది లేదు. జీతాల బిల్లులు అప్‌లోడ్‌ చేస్తూనే ఉన్నాం. బుధవారంలోపు పూర్తి చేస్తాం. అన్ని ఎస్టీఓ కార్యాలయాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్నిసార్లు సర్వర్‌ ఇబ్బంది పెట్టినా ఆఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. బిల్లులు అప్‌లోడ్‌ చేసేంత వరకే పని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని