logo

గర్భిణులకు ఆపద్బాంధవుడు!

సామాన్య కార్మికుడైనా.. ఆయన సేవాభావం సమున్నతం. రక్తం కావాల్సిన వారిని ఆదుకోవాలన్న సదాశయంతో వివాహం కూడా చేసుకోకుండా ముందుకు సాగుతున్నారు గుంతకల్లు పట్టణం మొదినాబాదు ప్రాంత నివాసి తిప్పన్న.

Published : 30 Nov 2022 05:52 IST

103 సార్లు రక్తదానం చేసిన కార్మికుడు

రక్తదానం చేస్తున్న తిప్పన్న

గుంతకల్లు, న్యూస్‌టుడే: సామాన్య కార్మికుడైనా.. ఆయన సేవాభావం సమున్నతం. రక్తం కావాల్సిన వారిని ఆదుకోవాలన్న సదాశయంతో వివాహం కూడా చేసుకోకుండా ముందుకు సాగుతున్నారు గుంతకల్లు పట్టణం మొదినాబాదు ప్రాంత నివాసి తిప్పన్న. ప్రస్తుతం యాభై ఏళ్ల వయసున్న ఆయన గత 18 సంవత్సరాల్లో 103 సార్లు రక్తదానం చేశారు. పలు సేవాసంస్థల నుంచే కాకుండా స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి నుంచి కూడా పురస్కారాలు అందుకున్నారు. ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు రక్తాన్ని అందించారు. రక్తం లభించలేక ఎవరూ చనిపోకూడదనీ.. అలా ఎవరైనా చనిపోతే సమాజంలోని అందరూ బాధ్యులే అవుతారని ఆయన అభిప్రాయం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఆయనకు కబురు అందిస్తే చాలు.. వెంటనే అక్కడికి చేరుకుని రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడుతున్నారు. అతను నిరుపేద అయినా కూడా గొప్ప మనసున్న వ్యక్తిగా పేరు పొందారు. కూలీ పనులకు వెళుతూ కాలం గడుపుతున్న ఆయన సేవా గుణాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. సమాజ సేవే పరమావధిగా భావిస్తున్న తిప్పన్న అంటే మిత్రులు కూడా ఎంతగానో అభిమానిస్తారు.

కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ..

సకాలంలో రక్తం లభించక ఎవరైనా చనిపోతే.. దానికి సమాజం బాధ్యత వహించాల్సి ఉంటుంది. లక్షల మంది మధ్య కొందరు రక్తహీనతతో చనిపోవడం మంచిది కాదు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా గర్భిణులు చనిపోతే కడుపులో ఉండే బిడ్డలకు కూడా ప్రాణాపాయమే. అందుకే వారికి రక్తం అందించి ఆదుకుంటున్నాను. దీంతో గర్భిణులు ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటోంది. చివరి వరకు రక్తదాతగానే కొనసాగుతా.      

తిప్పన్న

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని